వ్యాధి నిర్ధారణలో ....అటూ ....ఇటూ ....!!:-------------బి.రామకృష్ణా రెడ్డి సఫిల్ గూడ సికిందరాబాద్ .

 "వైద్యో నారాయణ హరిః!"
అనే సూక్తికి అనుగుణంగా మొదటి నుండి నాకు వైద్య వృత్తి పైన వైద్యుల పైన అపారమైన గౌరవం, భక్తి భావం ఉంది .కానీ నేటి సమాజంలో ఈ వైద్యులు అవలంభిస్తున్న వ్యాపార ధోరణి చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ,ఏ వైద్యపరీక్ష సరి అయినదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది .ఇటువంటి జాడ్యం కొద్దో గొప్పో వెనుకటి రోజుల్లో కూడా ఉండేది.
        అది 2006వ సంవత్సరం .నేను హైదరాబాదు 'రైల్వే రిజర్వేషన్' ఆఫీస్ లో పని చేస్తూ ఉండేవాడిని .మా అన్నయ్య కడప జిల్లాలోని రాజంపేట హై స్కూల్ లో తెలుగు పండిట్ గా పని చేస్తుండేవారు .ఆయన ఒక డయాబెటిక్ పేషంట్, అలాగే రెగ్యులర్ గా స్మోక్ చేస్తుండేవారు .ఆయనకు కావలసినటువంటి వైద్య పరీక్షల నిమిత్తం కడప పట్టణములోమాకు దూరపు బంధువు అయిన డాక్టర్ బాలిరెడ్డి గారి దగ్గరకు వెళ్తుండేవారు.
      ఒకసారి మా అన్నయ్య విపరీతమైన దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు .వారు జలుబు, దగ్గుకు సంబంధించిన మందులు ఇచ్చినప్పటికీ అవి తగ్గకపోవడంతో చెస్ట్ ఎక్స్-రే తీయించారు. ఆ ఎక్స్-రే లో, ఊపిరితిత్తుల ప్రక్కన పక్కటెముకలో  ఒక నల్లని మచ్చ కనిపించింది. ఆ డాక్టర్ గారు దానిని టీబి గా అనుమానించి మందులు ఏమి రాయకుండా హైదరాబాదులో  తనకు పరిచయం ఉన్న డాక్టర్ విజయకుమార్ (చెస్ట్ స్పెషలిస్ట్ )దగ్గరికి పంపారు. మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి ,ఆ డాక్టర్ గారి గురించి విచారించిన తర్వాత తెలిసింది... ఆయన మాకు సమీపంలో, నాకు పరిచయం ఉన్న డాక్టర్ అని. వారి దగ్గరికి వెళ్లి తిరిగి రెండవసారి ఎక్స్-రే తీసిన తర్వాత దానిని టీబీ గా నిర్ధారించి మూడు వారాలకు సరిపడ మందులు రాసి ,ఒక నెల తర్వాత  కలవమన్నారు.
   వారు చెప్పినట్టుగానే నెల తర్వాత తిరిగి మా అన్నయ్య ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్ గారిని కలసి  తిరిగి ఎక్స్-రే తీయించారు .కానీ ఆ నల్లని మచ్చ ఏమాత్రం తగ్గలేదు .జలుబు ,దగ్గు కొంతవరకు తగ్గాయి ,కానీ రోగి చాలా నీరసంగా ఉన్నారు. అప్పుడు విజయకుమార్ గారు వేరే డాక్టర్ తో సంప్రదించి దానిని క్యాన్సర్ గా అనుమానించి బయాప్సీ కొరకు వారి వద్దకు పంపారు.  బయాప్సి రిపోర్టులో క్యాన్సర్ గా నిర్ధారించి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి రెఫర్ చేశారు. మేము యశోద హాస్పిటల్ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ బాబయ్య గారిని కలిశాము. వారు ఈ రిపోర్టు చూసి తిరిగి బయాప్సీ చేయించారు .అందులో ఆయన దీనిని" అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ బోన్ క్యాన్సర్ "గా నిర్ధారించి తన దగ్గరకు వస్తున్న పేషంట్లను కూడా ఆపి ,మమ్ములను  కౌన్సిలింగ్ రూమ్ కి తీసుకెళ్లి,  క్యాన్సర్ విభాగంలో పనిచేస్తున్న ఐదు మంది డాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ,వారం రోజుల లోపలే సర్జరీ చేయాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
      అప్పుడు నేను డాక్టర్ గారితో,అమెరికాలో ఉంటున్న మా అన్నయ్య గారి పెద్ద కుమారుని వివాహము త్వరలోనే ఉంది ,అది అయిన తర్వాత చేయించుకుంటా మని చెప్పాను .తిరిగి ఆ డాక్టర్ గారు అంత వరకు ఆగితే ఈయనకు చాలా  ప్రమాదము, కావాలంటే పెళ్లిని వాయిదా వేసుకోండి.. అని ఒక ఉచిత సలహా  ఇచ్చారు. సాయంత్రం తిరిగి కలుస్తామని చెప్పి మేము ఇద్దరమూ ఇంటికి వచ్చాము.
     ఈ విషయాల గురించి మేము ఇంట్లో చర్చించుకున్న సమయంలో మా ఫ్యామిలీకి చాలా దగ్గరి స్నేహితురాలు, ఈ మెడికల్ విభాగంలో అనుభవం ఉన్న వ్యక్తి ,ఈ విషయంలో కలుగజేసుకొని ,తనకు పరిచయం ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ (అంకాలజిస్ట్ని )తదుపరి ఒపీనియన్ కి కలవమని సలహా ఇచ్చారు .ఆయన అప్పట్లో క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న  సింహాద్రి సత్యనారాయణ గారి కుమారుడు. అప్పట్లో హైదరాబాద్ సిటీ లో పేరుమోసిన ఆంకాలజీ స్పెషలిస్ట్ .ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మరుసటి రోజు వారిని కలిసాము. రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత వారు ఇది క్యాన్సర్ కాకపోవచ్చు, మీకు అంత అనుమానంగా ఉంటే పెట్స్కాన్ చేస్తాము ,అది కూడా తన దగ్గర లేదు, జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ కి వెళ్ళాలి, దాదాపు 25 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు.
   మాకు ఏం చెయ్యాలో పాలుపోక తిరిగి కడపలో ఉన్న మా బంధువు డాక్టర్ బాలిరెడ్డి గారితో మాట్లాడాము. ఆయన వెంటనే మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు ,తిరిగి తన దగ్గరకు రమ్మని సలహా ఇచ్చారు .అక్కడికి వెళ్ళిన తరవాత తిరిగి వారు చెస్ట్ ఎక్స్రే తీసి" ఇది క్యాన్సర్ కాదు ,టీబి కాదు ,కేవలం ఎముక పైన పుట్టుమచ్చ" అని నిర్ధారించారు. ఒక సాధారణ ఫిజిషియన్ అయినప్పటికినీ ,తన అనుభవంతో ఈ కేసును స్టడీ చేసి ,టిబి అయి ఉండి వుంటే మొదట్లో ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల మెడిసన్ తోనే నయమయ్యేది . అలా కాక ,క్యాన్సర్ అయి ఉండి ఉంటే బయాప్సీ చేసేటప్పుడు నీడిల్ తో గుచ్చి పరీక్ష చేసి, క్యాన్సర్ కు సంబంధించిన ఏ మందులు వాడకపోయినా ఆ మచ్చ పెద్దది కాకపోవటం అనేది తన నమ్మకానికి నిదర్శనం అని అన్నారు. ఆయన ఊహించినట్టుగానే మా అన్నయ్య  అటువంటి ఏ ఈ జబ్బుతోను బాధపడలేదు. కానీ దురదృష్టవశాత్తు తలకు బలమైన గాయం తగలడం వలన 2018లో బ్రెయిన్ హెమరేజ్ తో మరణించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వైద్య విధానం పై ఉన్న నమ్మకం సన్నగిల్లి ఏదైనా ఒక రోగ నిర్ధారణ కు వెళ్ళే ముందు  వ్యయ ప్రయాసలకోర్చి రెండవ, లేదా మూడవ ఒపీనియన్ కూడా తీసుకోవాలనిపిస్తుంటుంది.