ఆహా ఏమీ ఈ విధి విలాసము.
జనక రాజ పుత్రికనై,జానకి అనే పేరు బడసిన నేను, సూర్యవంశపు
వారింటి కులకాంతనై, దశరథ మహారాజు ముద్దు కోడలినై, కోదండ రాముని అర్థాంగినైన నేను ,దేశము కాని దేశములో, ఈ అశోక వనమనే కానలో,నాభర్త రాకకై నిరీక్షించుచూ,అంతులేని దుఃఖముతో శోకీంచుచూ, ఈ రాక్షస స్ర్రీల నడమిన కాలం గడపవలసి
రావడం ఎంత వింత?ఇదేకదా విధి విలాసమనునగా!
ఒకప్పుడు ఇంత
భయంకరాకారులైన రాక్షస స్ర్రీలను, ఊహలోమాత్రము
గనీనంతనే మూర్చ పోవునంత సుకుమార స్వభావురాలినైన నేను,
ఈనాడు అట్టి రాక్షస స్త్రీల ఎదురుగా,ఇంత నిర్భయంగా వుంటినంటెే
కాలమహిమ కాక మరదేమి?
ఏ కారణము వలన
ఇది అంతా ఇట్లు జరుగుచున్నదో గానీ,నాకు ఇదంతా చాలా చిత్రముగా తోచుచున్నది. వివాహమైన పిదప అయోద్యలో
అత్తవారింట కాలు పెట్టిన నాకు, నా భర్త పట్ల, నా అత్త మామలకు కలిగి యున్న
ప్రేమకు, ఆత్మీయత నాకెంయో
అచ్చెరువుగా తోచినది. అందు, కైకేయి అత్తగారికి నా భర్త పట్ల అంతులేని అనురాగము నాకు బహు అపురూపంగా తోచింది.తన బిడ్డ భరతుడు తనకు నుండగా, అక్క కౌసల్య బిడ్డ
పట్ల యింత మమకారమా? అని
వింతపడితిని కదా!అటువంటి యుత్తమ సుగుణములు కలిగిన ఆ కైకేయీ అత్త మనసులో, ఇంతటి అసూయ ఎటుల పొడచూపినది?
ఆమె ఒక తల్లిగా తనబిడ్డ భరతునికి పట్టాభిషేకము కోరుట
ఎంత మాత్రము అసమజసం కాదు కానీ,ప్రాణ సమముగా భావించే తన ముద్దు బిడ్డ శ్రీరాముని' ఒక వత్సరమైననూ కాదు ,ఏకంగా పదునాలుగు వత్సరాలు అడవుల కేగమనుట ఏమి?ఆమె అడగితిరిపో ,మా ఖర్మమునకు మమ్ము వదలిపెట్టక,మరది లక్ష్మణుడు ,తన పత్ని ఊర్మిళను వదిలి మాతో అడవులకు ఏతెంచుట ఏమి?
ఏనాడూ ఏవిధమైన కోరికలూ జనించని నా మనసున, ఆ బంగరు లేడి పట్ల కోరిక జనించుట
ఏమి? అపాయమేమో అని యోచించక, నా ప్రాణ నాధుని ఆ మాయా బంగారు లేడిని తెమ్మనుట ఏమి? ,వలదని నానాధుడు వారిస్తున్నా వినక పట్టు పట్టుట ఏమీ, అసలు సృష్టిలో బంగారు లేడి ఎచటనైనా యుండునా?అనే ఆలోచన నాకేల తోచలేదానాడు?"హా సీతా! హా లక్ష్మణా! "అని
ఆర్తనాధాలు వినినంతనే, అది నా ప్రాణనాధుని గొంతని బ్రమించుట ఏల ?లక్ష్మణుడు "ఆ గొంతు తన అన్నది
కాదని" వారిస్తున్నా,అతడిపై వేయ కూడనటువంటి అబాంఢములు వేసి , అనరాని మాటలు అని,అతని మనసుని బాధించి ,అతడిని వనములోనికి తరుముట ఏమి? అతడు గీతలు గీసి, "వదినమ్మా!ఎట్టి పరిస్థితులు ఎదురైననూ ,ఆగీతలు దాటవద్దని ,పదే పదే హెచ్చరించినూ పెడచెవిని ఏల పెట్టితిని?
మరది దాటవలదన్న మూడు గీతలను దాటి,
ఈ మాయా వేషదారుడైన రావణుని చెరలో చేరి, ఇలా ఈ లంకలోని అశోక వనంలో, ఈ రాక్షస స్ర్రీల మద్యన ,దినములు భారంగా గడుపుతూ,నా నాధుడు శ్రీరాముని రాకకై, ఈ దుష్ట దుర్మార్గ రావణుని,
అంతమునకై ,క్షణమొక యుగంగా
నిరీక్షిస్తూ కాలం గడుపుతుంటిని కదా! ఇంకెంత కాలము ఈ లంకలో కాలము గడప వలసి యున్నదో కదా!
పవన సుతుడు హనుమంతుడు లంకకు ఏతెంచి, లంకకు నిప్పు ముట్టించి,లంకవాసులను గడగడలాడించి,నాపతి శ్రీరామ చంద్రుడు నన్ను గొనిపోవుటకు ,కపిదండుచేత
, సంద్రాన సేతువు కట్టించి, రావణునితో యుధ్ధానికై ,దండుతో దండెత్తి వచ్చి, ఈ మదాంధుడు లంకాధిపతి రావణుని
వధించి, నన్ను గొనిపోవు సుదినములు
మరియెన్ని దినముల దూరమో లేదనే శుభ వార్త నాకెరిగించి, నా ప్రాణములు నిలిపినాడుకదా!ఇక నా ప్రభువు రామచంద్రుని రాకకై ఎదురు చూచుచూ, నన్ను గొని
పోవు మధుర క్షణాలకై కన్నులు కాయలు కాయునటుల ఎదురు చూచుట
తప్ప మరి ఏమి చేయగల దానను నేను? ఇంత చేసిన కాలము అదియునూ చేయగలదు.ఆశ విడవకుండుటయే మానవుల కర్తవ్యముగదా!
ఆ శుభదినాన నా కనుల తనివి తీరగా నా ప్రాణ నాధుని వీక్షించి ,ఆతని బాహువులలో ఒదిగిపోదును.ఆ శుభ దినమునకై ఆతురుతగా నిరీక్షింతును.
సీత ఏకపాత్రాభినయం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి