ఓ స్మృతి:-- యామిజాల జగదీశ్

 జానకిరాంగారు!!
మన ఉదయం ఆఫీసు ప్రవేశ ద్వారంలో అడుగు పెట్టడంతోనే కనిపించే భద్రతాధికారి...ఖాకీ డ్రెస్సులో చూడటంతోనే ఓ పోలీస్ అధికారిలా కనిపించేవారు. ఖాకీ యూనిఫాం అంటే చిన్నప్పటి నించీ నాకు ఒకింత భయం. అందులోనూ జానకిరాంగారి ఒడ్డూపొడవుకి ఖాకీ యూనిఫాం అచ్చంగా సరిపోయి ప్రతి ఒక్కరి కదలికలనూ పసిగట్టే ఓ భద్రతాధికారిలా కనిపించేవారు. విధులలో గట్టిగా ఉన్నా మాటతీరు సున్నితంగా ఉండేది. 
నైట్ షిఫ్ట్ పూర్తయ్యాక నేనుండిన రాంనగర్ ఇంటికి వెళ్ళడానికి అయిదు పది నిముషాలు పట్టేది. అయినా అంత రాత్రి పూట ఒక్కడినే వెళ్ళడం ఎందుకని రాంనగర్ వైపు నించే వెళ్ళేవారెవరైనా తోడుంటారేమోనని చూసేవాడిని. అప్పుడప్పుడూ వేదాంతసూరిగారూ నేనూ కలిసి వెళ్ళేవాళ్ళం. లేదా ఎవరో ఒకరు తోడొచ్చేవారు. వేదాంతసూరిగారు రాంనగర్ గుండు సమీపంలో ఉండేవారు.
ఒక్కొక్కరోజు ఎవరూ రాకపోతే ఒక్కడినే బిక్కుబిక్కుమంటూ వెళ్ళేవాడిని.
ఎందుకంటే ఉదయం ఆఫీస్ నుంచి రాంనగర్ చౌరస్తాకెళ్ళే దారిలో కుక్కలెక్కువగా ఉండేవి. అలాగే తాగుబోతులూ తారసపడేవారు. వారిని చూస్తే చచ్చేంత భయం.
అయినాసరేనని ఒకరోజు నేనొక్కడినే మనసుని దిటవు చేసుకుని ఆఫీసులోంచి బయటపడ్డాను. రాంనగర్ చౌరస్తా సమీపిస్తుండగా కుక్కల అరుపులు విని ముందుకెళ్ళలేక మళ్ళా ఆఫీసుకొచ్చేసాను. 
అప్పుడు సెక్యూరిటీ విధుల్లో ఉన్న జానకిరాంగారు "ఏంటిసార్ వచ్చేసారు...ఏదన్నా మరచిపోయేరా?" అని అడిగారు. 
లేదండీ అంటూ కుక్కల అరుపులతో కలిగిన భయాన్ని చెప్పగా జానకిరాంగారు వెంటనే తమ బృందంలోనొకర్ని పిలిచి నన్ను స్కూటర్ మీద ఇంటికి పంపించారు. ఆ సంఘటన తర్వాత ఆయనకు సన్నిహితుడినయ్యాను. 
ఆఫీసు ఆవరణలోనేకాకుండా బయటెక్కడ కనిపించినా కూడా చిర్నవ్వుతో పలకరించేవారాయన. 
ఉదయం పత్రిక 1995 మే నెలలో మూతబడిన తర్వాత మళ్ళా ఆయనను చూడనేలేదు. 
ఇప్పుడీరోజు వాట్సప్ లోని ఉదయం గ్రూప్ లో ఆయన ఫోటోతో ఇకలేరన్న సమాచారం తెలిసి విచారమేసింది. 
జానకిరాంగారి ఆత్మకు 
శాంతిచేకూరాలని మనసా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను.