"ఇల్లాలు":--వై నీరజారెడ్డి ,తెలుగు భాషో పాధ్యాయురాలు. జడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లి . మండలం .జిల్లా సిద్దిపేట.

 లేలేత ఉదయ కిరణాలు భూమిని ముద్దాడుతున్న సమయం. సప్తవర్ణాల తో కలలు వ్యాపిస్తున్నాయి. రోజులాగే అమ్మ చేయికి అరక్షణం తీరిక లేదు. వేకువజామున నాలుగు గంటలకే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి, ఇంటిల్లిపాదికి అవసరాలను ఒంటిచేత్తో తీరుస్తుంది.
 పేపర్ చదువుతున్న నాన్న ఏమోయ్ కాఫీ తీసుకురా అన్నాడు ఇదిగో తెస్తున్నా నండి అంటూ నాన్నకు అందించింది టిఫిన్ తయారుచేసావ కొడుకు కోడలు ఇంకా లేచినట్టు లేదు అంటూ అనుమానంగా అటు వైపు చూశాడు లేదండి ఇంకా వాళ్లు లేవలేదు లేదంటే ఈ పాటికి కాఫీ అడిగేవారు రాత్రి ఆఫీస్ నుండి  లేటుగా వచ్చారు అంటూ నాన్న తాగిన కాఫీ కప్పు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది. 
నాన్న నా గదిలోకి వచ్చి, ఏ రా చిన్నోడా నిద్ర లేచావా, లేదా? అంటూ బెడ్ వైపు చూడగా బెడ్ ఖాళీగా కనిపించింది, ఇంతలో స్నానం చేసి  రెడీ అయినా నన్ను చూసి, టిఫిన్ తిందువుగాని రారా అంటూ పిలిచాడు. ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్దకు చేరారు, మమ్మల్ని గమనించిన అమ్మ మాకిద్దరికీ టిఫిన్ వడ్డించింది. 
అన్నయ్య వదిన  బద్దకంగా నోట్లో బ్రష్ వేసుకుని ,ఇంటి బయట వాసరా లోకి వచ్చి నిలబడ్డారు. అమ్మ అవిరామంగా పనులతో యుద్ధం చేస్తూ, కిచెన్ లోని వండిన పాత్రలన్నీ డైనింగ్ టేబుల్ పైన అమర్చింది. మధ్యాహ్నం అందరికీ లంచ్ బాక్సులుపెట్టి, ఎవరి బ్యాగులో  వాళ్లకు  నీటుగా సర్ది పెట్టింది. 
 అందరూ ఆఫీస్ కి బయలుదేరారు. అమ్మ కూడా హడావిడి గా తయారై ,ఆఫీసుకు బయలుదేరింది. ఇంట్లోంచి అందరూ వెళ్ళగానే, ఇంటికి తాళం వేసి ,వెనక్కి తిరిగింది .ఇంతలో కళ్ళు బైర్లు కమ్మి అలాగే ముందుకు తూలింది. 
అక్కడే ఉన్న నాన్న ఏంటోయ్ ఏమయింది అంటూ గట్టిగా పట్టుకున్నాడు. నేను అన్నయ్య అమ్మ అంటూ వెళ్ళాము .వదిన అత్తయ్య అని దగ్గరకు వచ్చింది,
 అమ్మ ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది .ఏంటి ఇంత జ్వరం అని హాస్పిటల్లో జాయిన్ చేసాము . డాక్టర్ పరీక్ష చేసి, చాలా బలహీనంగా ఉంది. ఈమెకు విశ్రాంతి అవసరం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అని చెప్పాడు. 
అమ్మ  ఇంటికి రాగానే మళ్లీ పనులు చేయడం ప్రారంభించింది .అందరం గట్టిగా వారించాము. ఇక చేసేది లేక ,అమ్మ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటుంది.
 అప్పుడు తెలిసొచ్చింది మాకు అమ్మ విలువ, అసలు ఇంట్లో సమయానికి కి ఒక్క పని కూడా కావడం లేదు, టిఫిన్లు భోజనాలు అన్ని  ఆలస్యమవుతున్నాయి. పని మనిషిని పెట్టిన, సమయానికి పనులు జరగడం లేదు. ఇల్లంతా గందరగోళంగా తయారైంది. వదిన ఊరికే విసుక్కోవడం అందరం గమనిస్తున్నాం. 
ఇవన్నీ గమనించిన నాన్న మెల్లగా అమ్మ రూం లోకి వెళ్ళాడు .అమ్మ ని చూడగానే నాన్న కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకొని ,ఏమోయ్ ఇంత సహనం నీకు ఎలా అలవడింది .ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎలా భరించావు. ఒక్కనాడైనా నీ ముఖంలో విసుగు నేను చూడలేదు. ఇది కావాలని నువ్వు నన్ను ఎన్నడూ అడగలేదు. మేమందరం అసలు నిన్ను ఒక మనిషి లా కాకుండా యంత్రంలా చూసాము. కనీసం నిన్ను నేను ఒక్కనాడైనా తిన్నావా, అని కూడా అడగలేదు. అంటూ అమ్మ చేతులు పట్టుకొని బోరున ఏడ్చారు. 
ఏంటండీ మీరు చిన్న పిల్లాడిలా, ఇలా ఏడుస్తున్నారు. అంటున్న అమ్మ కళ్ళు సెలయేరుల ప్రవహిస్తున్నాయి. ఇన్నాళ్లు గుండెల్లో నిండిన భారమంతా, ఒక్కసారిగా దూదిపింజలా ఎగిరిపోయింది. 
నీతి
ప్రతి ఇల్లాలుకోరుకునేది, తన వాల్లను0డి కొంచెము ప్రేమ ఆప్యాయత మాత్రమే అవే ఆమెకు ఎనలేని సంపద.
కామెంట్‌లు