సోంబేరు తనం. ...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఓపిక ఉన్నంత వరకు మన పని చేసుకోవాలి. బద్దకం మనకు  బద్ధశత్రువు.జీవితం లో మనం ఏమీసాధించలేము. బాల్యం నించి పిల్లలకి  తమపని తామేచేసుకునే అలవాట్లు నేర్పితీరాలి.ఆట పాటల రూపంలో పని చేయిస్తే  పెద్ద అయినాక  పిల్లలు చురుగ్గా  తమకాళ్లపై తాము నిలబడగలరు. బాల్యం లో ముద్దు అతిగారాబం చేస్తే ఎందుకూ పనికిరానివారుగా తయారుఅవుతారు. జంతువులు కూడా చురుగ్గా లేకుంటే బలంగలవి దాన్ని చంపుతాయి.
మరి ఈకధ చదివినాక తెలుసు కుందాం బద్దకం  ఒంటెకి ఎలా ప్రాణాంతకం  అయిందో?
ఒంటెకి మొదట్లో అంత పొడవాటి మెడలేదు. తనుకూచున్న చోటు నించి కదలకుండా  నోటి కి ఆహారం అందాలని దాని కోరిక. అందుకే దేవుని గూర్చి తపస్సు చేసినది.ఆఖరికి దేవుడు ప్రత్యక్షమైనాడు."దేవా!నాకు చాలా పొడవైన మెడని ప్రసాదించు. నేను కూచున్న చోటునుంచే  చెట్టుపై ఉన్న  ఆకు అలములు తింటాను.అంత పొడుగ్గా  నామెడ సాగదీయి."  "అదేమి పిచ్చి కోరిక! బతికినన్నాళ్లు ఆరోగ్యంగా తిరగాలి.తిని కూచుంటే రోగాలు వస్తాయి. చిన్న వయసులో చిలోపొలో అంటూ తిరుగు."  కాదు కూడదని మొండి కేసింది.చేసేదేమిలేక  తథాస్తు ఆని వరం ఇచ్చాడు.ఇక కూచున్న చోటునుంచే చెట్టుకొమ్మలను ఫటాఫటావిరిచి  తినసాగింది.బద్దకం కూడా బాగా పెరిగి బాగా బలిసింది.  ఒకసారి  జోరుగా వర్షం  తుఫాను  ఈదురుగాలితో ఒంటె గుహలో తలదాచుకోవాలని వెళ్లింది.
 దాని శరీరం గుహలో పట్టలేదు. అందుకే బైట వర్షం కి తడుస్తూ  మెడమాత్రం గుహలో పెట్టింది. అందులో ఉన్న  వయసుమళ్లిన పులి ఆకలికి నకనకలాడుతూ  దాని మెడను కొరికి తినసాగింది.  ఒంటె ఎంత గింజుకున్నా  దాని మెడను బైటికి లాగలేకపోయింది. కావాలని అంత పెద్ద మెడను కోరి బద్ధకంతో ఒళ్లు బాగా పెంచి తన ప్రాణాలు పోగొట్టుకున్నది.దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడుతూ  శరీర శ్రమచేసే  కష్టజీవి కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోతాడు. గొంతెమ్మకోరికలు కోరితే ఆపదల పాలబడుతాం.
కామెంట్‌లు