నేను చేసే మంచి పనులు....అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు  మాష్టారు ఇలా చెప్పారు  "మనభారతదేశం ధర్మ కర్మభూమి. ఆర్ష ధర్మం సత్యం అహింస నీతిన్యాయం అన్నీ పురాణం ఇతిహాసాల్లో ఉన్నాయి. మీకు ఒక అంశం ఇస్తా. రోజూ ఒకరు దానిపై మీరు చేసే పనుల గూర్చి రాయాలి. సరేనా?" ఓ ..అన్నారు అంతా.
ఆమరునాడు రోహిత్  తను చేసే మంచి పనులు గూర్చి  రాసిన  వ్యాసం చదివాడు."అహింసా పరమోధర్మ: అనవసరంగా ఏప్రాణిని హింసించరాదు.బుద్ధుడు చెప్పినది ఇదే.బుద్ధుడు దేవదత్తుని బాణంతో గాయపడిన హంసను కాపాడి దానికి చికిత్స చేశాడు. ఆహంసను తనకి ఇవ్వమని అడిగినా ఇవ్వడు.రాజసభలో  ఆహంస బుద్ధుని దగ్గరకు వెళ్లి తన కృతజ్ఞతచాటింది. నేను కూడా  ఇంటికి వెళ్లేతోవలో కొందరు కొంటె పిల్లలు కుక్క పిల్లల తోకలు పట్టుకుని ఏడిపించుతుంటే వారికి నచ్చ జెప్పి మాఇంటికి తీసుకుని వెళ్ళాను.మాఅమ్మ దానికి పాలు చిన్న మూకుడు లో పోస్తే గటగటా తాగేసింది."నిజమేమరి!కొంత మంది వాటి కాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసి చప్పట్లు చరుస్తూ ఆనందిస్తారు.ఇంకొందరు త్రోబాల్ లాగా  ఎగిరేస్తారు. తమసైకిల్ వెనకాల తాడు తో కట్టి స్పీడుగా తొక్కటం మనలోని క్రూరత్వంకి పరాకాష్ఠ. పాపం అవి పరుగెత్తలేక అలసిపోయి  ప్రాణాలు  వదిలిన సంఘటనలు  పేపర్  టి.వి.లో చూస్తాం.మన కాలు చేతిని  ఎవరైనా  బలవంతుడు గుంజినా మెలిపెట్టినా మనం ఎంత బాధ పడుతాం?అలాంటివి చూసినప్పుడు  మీరు  ఊరుకోవద్దు.సరేనా?"
అంతా తల ఊపారు.