"ఘంటసాల గానామృతం" వాట్సప్ గ్రూప్ లో మిమ్మల్నీ add చేసానండి. చూడండి" అంటూ కొంతకాలం క్రితం మెసేజ్ పెట్టిన అండా రామారావుగారు భౌతికంగా జూలై 11వ తేదీన (2021) ఉదయం పదకొండు గంటలకు దూరమయ్యారన్న కబురు ......విచారకరం! బాధాకరం!! నమ్మశక్యం కాని మాట!!
కొన్నాళ్ళుగా అండా రామారావు వాట్సప్ లో "ఘంటసాల గానామృతం" అనే పేరుతో ఓ బృందం ఏర్పాటు చేసి ఘంటసాల మాష్టారు గురించి ఎన్నో వివరాలు చెప్తూ వచ్చారు. ఘంటసాల వారి పాటలూ, ఆ పాటల సందర్భాలూ, వారి పుత్రుడు రత్నకుమార్ తన తండ్రిపై రూపొందించిన కార్యక్రమం వంటివన్నీ నేను ఈ గ్రూప్ ద్వారానే తెలుసుకోగలిగాను.
ఘంటసాల గారి గురువైన పట్రాయని సీతారామశాస్త్రిగారి కుమారులు, ఘంటసాలగారి సంగీత బృందంలో ప్రముఖ హార్మోనిస్టు, వైణిక విద్వాంసుడు అయిన సంగీతరావుగారి మరణ సమాచారం, రత్నకుమార్ మృతి అండా రామారావు అడ్మిన్ గా కూర్చిన ఘంటసాల గానామృతం గ్రూప్ ద్వారానే మొదటగా తెలుసుకున్నాను. ఆ ఇద్దరూ నాకు ప్రత్యక్ష పరిచయముండటంతో ఒకటి రెండు జ్ఞాపకాలతో కొన్ని మాటలు రాసినప్పుడు వాటిని తన వాట్సప్ గ్రూపులో ప్రచురించారు రామారావుగారు. కొన్ని రోజుల క్రిందట ఆ గ్రూప్ నించి ఇవతలకు వచ్చిన మరుక్షణమే ఫోన్ చేసి లింక్ పంపుతాను అందులో add అవండి అని చెప్పారు. అలాగే అన్నాను కానీ ఆయన లింక్ పంపనూ లేదు...నేను add అవనూ లేదు. ఇంతలో అండా రామారావుగారు ఇక లేరన్న విషయం "ఉదయం" అనే గ్రూపు ద్వారా తెలిసి బాధపడ్డాను.
"ఉదయం" దినపత్రికలో ఆయన నాకు సహోద్యోగి. నాకు మొదటిసారి పరిచయమైంది "ఉదయం" ఆవరణలోని క్యాంటీన్ దగ్గరే. ఆ తర్వాత అవీ ఇవీ మాటలు....సినిమాలపై ఎన్నెన్నో విషయాలు చెప్తుండేవారు.
ఘంటసాల గానామృతం గ్రూప్ ఏర్పాటు చేసిన కొన్నిరోజులకే ఓ ఉదయం ఫోన్ చేసి మీ నాన్నగారు ఘంటసాల గారిపై రాసిన వ్యాసం గ్రూప్ లో పోస్ట్ చేయండి అన్నారు. ఘంటసాల గారిపై మా నాన్నగారు రాసినట్టు లేదండీ అని అనగానే"బలేవారే! 1992 లేదా తొంభై మూడో గుర్తు లేదుకానీ మీ నాన్నగారితో ఘంటసాలగారిపై ఓ వ్యాసం రాయించి ప్రచురించిన విషయాన్ని గుర్తు చేశారు అండా రామారావుగారు. అదీ ఓ వార్తే నాకు!!
ఓ ఆరేడేళ్ళ క్రితమనుకుంటాను, హైదరాబాద్ త్యాగరాయగానసభలో సినీ సంగీత విభావరి కార్యక్రమానికి నేనూ మా ఆవిడ వెళ్ళినప్పుడు అండా రామారావు గారు మమ్మల్ని చూసి ఎంత కాలమైందో మిమ్మల్ని చూసి అంతా క్షేమమేగా అంటూ ఉదయం దినపత్రికలో పని చేసిన రోజులను జ్ఞాపకం చేశారు. ఆ తర్వాత ఆయన తన స్వస్థలానికి వెళ్ళిపోవడంతో కాంటాక్ట్ లేకుండా పోయింది.
ఆ తర్వాత "ఫేస్ బుక్" లో మూడేళ్ళ క్రితం నేనున్న రోజుల్లో నేను పోస్ట్ చేసిన కొన్నింటిని చూడటంతో మళ్ళా ఆయనతో మాటలు కొనసాగాయి. ఫోన్ నెంబర్లు పరస్పరం ఇచ్చుకున్నాం. అప్పుడప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. వాట్సప్ లో మెసేజులు ఇచ్చుకునేవాళ్ళం.
మిత్రులు చెప్పినట్టు అండా రామారావు గారు సౌమ్యులే. గట్టిగా మాట్లాడితే మాట నొచ్చుకుంటుందేమో అన్నట్టుగా మృదువుగా మాట్లాడుతుండే రామారావుగారు ఇకలేరన్న సమాచారం మనసుకు బాధ కలిగించింది. సహృదయులు.
పుట్టిన ప్రతి ఒక్కరికీ
ఏదో రోజు
మరణం తప్పదు...
కానీ
బహుకొద్దిమందే
జ్ఞాపకంలో ఉంటారు
అటువంటి జ్ఞాపకమే
అండా రామారావుగారు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి