నెమలీక.:- అరుణ గోగులమంద , హైదరాబాద్ (ఏలూరు )
నువ్ నిద్రలేచుంటావో లేదో అని
వాకిట విరబూసిన మందారాలు 
లెక్కిస్తూ ఆలోచిస్తుంటాను.
అప్పుడప్పుడూ మనసు సీసా అంచులుదాటి ప్రవహిస్తున్న కొన్ని ఊహల్నిలా
అక్షరాల్లోకి తర్జుమా చేస్తాను.
మరికొన్ని సంజె చీకట్లలో
మలిఝాము మౌనాల్లో 
చెంపల్లో వెచ్చని చారికల సంతకాలౌతాయ్.

పసికూనల కోసం గూడుకట్టే పనిలో నిమగ్నమై
జతగాడిని లాలించుట మరిచి శాపగ్రస్తనయ్యానేమో.
దిగుళ్ళు దాగిన కనురెప్పల మాటున
నిను తిరిగితెచ్చే ఆశల బిడారుకోసం 
వేకువచుక్కనై రేయి ఆకాశాన నిలబడి 
నిరాశ నిశీధితో యుద్ధం చేస్తుంటానందుకే.

ఆ చెట్టుకొమ్మన రేయింబవళ్ళూ 
వానకోయిల పాడుతున్న 
విలాపగీతం నా అంతరంగం.
పెదవులపై దరహాస రేఖలు అంతలోనే 
కరిమబ్బుల కొరడాలై కన్నీటి తుఫానుల కాన్కలిస్తుంటే..
ఎడతెరిపిలేని వానవాకిళ్ళలో నిలబడి 
నా ఆవేదనాశ్రువుల్నీ స్రవిస్తాను.
                   

నిన్నటి రాస్తాల విరిసిన నీ నవ్వుల్నే
రేపటి వాకిట ముగ్గులుగా దిద్దుతాను.
నీ జతలో కురిసిన వలపు తుంపర
నా జీవితకధలో నెమలీక జ్ఞాపకం. 
                          ***

Aruna Gogulamanda
Hyderabad(Eluru)

కామెంట్‌లు