' నాము జొన్న '....నజరానా ..!!:--------శీరంశెట్టి కాంతారావు. రచయిత -పాల్వంచ .

 నాకింకా బాగా గుర్తే 
మాఊరి చెరువుకింది ఆయకట్టున నాము జొన్న పండింది
ఊరి జ్ఞాపకాల ఖజానా అయిన
వృద్దులంతా ఈశ్వరమ్మ గద్దెమీద కూర్చుని 
నాము జొన్న గురించి మా తాత ముత్తాతలు చెబుతుంటే వినడమేగాని చూడడమిదే  మొదటిసారంటూ ఏకగ్రీవంగా తేల్చి చెప్పారు అసలేమైందంటే?
ఉత్తరకార్తె చూసి ఎత్తర గంప అన్నట్టు  కార్తెలన్నీ తిరిగి పోయినా 
తూర్పున తెల్లగా వెండిపొద్దు పొడుస్తుంది తప్ప ఎర్రడాలన్నది కలికానిక్కూడా కన్పించడం లేదు
వానపడుతుందన్న జాడలేదు
ఊళ్ళో పిల్లలు గుంపులు గుంపులుగా కూడి కప్పతల్లుల్ని ఇల్లిల్లూ తిప్పి నీళ్ళాడించినా చినుకు నల్లపూసైపోయింది
పెద్దలంతాకూడి చెరుకట్టమీద శివాలయం దగ్గర 
తాటాకు పందిళ్ళు వేయించి విరాటపర్వం పారాయణ చేయించినా ఫలితం రాలలేదు
ఊరంతా కలిసి కట్టపొడవునా మానవ హారమై నిల్చి దండ చేతులమీద  నల్లగండి నీళ్ళు బిందెల్తో తెచ్చి 
శివలింగం మునిగిపోయేటట్టు జలాభిషేకం చేసినా.. కట్టమీదినుండి చెరులోకి
చిన్నకాలువకొట్టి దాన్లో విస్తళ్ళు పరిచి చెరులో పడేటట్టు జోరుపాశం జాలుపోసినా వానమాత్రం ఆకాశకుసుమమే అయ్యింది   
వాన పగబూనింది
ఇక లాభంలేదనుకున్న ఊరు
మెరకచేలతోపాటు చెరుకిందా పజ్జొన్నవెయ్యాలన్న 
ఏక వాఖ్య తీర్మానం చేసింది
సీతాకోకచిలుకలు రెక్కలాడించినంత నిశ్శబ్దంగా నాలుగు మాసాలు నడిచి పోయాయి
నిలువుమీద జొన్నదంటును చెప్పుకాలితో గట్టిగా తన్నితే పిగలపండిన కంకుల్నుండి జొన్నలు ఝల్లున రాలిపడసాగాయి 
రైతుల గుండెలు ఆనందంతో తుళ్ళిపడసాగాయి
కల్లాల్లో జొన్నల పసిడిరాసుల్ని
చూసుకున్న వాళ్ళ కళ్ళల్లో పిల్లల్ని బతికించుకుంటామన్న భరోసా కాస్త ఊపిరి పోసుకుంది
ఆ ఏటికి వానచుక్క అట్లా చుక్కల్లో కలిసిపోయినా వికలాంగుడి ఒక అవయవ లోపాన్ని పూడ్చేందుకు మరో అవయవానికి అధికశక్తిని ఇచ్చినట్టు
వరిపంటను మింగిన ప్రకృతి నాము జొన్నను ఊరికి బహుమతిగా ఇచ్చింది
మన్ను నుండి అన్నాన్ని పుట్టించే రైతన్నలకు మహోదయం   
(జొన్నపంటను కోసి వదిలేసిన కొయ్యకాళ్ళకు మళ్ళీ దంట్లు పుట్టుకొచ్చి  కంకులు తొడిగి పంటనిస్తాయి. దాన్నే "నాము జొన్న" అంటారు)

కామెంట్‌లు