అయినా....:-- యామిజాల జగదీశ్
 ఇద్దరికీ మాటలు వచ్చు. 
ఇద్దరం వయస్సులో అరవై దాటాం.
ఇద్దరిదీ వేర్వేరు ప్రాంతాలవారిమి.
ఆయనది ఒరిస్సా.
నాది మద్రాసు.
ఇద్దరికీ తమ తమ ప్రాంతాలంటే మహా ఇష్టం.
నాకూ రెండు భాషలొచ్చు.
ఆయనకూ రెండు భాషలొచ్చు.
నాకు తెలిసింది ఆయనకు తెలీదు.
ఆయనకు తెలిసింది నాకు తెలీదు.
కానీ
ఇద్దరం హైదరాబాద్లో కలిసాం. 
పక్కపక్క ఫ్లాట్లో ఉంటున్నాం.
రోజులో ఏదో సమయంలో
మా ఇంటికొస్తారు.
ఇద్దరం మొహాలు చూసుకుంటాం.
ఇద్దరం నవ్వుకుంటాం.
కానీ భాషలు తెలిసినా
మాటలు రాని మూగోళ్ళలా 
ఓ అర గంట గడుపుతాం.
ఇద్దరూ మాట్లాడాలనుకుంటాం.
కానీ ఏం లాభం?
ఆయనకొచ్చిన ఒరియా, హిందీ 
నాకు పొట్ట పొడిచినా రావు.
నాకు తెలిసిన తెలుగు, తమిళం 
ఆయనకు రావు.
కనుక 
ఇద్దరం "మాటలొచ్చిన మూగవాళ్ళై" 
సెకండ్లనూ
నిముషాలనూ
మౌనభారంతో
అతి కష్టంతో 
గడిపేస్తాం....
ఆయన లోపలికొచ్చే ముందొక నవ్వు
వెళ్ళేముందొక నవ్వు
ఈ నవ్వే అర గంటకటూఇటూ
రెండుసార్లు 
మా మూగపెదవంలపై 
సన్నగా వికసిస్తాయి....