ప్రమాదంలో..ప ద ని స లు...!!;- ----బి.రామకృష్ణా రెడ్డి సఫిల్ గూడసికింద్రాబాద్

 బాల్యంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ సకల గుణాలు ఉంటాయి. ఆ వయసులోనే అవి ఎందుకూ అంటే.... ఏది మంచో ,ఏది చెడో, ఎటువైపు వెళ్ళాలో ,ఎటువైపు వెళ్ళకూడదో ఆలోచించలేని బలహీనత .సరైన వ్యక్తుల యొక్క పర్యవేక్షణలో ఉన్నప్పుడు సరైన దారి ఎన్నుకోవడంలో సఫలీకృతులవుతారు.
   ఇక స్వయంగా నా విషయానికి వస్తే ..చిన్న తనంలో నాకు ఎన్నో బలాలు, బలహీనతలు, తుంటరితనము అధికంగా ఉండేటివి. బలాలు అంటే ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళడం, ఏ పనైనా చేయటం, ఎవరితోనైనా మాట్లాడటం. అలాగే బలహీనతల విషయానికి వస్తే ఒక్కోసారి బేలతనం ,ఎవరితో చెప్పాలో తెలియక పోవటం ,లోపల్లోపలే మదన పడటం, ఇటువంటివి.
    మాది పల్లెటూరి రైతు కుటుంబం .ఆరు మంది అన్నదమ్ములతో, ఇద్దరు అక్కచెల్లెళ్ళతో  కలిసి భారీకుటుంబం. వేసవికాలంలో పిల్లలందరం ఊరికి బయట ఉన్న  చెరువు వాగులో ఈతకు వెళ్లేవాళ్లం. నేను ఒకసారి , నా తర్వాతి ఇద్దరు తమ్ముళ్ళతో, మిగతా పిల్లలతో కలిసి వాగులో ఈత కొడుతున్నాము. అందరూ కూడా 10, 14 ఏళ్ల మధ్య వయసు వాళ్లే .ఇందులో ఎవరికీ ఈత సరిగా రాదు. అదే వాగు గట్టుపై చాలామంది చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతూ ,అలాగే రైతులు పశువులను  శుభ్రంచేస్తూ ఉండేవారు. నేను అలా  ఈదులాడుతూ, నా తమ్ముళ్లను గమనిస్తూ ఉన్న సమయంలో, నాకు కొంచెం ఎడంగా ఉన్న ఇద్దరు తమ్ముళ్ళు నీటిలో మునిగిపోవడం గమనించాను. వాళ్ల కాళ్ల కింద  లోతైన గుంత ఉండటమే కారణం. ఆ సమయంలో నాలో ఉన్న బలహీనత బయటపడ్డది .అది ఎలాగంటే ఎవరిని సహాయం చేయమని అగకపోవటం ,నేను స్వయంగా వాళ్లను రక్షించడానికి ప్రయత్నం చేయకపోవటం ,గట్టిగా కేకలు వేయకపోవడం ,పైగా నాలోనే  నేను రోధిస్తూ అక్కడే నిలబడి పోయాను.
    గట్టు బయటే ఎందరో రైతులు ,మరియు చాకలి వాళ్ళు ఉన్నప్పటికినీ ఈ నీటిలో  మునిగిపోతున్న పిల్లల్ని ఎవరూ గమనించలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు .అప్పుడే ఒక అద్భుతం జరిగింది ...ఎవరో పంపించినట్లు దూరంగా బట్టలు ఉడికిస్తున్న కేశవులు అనే చాకలి పరిగెత్తుతూ వచ్చి, నీటిలో దూకి ,నా ఇద్దరి తమ్ముళ్లను తన రెండు చేతులతో పట్టుకుని బయటకు లాగాడు. వారిని గట్టుమీద పడుకోబెట్టి పొట్టనొక్కి  నీటిని నోటి ద్వారా బయటకు వచ్చేటట్లు చేసి, ఎవరి పిల్లల అయ్యా! వీళ్ళు అని గట్టిగా అరిచాడు .చుట్టుపక్కల ఉన్న పిల్లలు"వీళ్లు అతని తమ్ముళ్లు "అని నా వైపు వేలుపెట్టి చూపారు. ఆయన నన్ను గట్టిగా మందలించి" అక్కడే ఉండి పోయావే కనీసం అరవలేదు ,ఇప్పుడైనా బయటికి రా "అని గట్టిగా దబాయించాడు. అందరితో బయటకు రాకపోవడానికి కారణం నాకు ఒంటి మీద నిక్కరు కూడా లేదనే సిగ్గుతో.
      ఆరోజు కేశవులు అపర చెన్నకేశవుని రూపంలో వచ్చి వారిని రక్షించాడు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.ఆ ఇద్దరి తమ్ముళ్లలో పెద్దవాడు తన 32వ ఏట విద్యుత్ ఘాతముతో అకాలమరణం పొందాడు. రెండవవాడు పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ,ఒక సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ చేసి ,నాతో పాటు హైదరాబాదులో నివాసముంటున్నారు. ఆ సంఘటన అప్పుడప్పుడూ తలచుకొంటే భయంతో ఒళ్లు గగుర్పాటు చెందుతుంది.
 .
కామెంట్‌లు