కష్టపడి తల్లిదండ్రులు చదివించిన చదువు ,
చివరి కి కారాదు వారికి వృద్ధాశ్రమశిక్ష ....!
కన్నతల్లిదండ్రి విలువ తెలియురా పోయాక,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
-------------------------------------------------------------
అమ్మ-నాన్నల ప్రేమకు కొలబద్ద ఉండదు ,
కన్నబిడ్డల ప్రేమకు అంచనా కుదరదు ...!
బ్రతుకు బాటలోన ఎన్నెన్నో వింతలు .....
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
-----------------------------------------------------------
గొప్పలెన్నో చెప్పి గారడీమాటలతో
తమనుతాము పొగుడుచు పొంగిపోదురు కొందరు !
స్వంత డబ్బాకొట్టి సాదించు నది ఏమి.....?
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
-----------------------------------------------------------
ఆస్తిపాస్తుల సిగపట్లతో అంతుచూసి ....
అన్నదమ్ముల -అక్కచెల్లెళ్ల బంధాలు ఛిద్రమయ్యే !
డబ్బుతో ముడిపడె గదా రక్తసంబంధాలు ....
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
-----------------------------------------------------------
కొట్లాటలకు దిగి -పిమ్మట కోర్టులకెక్కి ..
ఆస్తిగొడవలతో -తమ ఆస్తినీకరిగించి ..
ఇద్దరిమధ్యలో మరొకడు బలిసెగా ...!
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
------------------------------------------------------------
ఆత్మీయతానురాగాలు ప్రేమలూ ...
ఆస్తులతో అంతస్తులతో ముడిపెట్టకోయి
బంధా ల ననుబంధాలనూ డబ్బుతోకొనలేము
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
జీవన రాగం...!! (ఆన్షీలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మకొండ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి