వేణువు మోక్షం:-- జగదీశ్ యామిజాల

 ఒక సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని ప్రముఖంగా ప్రస్తావించారు తమిళ కవి కణ్ణదాసన్. 
"కృష్ణుడు నా చక్రవర్తి. 
కృష్ణుడి పాట వింటే 
ఎండిన చెట్టూ మళ్ళీ చిగురిస్తుంది...."
అని కణ్ణదాసన్ చెప్పడంతోనే సభా ప్రేక్షకులలో ఒకరు లేచి నిల్చుని "మీరు చెప్పేది నిజమైతే కృష్ణుడి చేతిలో ఉన్న వేణువు చిగురించాలి కదా? ఎందుకంటే వేణువూ ఎండిపోయినదే కదా" అన్నాడు.
సభలోనే మరికొందరు ఆ సహ ప్రేక్షకుడిని కూర్చోమని గోల. 
అయినప్పటికీ ప్రశ్నించిన ప్రేక్షకుడికి కణ్ణదాసన్ ఎలా జవాబిస్తారా అని అందరూ ఎదురుచూసారు. 
ఆప్పుడు కణ్ణదాసన్ ఏ మాత్రం తొట్రుపాటుపడక నిదానంగా చెప్పారు...
"కృష్ణుడి గానం వింటే ఎండిన చెట్టూ చిగురిస్తుంది. కానీ వేణువు కృష్ణుడి చేతిలో ఉంటూనే ఉంది. స్వామి చూపులు స్పర్శిస్తే మరు జన్మంటూ ఉండదు. తిన్నగా మోక్షమే. అందుకే వేణువు చిగురించలేదు" అని.
ఈ మాటలతో చెప్పాలా ఇక సభలో ఏం జరిగిందో...చప్పట్లతో సభ మార్మోగింది.

కామెంట్‌లు