ఆదర్శం...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం  ఎక్కువగా జీవితచరిత్రలు చదివితే  ఆసక్తిగా స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటాయి. అందులో  బాల్యంలోనే వారి సంకల్పం దృఢదీక్ష మనకు తెలిసిపోతుంది. 
ఆ ఇద్దరు అన్న దమ్ములు  చెరోజట్టులో ఉండి చాలా పట్టుదల  గెలుపు మాదే అన్న విధంగా కబడీ ఆడుతున్నారు.  తమ్ముడి టీం మంచి పట్టుసాధించి  గెలుపు దిశలోఉంది. అన్న కూతపెడుతూ  తమవైపు రాగానే  ఉడుము లా పట్టుకున్నాడు."ప్లీజ్ నన్ను  వదలరా !తమ్ముడి చేతిలో ఓడావని ఫ్రెండ్స్  ఏడిపిస్తారు " అని అన్న గొణిగాడు. "ఆటలో అన్న తమ్ముడు  అని చూడకూడదు. యుద్ధం లో అయినా  జాలి పడరాదు"అని జట్టును గెలుపు తీరం చేర్చిన  ఆతమ్ముడే గోపాల కృష్ణ గోఖలే.
 శ్రీ నారాయణప్రసాద్ సింహా  సెంట్రల్ లెజిస్లేటివ్  అసెంబ్లీ లో కి స్వరాజ్యపార్టీ తరుఫున గెలిచిన దేశప్రేమికుడు.ఆరోజు ల్లో బ్రిటిష్ వారి పెత్తనం మనదేశం లో సాగుతోంది.  ఆ అసెంబ్లీకి అప్పుడు అధ్యక్షుడు  విఠల్ బాయ్ పటేల్.ఆయన సర్దార్ పటేల్ అన్న. నారాయణ  హిందీ లో మాట్లాడటంమొదలు పెట్టగానే పటేల్ నిరాకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి  అసెంబ్లీ లో ఆంగ్లంమాట్లాడి తీరాలి.  పటేల్  ఎన్ని సార్లు  హెచ్చరిక చేసినా మందలించినా నారాయణ  హిందీ లో మాట్లాడటంతో చిరాకు గా పటేల్  అడిగాడు "ఏమిటా మొండితనం బాబూ?హిందీ లో వద్దు. "నారాయణ జవాబు ఇది "నామాతృభాష హిందీ. ఆంగ్లంరాదు." పటేల్ ఇలా అడిగాడు "మరి నేను ఆంగ్లంలో మాట్లాడితే నీకు ఎలా అర్థం అవుతోంది?" నారాయణ జవాబు ఇది "అయ్యా! ఇక్కడ  అభిప్రాయం  చెప్పాలి.నేను గెల్చి ఈ సభలో అడుగు పెట్టాను.నాతల్లి నాభాష నాదేశం నా ప్రాణం. " ఆయన ఆత్మాభిమానం  ముందు పటేల్  తలవంచక తప్పలేదు. తొలి హిందీ వక్తగా  నారాయణ ప్రసాద్ సింహా  చరిత్ర సృష్టించిన దేశభక్తుడు.మాతృభాష పై మమకారంతో బ్రిటిష్ వారి  శాసనాన్ని ధిక్కరించినవాడు.
కామెంట్‌లు