ధర్మపురి సామ్రాజ్యాన్ని పరిపాలించే సుధర్ముడు అనే రాజు రాజ్యాన్ని ధర్మవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుతూ ఏ సమస్యలు లేకుండా చూసుకుంటున్నాడు. పొరుగునే శ్రీపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రముడు మితిమీరిన రాజ్యకాంక్ష కలవాడు. ధర్మపురి రాజ్యంపై కూడా కన్ను వేశాడు.
ఇంతలో ఒక అంతుచిక్కని మహమ్మారి దేశ విదేశాలనూ అతలాకుతలం చేస్తుంది. ప్రాణనష్టం పెరుగుతుంది. దేశ విదేశాల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎంతగా ఉందో, ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోతున్నారో తెలుపుతూ విక్రముడు రాజ్యం అంతటా ప్రచారం చేయిస్తున్నాడు. వ్యాధి సోకితే బ్రతకడం కష్టమని, వ్యాధి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేయిస్తున్నాడు భయపెడితే ప్రజలు జాగ్రత్తగా ఉంటారని విక్రమునిక ఉద్దేశం. కానీ ఆ రాజ్యంలో మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. చనిపోయే వారి సంఖ్య మరింత పెరిగుతుంది.
ధర్మపురి రాజ్యంలో మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కొద్ది రోజుల్లోనే మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. ఇది తెలుసుకున్న విక్రముడు గూఢచారులను పంపి కారణాలను తెలుసుకున్నాడు. సుధర్మడు ప్రజలను ధైర్యంగా ఉండమని, ఆ మహమ్మారి చాలా చిన్నదని, ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మహమ్మారి బారిన పడుతున్నారో ఎంతమంది కోలుకొని ఉత్సాహంగా తమ పనులను చేసుకుంటున్నారో ప్రచారం చేస్తున్నాడు. వైద్య సౌకర్యాలను పెంచి, ప్రజలను త్వరితగతిన కోలుకొనే విధంగా చేస్తున్నాడు. ప్రజల్లో ధైర్యం మరింత పెరిగి మహమ్మారిని జయిస్తున్నారు. ధైర్యమే మన రక్షణ కవచమని విక్రముడు గ్రహించాడు. సుధర్ముని మనసులోనే అభినందించి తానూ సుధర్ముని అనుసరించాలని అనుకున్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి