మాయ --మంగారి రాజేందర్ జింబో

      (2017)
చిన్నప్పుడు గారడీ ఆటలను చూసి ఆశ్చర్యపోని వ్యక్తులు అరుదు.
మా చిన్నప్పుడు రోడ్డు మీద గారడీ ఆటలు జరిగేవి. నిమ్మకాయను కోసి రక్తం తీసేవారు. రేజర్ బ్లేడ్లని మింగి వాటిని మళ్లీ బయటకు తీసేవాళ్లు.
కళ్లు మూసుకున్న పిల్లవాడి మీద గుడ్డ కప్పేవాళ్లు. కానీ గారడీవాడు అడిగినప్పుడు అది చూస్తున్న వ్యక్తుల చేతిలో ఏముందో ఆ కుర్రాడు చెప్పేవాడు.
మాకు చాలా ఆశ్చర్యం వేసేది.అదే విధంగా ఓ చిన్న తాడు మీద అమ్మాయి బాలెన్స్ చేసుకుంటూ నడిచేది.
ఇదంతా ఓ మాయలా తోచేది.
జాతర జరిగే రోజుల్లో ఇలా ఎన్నో కార్యక్రమాలు జరిగేవి.
సర్కస్‌లు - వగైరా ఎన్నో వచ్చేవి. ఆ సర్కస్‌లో వ్యక్తులు చేస్తున్న ఫీట్లు చూసి ఒళ్లు పులకరించేది. భయం కూడా వేసేది.
అంతా ఓ మాయలా తోచేది.
మా అమ్మ, తాత కథలు చెప్పేవాళ్లు. ఆ కథల్లోని రాకుమారుడు చేసిన యుద్ధాలు విని ఆశ్చర్యపోయేవాన్ని.
ఆ తరువాత చందమామ, బాలమిత్రలు చదివి ఆ కథల్లోని మాయ మంత్రాలు చూసి అచ్చెరువయ్యేవాన్ని.
ఆ తరువాత జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాళ్లు విజయం వైపు ప్రయాణం చేయడం ఓ మాయలా తోచేది.
ఆ తరువాత యువ లాంటి మాసపత్రికలు పత్రిక, ప్రభ, భూమి లాంటి పత్రికలు చదివి ఆ కథలు ఎలా సృష్టిస్తున్నారోనని ఆశ్చర్యపోయేవాడిని.
అంతా ఓ మాయలా తోచేది.
నిజంగా అదంతా మాయా..?
అవును మాయే 
ఇది రావి శాస్త్రి కథ లోని 'మాయ కాదు '
మాయ అంటే 
కఠోర శ్రమ.
అంతే..!