గజల్:-సముద్రాల శ్రీదేవి
దుక్కిదున్నె ఒంటినుండి రాలుతుంది చెమటచుక్క
రాళ్లుకొట్టె భుజముపైన వాలుతుంది చెమటచుక్క

నష్టాలే మోసిమోసి నలుగుతున్న బక్కనైన
కష్టజీవి  గుండెలపై కాలుతుంది చెమటచుక్క

కంటిలోయనుండిజారెకన్నీటిని చూసుకుంటు
తనబ్రతుకేచిన్నదనుచు కూలుతుందిచెమటచుక్క

అడుగుఅడుగు మడుగుగాను మారినపుడు గొప్పగాను
కష్టమనే సంపదంత గ్రోలుతుంది చెమటచుక్క

నేటితోను ముగింపునే కోరుకునెడి జీవిలోన
ఆశలన్నిరేపు నిలువ తోలుతుంది చెమటచుక్క

ఎప్పుడైన ఒక్కసారి ఆనందం వెల్లివిరిసి
సంతోషంనిండినపుడు కేళుతుంది చెమటచుక్క

కాళ్లకేను కష్టమిడుచు నిపుణతనే వ్రేళ్లకిడుచు
లోకాలను  ఎళ్లవేళ ఏలుతుంది చెమటచుక్క

ముసలితండ్రి బాధంతా వయసుకొడుకు భుజముచేరి
పంచుకునెడి బాధ్యతతోచీలుతుందిచెమటచుక్క

శ్రీదేవే శ్రమియించెడి వేళలోన వెంట ఉండి
అలసిపోయిపడుకుంటే తూలుతుంది చెమటచుక్క