అందరి సంగతేమో గానీ నా కల్పనకు పునాది అబద్ధం. దానికీ ఓ సామర్థ్యం ఉండాలి. అబద్ధం చెప్పడం, వినడం చిన్నప్పటి నించీ ఉన్నదే. అబద్ధమాడటాన్ని నేను ఊహల విషయంలో ఉపయోగిస్తూ ఉంటాను. పరిస్థితులకు తగినట్లు మనసు ఆ మాటలను వెతుక్కుంటుంది. అబద్ధం చెప్పేటప్పుడు విజయం అప్పటికప్పుడు పొందగలను.
అబద్ధానికి విత్తనాలై ఉండేవి మాటలే. ఇందులో అనుమానం అక్కర్లేదు.
కొన్నిసార్లు అబద్ధం చెప్పడానికి ముందుగానే ఆలోచిస్తాను.
మేజిక్ చేసే అతను ఉత్తుత్తి చేతులలోంచి పువ్వులను తెప్పించడం కన్నా అనుకున్న క్షణంలో అనుకున్న అబద్ధాన్ని చెప్పి ఎదుటి వ్యక్తిని నమ్మించేలా చేయడం అంతకన్నా పెద్ద మేజిక్కే. కాకుంటే మరేమిటి....నిజం చెప్పడానికి ఎన్నుండాలో...నిజం చెప్పేం దుకు ముఖ్యంగా ధైర్యముండాలి. నిజం చెప్పడంవల్ల కలిగే పరిణామాలకు సిద్ధమవాలి.
కానీ అబద్ధానికొచ్చేసరికి అలా కాదు. అవెప్పుడూ నా నాలుక అంచునే ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు చెప్పడానికి ఆ మాటలు పోటీపడుతుంటాయి.
అనేక సమయాల్లో నేను చెప్పే అబద్ధాలు వేరొక రూపంలో తిరిగి నన్నే చేరుకున్నప్పుడు వాటివల్ల కలిగే కష్టనష్టాలు తెలియకేం కావు. అప్పుడు తెలుస్తుంది అబద్ధం చెప్పడంలోని బాధ ఏమిటో....
ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించేది అబద్ధమేనని ఎప్పుడో ఎక్కడో చదివాను ఓ తమిళ వ్యాసంలో. ఇందులో భాష, దేశం, ఉన్నతుడు, తక్కువ వాడు అనే తేడాలు లేవు. అబద్ధం చెప్పేవారికి ఏ కొలతా ఉండదు. వయస్సుతోనూ సంబంధం లేదు. అందుకే అబద్ధాలకోరులో నేనూ ఉన్నానా...అంటే ఉన్నాననే చెప్తాను.
సగటున ఓ మనిషి తన జీవితకాలంలో ఎన్ని అబద్ధాలు చెప్తాడో అని ఆలోచించగా నేనెన్ని అబద్ధాలు ఇప్పటివరకూ చెప్పానో లెక్కేలేదు. ఒక్కొక్కప్పుడు లెక్కపెట్టడం మొదలుపెడితే సంఖ్య తేలక భయమేస్తుంది, ఇన్ని అబద్ధాలు చెప్పేనా అని.
అబద్ధం అనేది ఓ రుచి. అబద్ధం కొన్నిసార్లు తీయగా ఉంటుంది. కొన్నిసార్లు చేదుగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు సముద్రంనీటిలా ఉప్పగా ఉంటుంది.
అబద్ధం చిన్నప్పుడే మొదలైంది. ఫ్రెండింటికి చదువుకోడానికి వెళ్తానని చెప్పి గ్రౌండుకెళ్ళి ఆడటం చేసేవాడిని. ఇప్పుడే వచ్చెస్తానని చెప్పి సినిమాకు వెళ్ళడం....ఇలా అబద్ధాలు ఎన్నెన్ని ఆడానో....
కానీ అబద్ధం చెప్పడం ఎంత తేలికనిపిస్తుందో అందులో అంత కష్టమూ దాగి ఉంటుంది. అబద్ధం చెప్పేటప్పుడు ఏం చెప్పామో గుర్తుంచుకోవాలి. లేకుంటే అప్పటికే చెప్పిన అబద్ధానికి మరొక కొత్త అబద్ధమాడాలి. నిజం విషయంలో అలాకాదు. నిజం చెప్పేసిన తర్వాత నిర్భయంగా ఉండొచ్చు. అందుకే అబద్ధం ఎంత సులువో అంత కష్టంకూడాను. చెప్పిన అబద్ధానికే కట్టుపడటం మరీ మరీ కష్టమనే నా అభిప్రాయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి