ఆనాటి కుటుంబం (ఇష్టపదులు):-ఎం. వి. ఉమాదేవి,నెల్లూరు
ఆనాటి కుటుంబము అనుభూతి తరంగము 
బంధాలు నిలిచేటి బంగారు కాపురము 

పెద్దలకు వందనము పేరైన భూషణము 
ఆహ్లాద కరముగా అన్నివేళలు గడుచు 

క్రమపద్ధతియు నడుచు క్రమముగా ప్రతి దినము 
చేయదగినవి కొన్ని చేయరానివి కొన్ని 

అనుక్షణము పెద్దల అజమాయిషీ లోను 
తాత తండ్రులపై తగిన గౌరవముంచు 

వంటలకు పాత్రలవి వాసిగా నిత్తడివి 
 పళ్ళాలు లోటాలు పసిడివలె మెరయుచూ 

తెలుగులో పేర్లను తేటగా చెక్కియును 
కట్టెలును బొగ్గులును కమ్మనౌ వంటలకు 

ఒక్కపూటయిననూ ఒప్పుగా నందరును 
నేలపై కూర్చుండు నెపుడు భోజనఘడియ 

అమ్మ వడ్డన చేయు అందరికి గమనించి 
పప్పు పచ్చడి నేయి పలుకూర మజ్జిగయు 

మాటలాడరాదోయ్ మరి తినెడు సమయమున 
ఎక్కిళ్ళు, పొలమారు ఏదోకటి చెపుదురు 

బొట్టు గాజులు లేక తిట్టుదురమ్మాయిల
జుత్తు విరబోసినను జూచుటకు దయ్యమను 

సడిలేని నడకయును సరి వినయముండవలె 
ఇరుసంధ్యల లోను ఇంటిలో దీపమును 

కులదైవముకు పూజ కులకాంత ప్రసాదము 
నివేదన జేయగా నిత్యశుభమని తలచు!