ఎక్కువ తక్కువ!...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు మాష్టారు వచ్చేప్పటికీ  పిల్లలు అంతా చిరుబురులాడుతున్నారు. లీడర్ ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు.ఎవరికి వారే యమునా తీరే లాగా వాదులాడుతున్నారు. "
 "నీకు అన్నింటిలో తక్కువ మార్కులు వస్తాయి. నేను  క్లాస్ ఫస్ట్!నేను లీడర్ ని" రాజు శివ ని బెదిరించడం అంతావింటున్నారు.కొందరు శివని సమర్ధించారు."మార్కులు కాదు ముఖ్యం.నడవడి మాటామంతీ ". ఇంకొందరు రాజుని సమర్ధించారు.వాడు తమకి తెలియని విషయాలు చెప్తాడు.  ఒక్కొక్కసారి  స్లీప్  టెస్ట్ లో జవాబులు కూడా చెప్తాడు. అందుకే  బద్ధకస్తులు మార్కులు తక్కువ వచ్చేవారు వాడికి జైజై సైసై అంటారు.  మాష్టారు  రాగానే  సంగతి గ్రహించి  అల్లరి పిల్లలని నించోబెట్టి మిగతా వారిని "సిట్ డౌన్ "అన్నారు. అందరూ చేతులు చాపి చేతి వేళ్ళు పరిశీలించండి  అన్నాడు. "సీతా!వేళ్ళు  ఎలా ఉన్నాయి?"
సమానంగా లేవుసార్!  ఇలా అందరూ  ఔను అనగానే  ఆయన  అన్నారు "మీలాగే  వేళ్ళు  కూడా పోట్లాటలోకి దిగాయి. బొటనవేలు అంది"నేను పొట్టిగా లావుగా బలంగా ఉన్నా.నేను లేకుంటే అన్నం తినలేరు.పెన్ను పట్టుకోలేరు.నేను గొప్ప. "చూపుడువేలు అంది"నేను ప్రతి వస్తువు  వ్యక్తి ని చూపి మీకు  దిశానిర్దేశం చేస్తాను.బెదిరిస్తా." "నేను  మీఅందరిమధ్య పొడుగ్గా ఉన్నా.కుంకంబొట్టు పెట్టాలన్నా  దైవ పూజ లో నన్ను ఉపయోగించుతారు." ఉంగరం వేలు తన ఉంగరం చూపుతూ "ఐశ్వర్యమంతా నాదే!"అంది. పాపం చిన్న చిటికెనవేలు భయంభయంగా అంది"నేను మీ అందరి కన్నా చిన్న  సన్న  దాన్ని. కానీ దేవునికి పెద్దలకి  దండంపెట్టేటప్పుడు  నేనే అందరికీ  కనపడతాను."
సార్ అడిగాడు "పిల్లలూ!ఇప్పుడు చెప్పండి ఏ వేలు గొప్ప దో?మీరు  ఒక వేలు మడిచి  మిగతా వాటితో ఏపని అయినా  సులభంగా చేయగలరా?ప్రయత్నించండి." ఉహూ అన్నారు ముక్తకంఠంతో. "ఆ..అంతా లేచి నించోండి.పొట్టిగా పొడుగుగా రకరకాల సైజుల్లో ఉన్నారు. చదవులో వెనుకపడినవారు  పొట్టివారు  ముందు కూచోవాలి.ప్రతి బెంచీచివర బాగా చదివే సాయం చేసేవారు  లీడర్ గా ఉండాలి. రోజూ  పోట్లాటలోకి దిగితే సమయం వృధా. మనదేశం లో కోట్లాది జనం.అందరం అందలం ఎక్కితే మోసేవాడు ఎవడు? ఎవరి అర్హత గొప్ప వారిది.అలా అని ఇతరులని హేళన చేయటం తప్పు. చేతి వేళ్ళు లాగా  ఎవరి స్థాయిలో  ఎవరిచోట వారు ఉండి  తమ ధర్మం నిర్వహించాలి. ఆయాలు వాచ్మన్ లేకుండా స్కూల్ నడవదు కదూ?" అంతే  గబగబా తమకి సార్  కేటాయించిన చోట వారు  కూచున్నారు.బెల్ కాగానే ఇంకో టీచర్ వచ్చేదాకా  పిల్లలు  నిశబ్దం గా ఉన్నారు.క్రమశిక్షణ లేకుంటే  చదువు వ్యర్థం.
కామెంట్‌లు