బహుమతి అనేది ఓ గుర్తింపు. అందులోనూ మొట్టమొదటి బహుమతి అనేది ప్రోత్సాహమూ. చిరస్మరణీయమూ. నాకైతే విద్యార్థి జీవితంలో తొలి బహుమానం కాలేజీలో పొందటమే. బహుమతైతే ముందే మా ప్రొఫెసర్ నేలటూరి భక్తవత్సలంగారు చెప్పినప్పటికీ వేదికపైకెళ్ళిబహుమతి అందుకునే వరకూ ఏమిటో తెలీని ఆనందమూ జంకూ వణుకూ. ఆ తర్వాత మరో రెండేళ్ళు బహుమతులు అందుకున్నప్పుడు అవేవీ లేవు. అంతే, ఆ తర్వాత నా జీవితంలో ఇంకెప్పుడూ నాకా అర్హతా అవకాశమూ కలగలేదు. అదలా ఉండనిస్తే ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావుగరి ఆచార్యక స్వర్ణోత్సవ సంచిక చదువుతుంటే అందులో భరాగోవారి వ్యాసంలో ఓ విషయం తెలిసింది.
కొత్తపల్లివారిని గుర్తు చేసుకుంటూ తను జీవితంలో అందుకున్న మొదటి బహుమతి గురించి ప్రస్తావించారు.
1948 ఆగస్టు 15 వ తేదీకి విజయనగరం కస్తూరిబా స్మారక పఠన మందిరం వారు "స్వాతంత్ర్య దినోత్సవం" పురస్కరించుకుని ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీకి గాను తొలుత స్వాతంత్ర్య పోరాటం అనే అంశాన్నిచ్చారు. అప్పుడు భరాగో వారు తమ పేరివ్వలేదు. అయితే నిర్వాహకులు ఈ అంశాన్ని మార్చి సంఘసంస్కారం - చట్టం పాత్ర అనే దానిపై పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న భరాగో వారు వ్యాసం రాయడానికి తోచక ఓ చిన్న కథ రాసిచ్చారు. ఈ కథలో ఆయన సంఘసంస్కారం పట్ల చట్టం సాధారణంగా విఫలమవుతుందనీ, ఆలస్యం జరుగుతుందనీ సూచిస్తూ ప్రజల్లో బుద్ధీ చైతన్యం అంటే సంస్కారం సులువవుతుందని తమ కథలోని పాత్రలద్వారా చెప్పించారు. ఈ కథకు ఆయనకు మొదటి బహుమతి లభించింది. అయితే అప్పుడు ఈ పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది కొత్తపల్లి వీరభద్రరావు మేష్టారేనట. తన నలభై మూడేళ్ళ రచనా జీవితంలో ఎన్నో ప్రెయిజులు రాలేదు కానీ ఈ బహుమతే మొదటిదని, అదే తన తొలి కథ అని భరాగో వారు చెప్పుకున్నారు. ఇది ఆయన జీవితంలో చిరస్మణీయమై నిలిచింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి