ఎవరు మూర్ఖుడు? అచ్యుతుని రాజ్యశ్రీ

 ధర్మపురి రాజు సుసేనుడు.అతని దర్బార్ లో ఉత్తమ యుద్ధవీరుడు ఉత్తమ పండితుడు  ఉత్తమ చిత్రకారుడు  ఉత్తమ కవి. .ఇలా హోదాలు కల్పించాడు.ఎంతటివారికైనా కాస్త రిమ్మ తెగులు  వేపకాయంత వెర్రి ఉంటుంది. రాజుకి ఓ ఆలోచన వచ్చింది. ఉత్తమ మూర్ఖుడు హోదా కల్పించి చాటింపువేయించాడు."మహామూర్ఖులు మీమీ అర్హత తెలుపండి. రాజాస్థానంలో ఆపదవి పొందండి." ప్రత్యేకంగా కొందరు గూఢచారులను కూడా  నియమించాడు. నెలలతరబడి వెతికినా మూర్ఖులలో శ్రేష్ఠుడు కనపడలేదు. కానీ  ఒకచెట్టు కొమ్మపై కూచున్న వ్యక్తి  ఆ కొమ్మను నరకటం చూసి  గూఢచారి  వాడిని రాజు దగ్గరికి తీసుకుని వెళ్లాడు. రాజు వాడికి ప్రత్యేకంగా సింహాసనం ఏర్పాటు చేశాడు.మెడలో ఒక పతకం వేలాడదీశాడు.దాని పై మూర్ఖుల నాయకుడు అని రాసిఉంది."రాజా!ఎన్నాళ్ళు నేను ఈపతకం మెడలో ఉంచుకోవాలి?" "నీకన్నా  గొప్ప మూర్ఖుడు కనపడేదాకా?" కొన్నాళ్ళకి ఆరాజుకి జబ్బు చేసి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా  మూర్ఖుడు వచ్చి "భగవధ్యానం చేస్తున్నావా?దైవస్మరణ చేయి"అంటే రాజు  ఏమన్నాడో తెలుసా ?"ఉహు..నేను  చాలా విషయాలను గూర్చి ఆలోచిస్తున్నాను. నాకు తీరుబడిలేదు." వెంటనే ఆమహా మూర్ఖుడు "రాజా!నీకన్నా  గొప్ప మూర్ఖుడు ఇంకా ఎవరుంటారయ్యా?చిన్న విహారయాత్రకై  తీర్ధయాత్రకై  మనం ఎన్నో రోజుల ముందే  అన్నీ సిద్ధం చేసుకుంటాము.చావుకి సిద్ధంగా ఉన్న నీవు  దైవస్మరణ చేయకుండా  ఇంకా ఆలోచనలో మునిగితేలుతున్నావంటే నిన్ను మించిన  మూర్ఖుడు ఇంకెవరుంటారు?"అని తన మెడలోని హారాన్ని రాజు మెడలో వేశాడు.మనం  ఎన్ని పనులలో మునిగితేలుతున్నాకూడా  భగవంతుని మరవరాదు.ఎవరిమతం సంప్రదాయం ప్రకారం  వారు తమ ధర్మాన్ని  అనుసరిస్తూ  పరోపకారం చేస్తూ  తమ జన్మ సార్ధకం చేసుకోవాలి సుమా!
కామెంట్‌లు