అదిగో అలా ఉందాం!:-- యామిజాల జగదీశ్

 1965లో విడుదలైన తమిళ సినిమా "ఆయిరత్తిల్ ఒరువన్" (వేయి మందిలో ఒకడు ఈ మాట అర్థం). ఈ చిత్రానికి సంగీతం విశ్వనాథన్ రామమూర్తి. ఓ సన్నివేశానికి పలువురితో పాట రాయించినా అవేవీ నచ్చకపోవడంతో కథానాకుడు ఎంజీఆర్ కవి కణ్ణదాసన్ తో పాట రాయించుకున్నారు. కణ్ణదాసన్ తనకు సన్నివేశం చెప్పడంతోనే పాటను రాసిచ్చారు. అందులో ఏ ఒక్క మాటా మార్చమని కోరకుండా ఎంజీఆర్ ఆ పాటను ఒకే చేశారు. ఆ పాట ఇప్పటికీ వింటుంటే బలే ఉందనిపిస్తుంది. నాకు దానిని పాట రూపంలో రాయడం తెలీదుకానీ భావాన్నిస్తాను.....
అదిగో 
ఆ పక్షిలా బతకాలి!
అదిగో 
ఆ అలలలా ఆడాలి!
ఒకే నింగిన
ఒకే నేలపైన 
ఒకే గీతం
హక్కుతో ఆలపిద్దాం!
గాలి
మనం బానిసలని
తప్పుకోలేదు!
కడలి నీరు
బానిసని కాల్చలేదు!
కాలం
మనల్ని విడిచిపెట్టి 
నడచిపోవడం లేదు!
ప్రేమ
పాశం
అమ్మతనం
మనల్ని మరవడం లేదు!
పుట్టినప్పుడు
అమ్మ లేకుండా పుట్టలేదుగా!
మాట లేకుండా
భాష లేకుండా మాట్లాడలేదుగా!
ఉంటునన్ని రోజులూ
ఆకలి లేకుండా బతకలేదుగా!
పోతున్నప్పుడు 
వేరు దారిన పోవడం లేదుగా!
కోటి జనం కలిసి బతకాలి 
స్వేచ్ఛగా!
ఆలయంలా దేశం చూడాలి 
స్వేచ్ఛగా!!
భయం లేక
ఆడుతూ పాడుతూ గడపాలి 
స్వేచ్ఛగా!!
బానిసగా బతికే భూమి అంతటా
చూడాలి స్వేచ్ఛగా!!
ఒకే నింగిన
ఒకే నేలన
ఒకే గీతం
హక్కులతో ఆలపిద్దాం!!

కామెంట్‌లు