"అత్తగారి.......తప్పే":-ఎం బిందుమాధవి

 నేను స్నానం చేసి బయటికి వచ్చేసరికి, వాషింగ్ మెషీన్ బాగు చేసే వ్యక్తి అనుకుంటా... లోపలికి వస్తూ కనిపించాడు.
తలుపు తీసిన అత్తగారు ఎదురొచ్చారు.
బెల్ చప్పుడు వినిపించింది.  శ్రీవారు ఇంట్లోనే ఉన్నారు..తను తలుపు తీస్తారులే అనుకున్నాను. కానీ తీరా చూస్తే, మడిబట్టతో వంటింట్లోనించి వచ్చి ఈవిడ తీశారన్నమాట! 
ఆ వచ్చిన మెకానిక్ ఆవిడని నఖ శిఖ పర్యంతం చూస్తూ లోపలికి రావటం నా కంట పడింది. ఆవిడకి కూడా ఆ చూపుల్లో తేడా ఏమన్నా అనిపించిందేమో...వెంటనే కొంగు సర్దుకున్నారు. ఆవిడ  మెడలోనే ఎప్పుడూ ఉండే  నాలుగు వరసల చంద్రహారం మీద వాడి కన్ను పడిందేమో అని ఆవిడ సర్దుకున్నారు. అలా ఆవిడ సర్దుకుంటున్నప్పుడు, భుజం మీది చీర భాగంలో ఉన్న పెద్ద చిరుగు నా కంట పడింది.
చెప్పద్దూ ఆవిడది స్ఫురద్రూపం. అందానికి తగ్గ ఎత్తు, ఎత్తుకి తగ్గ లావూ, పసిమి ఛాయ, తీర్చి దిద్దినట్లుండే కళ్ళు, సంపెంగ మొగ్గ లాంటి నాసిక ..చూడగానే లలితా అమ్మవారిని తలపిస్తూ..  మరోసారి చూడాలనిపించే రూపం. ఈ వయసులో కూడా ఇలా ఉన్నారంటే, యౌవనంలో ఉన్నప్పుడు మగవాళ్ళు "ఫిదా"అయిపోయి  ఉంటారు!
తన భార్య అందమైన  రూపం తాలూకు గర్వం మా మామగారి ముఖంలో అప్పుడప్పుడూ తళుక్కుమనటం చూశాను.
ఇంతకీ ఈ మెకానిక్ గాడు వయసు తారతమ్యం లేకుండా పెద్దావిడని ఆ దృష్టితో చూడట్లేదు కదా అనే అనుమానం తొంగి చూసింది.
"అత్తయ్యా, మీరు వంటింట్లోకి వెళ్ళి పని చూసుకోండి. నేను వచ్చేశాగా. నేను ఉంటానిక్కడ. మీ అబ్బాయి ఎక్కడికెళ్ళారు" అన్నది.
"బ్యాంక్ దాకా వెళ్ళొస్తానని ఇప్పుడే వెళ్ళాడు" అన్నది ఆవిడ.
వాడి పని చూసుకుని వెళుతూ..."అమ్మా ఆ పెద్దమ్మగారు అచ్చం లక్ష్మి దేవి లాగా ఉన్నారు. ఆ చిరుగుల చీరేంటమ్మా?"అన్నాడు.
***********
సాయంత్రం భక్తి టీవీ లో సామవేదం వారి ప్రవచనం వింటూ ఉండగా కూతురు నిమ్మి వచ్చింది. "ఈ టైం లో వచ్చావేం? కాసేపు కూర్చున్నట్టు ఉండదు, రేపు పొద్దున్న వస్తే బాగుండేది కదా" అన్నారు వసుంధరమ్మ గారు.
"అమ్మా..రాత్రి అమ్ముమ్మ కల్లోకి వచ్చింది. ఏవేవో కబుర్లు చెప్పింది. ఒళ్ళో పడుకోపెట్టుకుంది. నువ్వు మడికి కట్టుకునే చీరలో కనిపించింది అమ్ముమ్మ."
"అందుకే  నిన్ను చూడాలనిపించి వచ్చేశా! ఇదుగో మడికి కట్టుకోవటానికి నీ కోసం లైట్ వెయిట్ చీరలు రెండు పట్టు పట్టుకొచ్చాను. అమ్ముమ్మ చీర నాకిచ్చెయ్. అందులో అమ్ముమ్మని చూసుకుంటా" అన్నది.
"ఇప్పుడు రెండు చీరలెందుకే! మొన్నే నాన్నగారు ఒక చీర, అన్నయ్య రెండు చీరలు కొన్నారు. అది నీ చిన్నప్పటి నించి కట్టుకుంటున్న అమ్ముమ్మ చీర. దానితో వంట చేస్తేనే నాకు బావుంటుంది. అందుకే అది పడెయ్యమని నాన్నగారు చెప్పినా అది కట్టుకునే వంట చేస్తున్నా" అని, పోనీలే అంతగా అమ్ముమ్మని తల్చుకుంటున్నావు, నీకిచ్చేస్తాలే" అన్నది.
పక్క గదిలోంచి వీరి సంభాషణ ఆలకిస్తున్న ప్రశాంతి " ఆ మెకానిక్ అలా మిమ్మల్ని చూడటం నాకు నచ్చలేదు అని గట్టిగా ఆవిడకే చెబుదామంటే , 'అత్తగారి కొంగు తొలగింది అన్నా తప్పే..తొలగలేదన్నా తప్పే' అన్నట్టు నే చెప్పేది ఆవిడ అర్ధం చేసుకుంటారో లేదో! అందుకే నిమ్మీ ద్వారా అనుకున్నది సాధించాలనుకున్నాను. హమ్మయ్యా  సాధించగలిగాను" అనుకుంటూ, 'థాంక్స్ నిమ్మి ' అని నెమ్మదిగా అన్నాను అనుకుంటూ గట్టిగా అనేసింది.
ఆ టైంకి చీర తీసుకెళ్ళటానికి లోపలికి వచ్చిన వసుంధరమ్మ గారు "ఇది నీ పనా? దానికి ఫోన్ చేసి పొలిపించావా? అదేదో...కల, అమ్ముమ్మ అంటూ కధలు చెబుతుంటే నిజమనుకున్నాను. మీకందరికీ నా చీర మీద అంత అక్కసు ఎందుకు? ఎలాగోలా దాన్ని నానించి దూరం చేద్దామని చూస్తున్నారు" అని పళ్ళు పట పటలాడించారు.
"అదేం కాదు అత్తయ్యా...మొన్న ఆ వాషింగ్ మెషీన్ అబ్బాయి వచ్చి మీ చీర చూసి నాకు చివాట్లు పెట్టి వెళ్ళాడు అని నిమ్మీతో చెప్పాను" అని భయం నటిస్తూ సంజాయిషీ మాత్రం నిజాయితీగా ఇచ్చింది.
అలా ఆ చీరకి దూరమైన వసుంధరమ్మ గారు, ప్రతి రోజూ వంట చేస్తూ "నీ వల్లే మా అమ్మ చీరకి దూరమవ్వాల్సి వచ్చింది" అని కోడలు ప్రశాంతిని దెప్పుతూ ఉంటారు.

కామెంట్‌లు