ఆ.. రూటే సెపరేటు>అరుణ.గోగులమంద>హైదరాబాద్ (ఏలూరు).

 నా చిన్నపుడు ఏజెన్సీ ఏరియా కన్నాపురంలో ఉండేవాళ్ళం. మా ఇంటి పక్క పోర్షన్లో ఒక ఆయుర్వేద డాక్టర్ గారు ఉండేవారు. పెద్దాయనే అప్పటికి. Law చదువుతున్న కొడుకు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి చిరాకు ఉండేది.. ఎందుకంటే ఎప్పుడూ లంకపొగాకు చుట్ట గుప్పుగుప్పు మనిపిస్తూ మాట్లాడేవారు..ఆ వాసనకి కడుపులో అన్నీ కదిలిపోయేవి. మా అమ్మ పెరటివైపు కూర్చుని కాయగూరలు తరగటం, మజ్జిగ చిలకడం చేస్తూ ఉండేది కదా.. అమ్మతో చక్కగా ముచ్చట్లు చెప్పేవాడు ఆయన. 
 ఎప్పుడూ వాళ్ళావిడ్ని తిడుతూ ఉండేవాడు. తిట్టడం అయిపోయాక మా అమ్మతో " ఇదిగో అమ్మాయ్, ఆడోళ్లని నమ్మకూడదు, ఇదిగో దీన్ని చూడు ఎలా విసిగిస్తుందో.. "స్త్రీ బుద్ధి ప్రళయాంతకం సుమీ" అనేవారు.  మా అమ్మ నవ్వేది.
ఆయనకి ఒక పాత సైకిలు ఉండేది. నేను అప్పుడప్పుడే సైకిల్ పక్కతొక్కుడునేర్చి, ఇక సీటు ఎక్కాలని try చేస్తున్నా. మా అన్నగాడికి కొత్త సైకిల్ ఉండేది, కానీ వాడు నాకు ఇచ్చేవాడు కాదు వెధవ, అందునా కొత్త సైకిల్, fast గా వెళ్ళేది, నేను పడిపోతానేమో అని భయం వేసేది. సో, డాక్టర్ గారి పాత సైకిల్ అయితే గబుక్కున పడిపోనని, ఆయన్ని ఆ సైకిల్ మాత్రం వెళ్లి ఆడిగేదాన్ని. " పాపా.. తీసుకొమ్మా, అడగాలా" అనేవారు. ఏమాటకి ఆమాటే.. నాన్నగారంటే చాలా గౌరవం ఆయనకి, చిన్నవయసులోనే మంచి స్థాయిలో ఉన్నారు అనేవారు. 
కానీ.. ఆ ప్రళయాంతకం అన్నమాట వింటే.. ఏమెమో doubts వచ్చేవి. ఈయన పెళ్లి చేసుకుని, భార్యతో పన్లు చేయించుకుంటూ.. ఇలా అంటారేంటి అని..ఆ మాట నన్ను ఎప్పుడూ వెంటాడేది. ఆ మధ్య వాళ్లు గుర్తొచ్చి అమ్మని అడిగా. అమ్మా ఆ uncle ఒకటే ఆడవాళ్ళని తిడుతుంటే నువ్వు నవ్వేదానివేంటి? అని కోప్పడ్డా.
అమ్మ ఏం చెప్పిందో తెలుసా?
ఆ డాక్టర్ గారికి ఆల్రెడీ ఒక పెళ్ళయ్యి, ఆమె వల్ల పిల్లలు పుట్టలేదని, మళ్లీ కన్నాపురంలో ఒక అమాయక ఆదివాసీ అమ్మాయిని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి రెండో భార్యకు పుట్టాడు. అదీ సంగతి అని.
🙄🙄
మరి ఆయన బుద్ధే కదమ్మా ప్రళయాంతకం?
పిల్లలకోసం ఏకంగా భార్యను అన్యాయం చేసి, మళ్లీ పెద్దవయసులో ఇంకో స్త్రీని పటాయించి పెళ్లి చేసుకుని, ఆమెతో అన్ని సేవలూ చేయించుకుంటూ, ఆ లంక పొగాకు గబ్బు ఆవిడ భరిస్తూ మంచిగా చూసుకుంటుంటే, ఇంకా ఎందుకని ఆ మాట అస్తమనూ వల్లె వేసేవారు? అసలు నీకేమైనా సెన్స్ ఉందా.. నవ్వేదానివి అని అనేసా.
మగాళ్ల బుద్ధికి, యావకి అంతూ పొంతూ ఉండదు, పొద్దున లేచి చుట్టూ ఆడోళ్ళు లేనిదే వీళ్ళకి ఒక్క పనికాదు, ఒక్క సంతోషం దొరకదు.. పిల్లల్లేరని ముసలోడైనా సరే ఇంకో పెళ్లికి సిద్ధం అయిపోతారు, ఇరవై ఏళ్ళు చిన్న వాళ్ళతో కూడా ఎక్కడ బడితే అక్కడ సెటప్పులు పెట్టుకుంటారు, యధాశక్తి చుట్టూ ఉన్న ఆడవాళ్లనీ కళ్ళతో తినేస్తూ ఉంటారు. ఐనా కూడా..
స్త్రీ బుద్ధి ప్రళయాంతకమా? 
ఎంత అన్యాయం అండీ ఇది!!
                   #అరుణ
                        ***
కామెంట్‌లు
Popular posts