భువనవిజయం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్‌

 సాహసమే నీ ఊపిరైతే
సాధనే నీ కర్తవ్యమైతే
సంకల్పమే గట్టిదైతే
లక్ష్యం ఏపాటిది?
నీ కష్టమే నీ ఇష్టమైతే
నింగి తల వంచదా?
నిర్విరామ కృషే నీ కార్యరంగమైతే
సహనమే నీ ఆయుధమైతే
ఆకాశమే నీ పాదాల క్రింద అద్దమవదా?
నీ ప్రతిబింబమే విశ్వరూపమై
దర్శనమివ్వదా?
పాదాక్రాంతమైన నక్షత్రాలే దారులు చూపుతాయి.
అనంతమైన‌ దివి చరణాల దారులకు బాట పరచగా,
అఖండతేజమై సాగిపోవాలి.
అమృతరేఖలే ఆనవాళ్ళై
దర్పణం లో నిలిచిపోవాలి.
నీ పథం క్షేమమై,భద్రమై కనిపిస్తుంది.
నిజం నీడలా నీ వెంటే కదులుతుంది.
ఆత్మవిశ్వాసమే నీదైతే
ఆకాశం నీ పాదాల క్రింద అద్దమై నిన్ను ప్రతిబింబిస్తుంది.