అలనాటి ఆడపిల్లలకుశత్రువు కన్యాశుల్కమయ్యె
ఈనాటి యువతి మెడకు గుదిబండ వరకట్నము !
ఎన్నియుగాలు మారినా మారని బ్రతుకులు స్త్రీలవి
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము.....!!
------------------------------------------------------------------
కూతుళ్లను ఆశగా కన్న తల్లిదండ్రుల వ్యధలు,
కొడుకులను గర్వముగ గన్న జననీజనకుల బాధలు
ఈ ఆధునిక యుగాన ఇంచుమించు సమానమేలే ..
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము.....!!
---------------------------------------------------------------
చదువు సంధ్యల పేరుతో సమయమంత వెచ్చించి
బ్రతుకు తెరువు కోసమై ఉద్యోగాన్వేషణలో పడి
యవ్వనకాలమంతా అడవి కాసినవెన్నెలాయే ...
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------
పాఠ్యపుస్తకాలనే సర్వస్వముగ భావించు యు వత
బ్రతుకు పుస్తకాలవంక అసలు కన్నెత్తి చూడరుకదా!
జీవనసూత్ర మార్గమెరుగక తలక్రిందులౌదురు వీరు
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము ....!!
----------------------------------------------------------------
అర్ధరాత్రి పెళ్లిళ్లకు అభ్యంతరం చెప్పరెవరు ....
ముహూర్త బలమును తప్పుగా భావించ రెవరూ...!
డప్ఫు శబ్ధాలతో మంది నిద్ర చెడగొట్టుట భావ్యమా
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------
ఖర్చుచేసిన సొమ్ముతో పెళ్లిగోప్పదనము జెప్పెదరు
వంటకాల రుచులకథలు వేనోళ్ళ పొగడుదురు ..!
ఖర్చు చేసిన వానివెనుక కష్టాలు ఎవరికెరుక...?
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------
పెళ్లింటి లో ఒకనాఁడు గుప్పుమనెడి పప్పువాసనలు
గుమ్మడికాయ దప్పళాల నోరూరించే వంటకాలు ...
కాలము మారిపొయి బిర్యాని ఖ్యాతిపొందె సుమా !
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము ...!!
-----------------------------------------------------------------
పెళ్లిళ్ల పవిత్రతను పసిగట్టలేని ఆధునిక యువత ,
వైవాహిక భవిష్యత్ జీవితముపట్ల అంచనాలేక
తొందరపాటుతో విడాకుల వింత పాటపాడుదురు
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------
జీవనరాగం ...!! (ఆన్షీలు):-డా.కె.ఎల్వీ. ప్రసాద్ ,హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి