అనుకున్నదొక్కటీ .....!!-------శ్యామ్ కుమార్ నిజామాబాద్.


 అది నాటకాలకి, స్టేజి మీద డాన్స్ ల కి ఒక స్వర్ణ యుగం.  దాదాపుగా 1990 వరకు ఎక్కడైనా నాటకాలు,  స్టేజి మీద డాన్స్ లు, మిమిక్రీ లేదా మరి ఇలాంటి కార్యక్రమాలు   ఏవి ఉన్నా సరే   ప్రేక్షకులు కోకొల్లలుగా వచ్చేవారు.  కాని  కొన్నింటికి ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉండేది.  మరికొన్నింటికి ప్రవేశ రుసుము(  టికెట్స్ ) పెట్టేవారు .    ప్రత్యేకమైన కార్యక్రమాలకి డొనేషన్స్ తీసుకొని ,వారికి మాత్రమే  కొన్ని పాసులు ఇచ్చేవారు.  వచ్చే జనాలను అదుపుచేయడానికి కొన్నిసార్లు పోలీసుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చేది.  ఈ సమయంలో టీవీలు సీరియల్స్  లేనందుకు   ఇటు వంటి కార్యక్రమాలు మాత్రమే ఉల్లాసాన్ని కలిగించేవి.  చాలావరకు ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులందరూ పిల్లా పాపలతో కలిసి వచ్చేవారు.  ఆ సభా ప్రాంగణం బయట  తినుబండారాల దుకాణాలతో, బండ్లతో చాలా కోలాహలంగా ఉండేది.
 అటువంటి సమయంలో నేను మా ఊర్లో చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన వాణి ఆర్కెస్ట్రా కు వెళ్ళటం మొదలు పెట్టాను. అక్కడ దాదాపుగా అందరూ నాకు తెలిసిన వాళ్ళు అవటం మూలాన నాకు తొందర్లోనే సభ్యత్వం దొరికి వారి కార్యక్రమాలలో పాలు పంచుకునే అదృష్టం కలిగింది.  పేరుకు అది ఆర్కెస్ట్రా అనే కానీ అందులో నాటకాలు డాన్సులు  పాటలు మిమిక్రీ వగైరాలు అన్నీ కూడా రూపొందించేవారు.  
సత్యనారాయణ అనబడే  కుమార్ గల్లి కి చెందిన యువకుడు  దాని వ్యవస్థాపకుడు.   స్కౌట్స్ బిల్డింగ్లో  ఒక గదిలో అన్ని కార్యక్రమాలు , రిహార్సల్స్ చేసుకునేవారు.  అందులో కార్యనిర్వాహక వర్గం లో ముఖ్యులు నాంచారి నర్సయ్య ,నాంచారి లక్ష్మణ్ ,రాములు.   గణేష్ వెంకటేష్, ఉమేష్  గంగాధర్ ,    బర్దిపూర్  జానకి, ఉష అనబడే  మంచి గాయకులు ఉండేవారు.  అందరూ దాదాపుగా టీనేజ్ వయసు గల వారే.  మంచి కళాకారులు అవ్వడం మూలాన వీరికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండేది. 
1978 లో 
ఒకసారి  ఆర్మూర్ దగ్గరలో వున్న వూరి  నుండి ఒక వ్యక్తి వచ్చి వారి ఊర్లో ఒక రోజు రాత్రి మా ఆర్కెస్ట్రా నిర్వహించాలని కోరాడు.  అందుకు  కాస్త చిన్న మొత్తంలో బహుమతి కూడా  ఇస్తానని సూచించాడు. 
అయితే  ఆ రోజుల్లో దాదాపుగా మాకు ఎవరూ డబ్బులు ఇచ్చేవారు కాదు. కార్యక్రమానికి కావాల్సిన ఖర్చు అంతా మా మెంబర్స్ డొనేషన్లు తో కానీ , లేదా ఎవరైనా అభిమానులు కాస్తో కూస్తో  ఇచ్చే డబ్బు తో గాని సరిపోయేది .  కొన్నిసార్లు  ఎవరికైతే స్టేజి ఎక్కాలని తహతహగా ఉంటుందో  వారే  ఆ కాస్త ఖర్చును భరించేవారు. కాకపోతే మేము వెళ్ళిన దగ్గర మాకు ఉండటానికి సౌకర్యం మరియు భోజన ఏర్పాట్లు మా ఊరు వాళ్ళు చేసేవారు. ఆ కార్యక్రమం గురించి అందరూ తమకు తోచిన  అప్పుడే హిట్ అయిన పాటలు అన్నీ నేర్చుకునే వారు .    ప్రతి రోజు ఆ పాటలు పాడుతూ అందరు  రిహార్సల్స్ చేసేవాళ్ళం.  దాదాపు సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు  ఆ రిహార్సల్స్ నడిచేవి.   ఆ సమయంలో కాఫీ టీలు తాగడానికి లేదా ఏవైనా తినుబండారాలు తెచ్చుకోవడానికి కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కావు.  అందరం ఒక కుటుంబం లాగా మెదిలే వాళ్ళం.   రాత్రిపూట రిహార్సల్స్ అవుతున్నప్పుడు  అమ్మాయిల వెంట వారి కుటుంబ సభ్యులు  కూడా ఉండేవారు. కొన్ని  సమయాల్లో వారి ఇంటి దగ్గర మేము దింపే వాళ్ళం.
మా కార్యక్రమం  తేదీకి ఒక వారం ముందుగా  మా ఊరు నుంచి మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి మా చేతిలో ఒక నూరు  రూపాయల డబ్బు పెట్టి వెళ్ళాడు.  మా ఆర్కెస్ట్రా పరికరాలన్నీ తీసుకొని మేము వెళ్లడానికి మళ్ళీ తిరిగి రావడానికి అయ్యే దారి ఖర్చులకు మాత్రమే  అవి సరిపోతాయి.
దాన్ని చూసి మా సంతోషానికి ఆరోజు అవధులు లేవు.  ఆ వ్యక్తి వెళ్లే ముందు గా మాకు తను చేస్తున్న కార్యక్రమం గురించి కొన్ని విశేషాలు కూడా చెప్పాడు.  అదేమిటంటే అతను మాకు ఉండడానికి సౌకర్యం భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా తనకు అమ్ముడుపోయే టికెట్లను బట్టి మాకు కాస్త డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. అప్పుడు మాకు అర్థమయింది అతను మా ప్రోగ్రాం కు టిక్కెట్లు  అమ్ముకుంటున్నాడు అని .  గోడలకు అంటించే   రంగురంగుల  పోస్టర్స్ కూడా తయారు చేయించాడు.    ఆ పోస్టర్ చదివి మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమం  లాగా కనిపించింది.  
అందులో ఏముందంటే     "' మీ ఊరిలో ఎప్పుడు కని విని ఎరుగని ఆర్కెస్ట్రా తో కూడిన నాటక మరియు డాన్సులు నిర్వహించబడుచున్నవి .  జ్యోతిలక్ష్మి విజయలలిత లను మరిపించే    డాన్సులు,    రంగులతో కూడిన  పోక సింగ్  లైట్లతో మిమ్మల్ని అలరింప చేయుదురు.  తప్పక చూడండి.  ఆలస్యము చేసిన ఆశాభంగము.  టిక్కెట్లు చాలా తక్కువ ధరకే లభ్యమగును.  షరా మామూలే., స్త్రీలకు ప్రత్యేక సీట్లు కలవు""
 అప్పుడు మేము అడిగాము  
" ఏంటి,   డాన్సులు  కూడా పెట్టిస్తున్నారా?"అని. 
 అప్పుడు తను అన్నాడు 
" అవునండి మహారాష్ట్ర నుంచి అమ్మాయిలు వస్తున్నారు" అని. 
అప్పుడు మాకు అనిపించింది  ఇది ఏదో చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు అని.  దాంతో రెట్టించిన ఉత్సాహంతో అందరూ ఇంకా ఎక్కువగా రిహార్సల్స్ చేయడం మొదలుపెట్టాము.
 మొత్తానికి ఆ రోజు అందరం  స్కౌట్స్ బిల్డింగ్ దగ్గర కలిసి అద్దెకు తీసుకున్న ఒక వ్యాన్లో చాలా సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ బయల్దేరాం.  సరిగ్గా మా వ్యాను బయలుదేరే సమయానికి ఒక పిల్లి  అడ్డం వచ్చింది.    డ్రైవర్ దాన్ని చూసి భయపడి కాసేపు ఆగి బయల్దేరుదాం సార్  అన్నాడు . అప్పుడు మేము అందరం దాదాపు  టీనేజ్  లోపు వయస్సు గల కుర్రాళ్ళం.   ""పిల్లి ఢిల్లీ జాంతానై చలో ""అని నవ్వుకుంటూ  వెళ్ళాం.  నిజాంబాద్ నుంచి మేము వెళ్ళవలసిన ఊరు దాదాపుగా 40 కిలోమీటర్లు  మాత్రమే అయినప్పటికీ ఆ రోజుల్లో ఉన్న రోడ్లు మరియు మెల్లిగా పరిగెత్తే వాహనం మూలంగా దాదాపుగా రెండు గంటలు సమయం పట్టింది.  అదొక పల్లెటూరు చుట్టూ పొలాలతోపచ్చగా కళకళలాడుతోంది.  మట్టి రోడ్లు,  దాంతో మా చుట్టూ బోలెడు దుమ్ము  . వ్యాన్ కిటికీల గుండా మేము గమనించి చూస్తే   ఊరి గోడలన్నీ    మా ప్రోగ్రామ్ యొక్క పోస్టర్స్ తో నిండిపోయి ఉన్నాయి.    దూరంగా మేము చేయవలసిన కార్యక్రమం యొక్క  స్టేజి కనబడుతోంది.   పెద్దగా రంగురంగుల    కర్టెన్స్ తో చాలా బాగా   కనిపించింది.  మేము దిగగానే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి మమ్మల్ని కౌగలించుకొని ఒక పాఠశాలలో కి తీసుకొని వెళ్ళాడు .  పాఠశాల భవనం లో మాకు ఉండడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు.  కింద చాపలు జంబుఖానాలు ఉన్నాయి.  ఫ్యాన్లు అయితే అసలే లేవు. అసలు  మాకెవ్వరికీ ఇంకా అప్పటికి  ఫ్యాన్లు అలవాటు కాలేదు.   ఆర్కెస్ట్రా కళాకారులు వచ్చారని తెలుసుకుని ఊరి జనం చాలా ఉంది పాఠశాలకు విచ్చేసారు.  కాసేపు దూరంగా నిలబడిన  ఆ జనాలు  కాసేపటికి  రూం లోకి వచ్చేసి మిమ్మల్ని పడుకొనివ్వకుండా చాలా డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు .    కాసేపు చూసి ఇక లాభం లేదు అనుకొని అందరినీ బయటకు  పంపించి తలుపులు  వేసుకొని    మేను వాల్చాము .  మరికాసేపటికి  ఊరి పిల్లలందరూ కిటికీల లోంచి   కిలకిలా నవ్వుతూ చూడటం మొదలుపెట్టారు.   ఇక చేసేదేమీలేక కళ్ళు మూసుకుని కాసేపు రెస్ట్  తీసుకున్నాం.
  అలా  అందరం కాసేపు  పడుకొని లేచి చక్కగా  ఇస్త్రీ బట్టలు వేసుకుని,  పాండ్స్ పౌడర్  రాసుకొని  కార్యక్రమం మొదలు పెట్టే సమయానికి సరిగ్గా కాసేపు ముందుగా  ఆ స్థలానికి చేరుకున్నాము.
  అక్కడ చూద్దుము కదా  దాదాపు 500 మంది దాకా ఉన్నట్టు అర్థం అయింది. వీరే కాకుండా టికెట్లు  తీసుకోకుండా ఉన్న చాలామంది కాంపౌండ్  గోడ అవతల నిలబడి చూస్తున్నారు. వినాయకుడి భక్తి గీతం తో మా కార్యక్రమం మొదలు  అయ్యింది.  దాదాపు ఐదారు పాటలు    పాడిన తర్వాత  ప్రేక్షకుల నుంచి అరుపులు మొదలయ్యాయి.  అదేమిటని గమనించి  చూస్తే వాళ్ళు డాన్సులు మొదలు పెట్టమని అడుగుతున్నారు. అయితే  అప్పుడు  ఊరి ఆర్గనైజర్ వచ్చి ఆ డాన్సర్స్ రావడానికి  ఇంకా సమయం ఉంది  సార్ అంతవరకు మీరు పాటలు లాగించండి అని  మాకు చెప్పాడు.  అలాగే మేము దాదాపు ఇంకొక గంట సేపు పాటలు పాడాము .   
అప్పుడు మళ్లీ ఆర్గనైజర్ వచ్చి "సార్ మీరు   నాటిక  మొదలు పెట్టండి, ఇంకా ఆ లేడీ డాన్సర్లు    రాలేదు "అని చెప్పాడు.   మేము సరె అని మా ఆర్కెస్ట్రా పరికరాలన్నీ  స్టేజ్ నుంచి తీసి వెనకాతల వ్యాన్లో పెట్టాము.
 తెర అవల జనాలందరూ గోలగోల చేస్తున్నప్పటికీ 
  మేము తెర తీసి  నాటిక మొదలుపెట్టాం. 
 ఒక 10 నిమిషాలు అయిందో లేదో డాన్సులు డాన్సులు అంటూ జనాలందరూ అరవటం మొదలు పెట్టారు.  కాసేపట్లో క్రమంగా అరుపులు ఎక్కువైపోయాయి.   మాకు ఏం చేయాలో అర్థం కాలేదు.  లోపలకు  సతీష్     వెళ్లి మమ్మల్ని పిలిచిన ఆ ఆర్గనైజర్ ను అడిగితే అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ చెప్పాడు అసలు సంగతి. అది ఏమిటంటే   జ్యోతిలక్ష్మి విజయలలిత లను మరిపించే  ఆ  లేడీ  డాన్సర్లు ఎవరు రాలేదు.
 మరేలా అని మేము అడుగుతే, "ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్" అన్నాడు . 
ఇంతలో స్టేజి మీదికి సన్నటి రాళ్లు మట్టి వేయడం మొదలుపెట్టారు  ఊరి ప్రేక్షకులు .  నాటకం బంద్ చేయండి నాటకం బంద్ చేయండి మాకు డాన్స్ లు కావాలి డాన్స్ లు కావాలి  అంటూ అరుస్తున్నారు . మాకు అసలు విషయం అర్థం అయిపోయి మేము చాలా పెద్ద ప్రమాదంలో పడ్డామని తెలిసిపోయింది.  ఇంతలో రెండు కర్రలు కూడా వచ్చి  స్టేజి మీద పడ్డాయి కొద్దిలో మాకు దెబ్బలు తగలకుండా ప్రమాదం తప్పింది.
 వెంటనే   ముందు  ఉండే 
 తెరను లాగేసి స్టేజి వెనుక వైపు నుండి  మేము దిగిన పాఠశాల వైపు పరిగెత్తాం. 
 మమ్మల్ని తీసుకు వచ్చిన వ్యక్తి  కై  చుట్టుపక్కల చూశాం.అతను ఎక్కడా కనబడలేదు. మా అందరి మొహాల్లో అప్పుడు కంగారు భయం మొదలైంది.  ఏం చేద్దాం అని మా సతీష్ ని అడిగాను.     అప్పుడు సతీష్ ఒకటే సెకండ్ ఆలోచించి "ఏంచేస్తాం ,ఏమీ లేదు, మనం    ఇక్కడ నుండి ఒక్క నిమిషం లోపల  పారిపోవాలి" అని చెప్పాడు .  అంతే మేమందరం మిల్ట్రీ లో ట్రైనింగ్ తీసుకున్నట్టుగా మూడు నిమిషాల్లో   మా సామాన్లతో వ్యాన్ లో ఉన్నాం.    మా వ్యాన్ స్టార్ట్ అయ్యి పాఠశాల కాంపౌండ్ దాటిందో  లేదో ఆ వెనక నుండి మా వ్యాన్ మీద రాళ్లు పడటం మొదలైంది.  వెనక్కి చూస్తే కొందరు ఊరి వాళ్ళు  మా వెనక పరిగెడుతూ వస్తున్నారు.
వాళ్లు  అరుస్తూ తిడుతూ ,రాళ్ళు విసురుతూ, పకడో పకడో అంటూ    మా వ్యాన్నును తరమడం మొదలుపెట్టారు.   మా డ్రైవర్ ని స్పీడ్ గా దంచు  స్పీడ్ గా దంచు అంటూ  తొందర చేసి  ఆ ఊరు దాటి  బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాం. 
 ఇప్పటికీ జరిగిన ఆ సంఘటన   తలుచుకొని మేమంతా కడుపు పగిలేలా నవ్వుకుంటాం.  ఎన్నో వందల కార్యక్రమాలు జరిపిన మేము  ఇలాంటి సంఘటన కూడా ఎదురవుతుందని ఎన్నడూ ఊహించలేదు.  ఆ తర్వాత ఆర్కెస్ట్రా కార్యక్రమం గురించి ఎవరు పిలిచినా వాటి పూర్వాపరాలు    అన్ని తెలుసుకొని కానీ మేము వెళ్లకపోయే వాళ్ళం.  ముఖ్యంగా జ్యోతిలక్ష్మి విజయలలిత లను మరిపించే డాన్సులు ఉంటాయంటే అసలు వెళ్ళకూడదు అని కూడా నిశ్చయించుకున్నాం.  మమ్మల్ని తీసుకెళ్లిన ఆ వ్యక్తి  ఆ ఊరి నుంచి మళ్ళీ మాకు ఎప్పుడూ కనబడలేదు.
ఫోటోలో....--సతీష్, గణేష్, వెంకటేష్,జానకి*

కామెంట్‌లు