తెలివి తక్కువ చీమ కథ:-సత్యవాణి

  అనగా అనగా ఒక చిన్న చీమవుంది.దానికి జ్ఞానం తెలిసినప్పటినుండీ దానికి దాని బ్రతుకంటే చిన్నచూపే. ఎప్పుడూ తనను ఇంత  చిన్నజీవిగాపుట్టిచాడని దేవుడిమీద కోపమే. 
      అందుకే తననింత చిన్నజీవిగా ఎందుకు పుట్టించావు అని దేవుడిని అడగాలని నిశ్చయించుకొంది. 
     కానీ దేవుడు కనిపించడుకదా!అతడిని అడగడం ఎలా ?అని బాగా ఆలోచించింది.దానికి ఎవరో చెప్పినమాట గుర్తుకు వచ్చింది.అదేమిటంటే? దేవుడిని చూడాలంటె,తపస్సు చేయాలి అని.అందుకని చీమ తపస్సు చేయడం మొదలుపెట్టింది
       దేముడుకీవిషయం తెలిసింది."అయ్యో!ఆ చీమ చాలా చిన్నది. అలా ఆహారంతినకుండా నాకోసం తపస్సు చేస్తోంది. అలా చేస్తే పాపం చచ్చిపొతుందని జాలిపడి మర్నాడే దేవుడు ప్రత్యక్షమైయ్యి, "చీమా! అయ్యో ఎందుకిలా ఘోరంగా తపస్సు చేస్తున్మావు?"అని అడిగాడు.
      "ఓ దేవా! నీకెందుకింత పక్షపాతం? ఏనుగంత పెద్దపెద్ద బలమైన  జీవులను పుట్టించిన నువ్వే
మేమేంపాపంచేశామని ఇంత బలహీనంగా చిన్నగా పుట్టించావు?
అని దేవుడిని నిలదీసి అడిగింది.
        దానికి దేవుడు సృష్టిలోని ప్రాణులన్నీ నాకు సమానమే.ఎలాగంటే  కన్నతల్లికి తనపిల్లలు నల్లగావున్నా,తెల్లగావున్నా,పొడుగ్గావున్నా, పొట్టిగావున్నా,కుంటివాడైనా,గుడ్డివాడైనా ఎలాగైతే సమానమో అలాగే నాకు అందరూ సశానమే.అన్ని జీవులూ విలువైనవే,పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనంతొ!నే ఈ భూమిమీదకు పంపబడుతుంది.సరే నీవు అసంతృప్తితో వున్నావు కనుక ఏదైనా ఒక వరమడుగు ,తప్పక ఇస్తాను "అన్నాడు బ్రహ్మగారు.
            తనమీద తనకు అసంతృప్తీ,పెద్దజీవులపట్ల అసూయతో వేగిపోతున్న చీమ అనాలోచితంగా "అయితే దేవా!నేను ఎవరిని కుట్టినా చావాలి"అని వరమడిగింది.
       దయామయుడైన బ్రహ్మ "ఓ చీమా!బాగా ఆలోచించే అడిగావా ఈవరం బాగా ఆలోచించుకో!"అని
హెచ్చరించాడు.
          వివేకములేని చీమ "బాగానే ఆలోచించాను 
ఈవరం ఇవ్వు చాలు అంది.బ్రహ్మ" తదాస్తు" అని మాయమైపోయాడు.
       ముందు వెనుకలు ఆలోచించకుండా వరమడిగి,దాన్నిపొందిన చీమ గర్వతో , ముందుగా పాకుతూ వెళ్ళి ఒక మనిషిని గట్టిగాకుట్టింది. వెంటనే ఆమనిషి "అబ్బా!"అంటూ ఆ చీమను నలిపి చంపేశాడు.
         "చూశారా బాలలూ !అసూయ ఎంతపని చేసిందో!తననోటితో తానే తన చావుని వరంగాకోరుకొంది చీమ.నేను ఎవరినైతే కుడతానో ,వారు చావాలని దిని ఉద్దేశ్యం. కానీ ఎదుటివారిపై   కోపంతో,అసూయతో రగిలిపోతున్నప్పుడు మనము మాట్లాడే మాటలు కూడా ఆవేశంగా,అనాలోచితంగా మాట్లాడి ఆపదలో పడతామని ఈ కథ మనకు తెలుపుతోంది. అందుకనే అసూయా ద్వెషాలు వుండరాదు మనకు.
కామెంట్‌లు