ఉడుత సాయం:-- యామిజాల జగదీశ్

 ఇటీవల ఓ మిత్రుడు నన్ను కలిసినప్పుడు ఉడుతల గురించి చెప్పిన విషయం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. అదేంటంటే....
ఉడుతలు తమకిష్టమైన పండ్లను కోసుకుని 
ఓ చోట గొయ్యి తవ్వి అందులో దాచుకుంటాయట. ఆకలేసినప్పుడు అవి అక్కడికొచ్చి వాటిని తింటాయట. కానీ చాలా సందర్భాలలో అవి ఎక్కడ దాచాయో మరచిపోయి అటూ ఇటూ తిరిగి తిరిగి అలసిపోతాయట. వాటి సంగతి గుర్తుకురాక ఇక లాభం లేదనుకుని కొత్త పండ్లవేటలో పడతాయట. 
అలా ఉడుతలు భూమిలో దాచిన పండ్లలోని గింజలు విత్తనాలై అవి కొంత కాలానికి మొలకెత్తుతాయట. మొలకెత్తినవి ఎదిగి ఎదిగి మహావృక్షాలవుతాయట. చాలా అడవులలో భారీ వృక్షాల ఎదుగుదల చిన్న ప్రాణిగా అనుకునే ఉడుతల పుణ్యమేనట. ఇక్కడివరకూ అతను చెప్పిన విషయం బాగానే ఉంది. ఆ తర్వాత అతను చెప్పిన మరొక మాట ఇంకా బాగుంది. ఉడుతలల్లే మనిషీ ఉండాలట. 
"అంటే ఏమిటి?" అని అడిగాను నేను. 
అప్పుడు అతను "ఉడుతలల్లే మనంకూడా ఒకరికి చేసిన మేలుని మరచిపోవాలే తప్ప పది మందితోనూ చేసిన మేలు చెప్పుకోకూడదు. బాధలను ఎలా మరచిపోవాలనుకుంటామో అలాగే చేసిన మేలుని మనం మరచిపోవాలట. సాయం పొందిన వ్యక్తి మనం చేసిన మేలుని గుర్తు పెట్టుకుంటాడా లేదా అని ఆలోచించడం మన పని కాదు. అసలా ఆలోచన రాకూడదు..." అన్నాడు.

కామెంట్‌లు