మననం :-మంగారి రాజేందర్ జింబో

  జూన్ 2018
స్మార్ట్ ఫోన్లు  వచ్చిన తరువాత జీవనశైలి మారిపోయింది. చాలా పనులు సులువుగా మారిపోయినాయి.
పది పన్నెండు సంవత్సరాల క్రితం పత్రికకి వ్యాసం పంపించాలంటే పోస్ట్‌లో పంపించాల్సి వచ్చేది. ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. కాలమ్ రాసేవాళ్లు ఫాక్స్ ద్వారా తమ రచనలని పంపించేవారు. ఆ తరువాత మెయిల్ ద్వారా స్కాన్ చేసి పంపించడం లేదా టైప్ చేసి పంపించడం మొదలైంది.స్కాన్ చేయాలంటే దానికి స్కాన్ చేసే పరికరం అవసరం ఏర్పడింది. మెయిల్ చేయడానికి కంప్యూటర్ లేదా ల్యాప్‌ట్యాప్ అవసరం వుండేది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సెల్యులార్ డాటా, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత వ్యాసాలు రచనలు పంపించడం చాలా సులువుగా మారిపోయింది. స్కానింగ్, ఫీడియఫ్, మెయిల్ అన్నీ అరచేతిలోకి వచ్చేశాయి.
స్మార్ట్ ఫోన్లని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. అందరూ తమ మెదడులని స్మార్ట్ ఫోన్‌కి అవుట్ సోర్సింగ్ చేసేసారు. 
ఈ మధ్య ఓ షాపువాడు ఓ చిన్న జమ చేయడానికి స్మార్ట్ ఫోన్ వాడటం మొదలుపెట్టాడు. 
స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో మనుషులు ఎలా జీవించారు అన్న పరిస్థితి వచ్చేసింది.
గతంలో ల్యాండ్‌లైన్ ఫోన్లు ఉన్నప్పుడు కనీసం ఓ యాభై ముఖ్యమైన టెలిఫోన్ నెంబర్లు గుర్తుండేవి. కొంతమందివి ఇంకా ఎక్కువ గుర్తుండేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 
ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చెబుతాను. ఓ మంత్రిగారి కొడుకు వివాహానికి వెళ్లాను. విపరీతమైన జనం.
     కారుని చాలా దూరంగా మా డ్రైవర్ పార్క్ చేయాల్సి వచ్చింది. పెళ్లి తరువాత డ్రైవర్‌కి ఫోన్ చేసి రమ్మని చెబుదామని ఫోన్ తీశాను. ఇంటర్నెట్ వాడటంవల్ల చార్జింగ్ పూర్తిగా పోయింది. రెండో ఫోన్ కారులోనే వుంది. ఎవరి ఫోన్ నుంచైనా డ్రైవర్‌కి ఫోన్ చేద్దామంటే డ్రైవర్ నెంబర్ గుర్తులేదు. ఏం చేయాలో తోచలేదు.
కొంతసేపు అయిన తరువాత ఎవరిదో మిత్రుడి ఫోన్ తీసుకొని మా ఆవిడకి ఫోన్ చేసి డ్రైవర్‌కి చెప్పమని చెప్పాను. కనీసం ఆవిడ ఫోన్ నెంబరైనా గుర్తున్నందుకు సంతోషపడ్డాను. ఇదీ పరిస్థితి. నా పరిస్థితే కాదు. చాలామంది పరిస్థితి. మెదడుని ఉపయోగించడం మానేశాం. జ్ఞాపకం వుంచుకోవాలన్న ఆలోచన ఎవరికీ రావడంలేదు.
ఈ చిన్న అసౌకర్యాలే కాదు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే పరిస్థితులు ముందు ముందు దారుణంగా మారతాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, డిమినీషియా లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం వుంది.
మననం చేసుకోవడం, బట్టీపట్టడం లాంటి వాటిని చిన్నచూపు చూడటం మానెయ్యాలి. బట్టీ పట్టడం మెదడుకి చాలా అవసరం. గుడ్డిగా కాకుండా అర్థం చేసుకొని మననం చేయాలి. అలా చేస్తేనే కొన్ని వ్యాధులను దూరంగా వుంచగలం.
మన మెదడుని స్మార్ట్ ఫొన్ కి బదిలీ చేయకూడదు. మన మెదడు పనిని మెదడు చేసేలా చూడాలి. 
అట్లా అని స్మార్ట్ ఫోన్ ‌ని ఉపయోగించుకోకూడదని నేను చెప్పడం లేదు. నిజానికి స్మార్ట్ ఫోన్ లేకుండా బతికే పరిస్థితి వుందా ..?