పెళ్లి సందడి ....!!:---------శ్యామ్ కుమార్ నిజామాబాద్.


 "అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి!!! ట్రాఫిక్ జామ్ అవుతుంది!
  మొదలే అది కొండ అటవీ ప్రాంతం, తొందరగా బయలు బయలుదేరుతారా ?లేదా  ? ఎన్ని సార్లు చెప్పాలి మీకు?"  అంటూ అరుస్తున్నాడు పెళ్ళికొడుకు.   
మనం ఎన్నో పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం  ,పెళ్ళికొడుకు ప్రశాంతంగా  కూర్చుని ఉంటాడు ,   మిగిలిన అందరూ కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మా స్నేహితుడుసుధాకర్  పెళ్లి బట్టలతో కంగారుపడుతున్నాడు ,మిగిలిన అందరూ ప్రశాంతంగా ఉన్నారు.  సుధాకర్ చాలా మంచివాడు. ఇంట్లో అన్నదమ్ములు అందరి తోటి ఏదోరకంగా కిరికిరి పెట్టుకోవడానికి  ప్రయత్నిస్తూ ఉండేవాడు.  ఓ రకంగా చెప్పాలంటే విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడు . ఇంట్లో  అందరికీ   ఒకరకంగా  సుధాకర్ అంటే చాలా భయం.  కానీ సంఘంలో మంచి పేరు ఉండేది. స్నేహితులతో చాలా  ప్రేమగా  మసలే వాడు.  అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉండేవాడు.  కానీ ఇంట్లో వాళ్ళకి   మాత్రం ఒక సింహస్వప్నం. 
 సుధాకర్  పెద్దన్నయ్య   మహాజన్    ధన్పాల్ ఓం ప్రకాష్ నాకు ముందుగా స్నేహితుడు.  సుధాకర్ కూడా   నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు.    నాతో స్నేహంగా,  నా సాన్నిహిత్యాన్ని చాలా బాగా ఆనందించేవాడు.   తరచుగా నా ఆఫీసు  కు కానీ ఇంటికి గాని వచ్చి కలిసేవాడు.
 ఒకసారి మా ఆఫీస్ కి ఏదో పని మీద వచ్చాడు. చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని రేబాన్ కళ్లద్దాలు పెట్టుకుని వచ్చాడు. ఆ రోజుల్లో రేబాన్ కళ్ళద్దాలు మనదేశంలో అమ్మేవారు కాదు. ఎవరైనా దుబాయ్ నుండి కానీ లేదా అమెరికా నుండి కానీ తీసుకుని వచ్చే వారు. రేబాన్ కళ్ళద్దాలు కలిగి ఉండటం ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేది .నా ముందు కూర్చొని  స్టైల్ గా కళ్ళద్దాలు తీసి టేబుల్ పై పెట్టి
 "ఇప్పుడే నా స్నేహితుడు అమెరికా నుండి  తెచ్చాడు" అన్నాడు. 
తీసుకుని చూశాను, అవి చాలా బాగున్నాయి. నేను " అసలు వాడిని ఎంత అన్నాను"
 "1200 కొన్నాను  ."అన్నాడు.
 నేను తనను చూసి "అలాగా, నేను 1500 ఇస్తాను, ఇస్తా వా ?" అని అడిగాను
" సరే తీసేసుకో. ఏం పర్లేదు నేను   మళ్లీ ఎప్పుడైనా కొనుక్కుంటాను"అని ఇచ్చేశాడు.  
 నేను వెంటనే నా దగ్గరున్న 1500 ఇచ్చేసాను. చాలా ఆశ్చర్యపోయాడు మొహం వెలిగిపోతోంది. " ఎందుకలా నాకు ఇచ్చేసావు?అంత ఇష్టంగా తెచ్చుకున్నావు కదా ?ఎందుకు ఉంచుకోవచ్చు కదా!!" అన్నాను.
 " అరే ఇప్పుడే కొన్నాను, 300 లాభం కదా!! నాకు !! "అన్నాడు నవ్వుతూ.
 ఈ సారి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. 300 కాదు కదా 500 ఇచ్చినా సరే అవి ఇక్కడ దొరకవు.  ఈ విధంగా ఎవరికీ అర్థం కాక పోయేవాడు.
  పెళ్ళికొడుకు సుధాకర్ ఎంత తొందరగా చేసినా సరే మొత్తానికి  పెళ్లి వారి బస్సు ఎప్పటిలాగే ఆలస్యంగా బయలుదేరింది .వివాహం అదిలాబాద్ పట్టణంలో  రాత్రి  8 గంటలకు జరగాల్సి ఉంది.   నిజామాబాద్ నుంచి అక్కడికి దాదాపుగా ఆ రోజుల్లో ఐదు గంటల ప్రయాణ సమయం పట్టేది. బస్సులో నేను ,మధు అని నా స్నేహితుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూర్చుని పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. ముందుగా కారులో పెళ్ళికొడుకు సుధాకర్   ,వారి తల్లిదండ్రులు ఉన్నారు.  మధ్యలో ఒక ఊరిలో అందరం దిగి కాఫీ టీలు తాగి మళ్ళీ బస్సు ఎక్కాం.  అప్పట్లో ఏసీ బస్సులు ఉండేవి కావు , మామూలు టూరిస్ట్ బస్సు అది.   బస్సు అంతా  పెళ్లి వారి మాటలతో కోలాహలంగా ఉంది. మూడు గంటలు గడిచిపోయాయి మా బస్సు అనుకున్న సమయం కంటే ఆలస్యంగానే ఉంది అని అర్థం అయింది.  మధ్యలో ఉన్న నిర్మల్ అనే ఊరు దాటిన తర్వాత మాకు అడవి , కొండ ప్రదేశం మొదలైంది. చాలా ఎత్తైన, ఇరుకైన మార్గములో వంపులు తిరుగుతూ బస్సు వెళుతూ  ఉంది.  రోడ్డుకిరువైపులా అడవి  కనిపిస్తోంది.  ఇంతలో మమ్మల్ని దాటుకొని ఒక    మెటా డోర్ అనే చిన్న వ్యాను,  చాలా వేగంగా వెళ్ళిపోయింది.  పెద్దపెద్ద వృక్షాలు  వాటి చల్లని గాలిని ఆస్వాదిస్తూ, నేను ,మధు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ  రోడ్డునుచూస్తున్నాం.  కాస్త దూరంలో చిన్న వంతెన  వద్ద మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయిన  వ్యాను పడిపోయి కనిపిస్తూ ఉంది. అందులో నుండి వెనకవైపు ఉన్న తలుపు  గుండా ప్రయాణికులందరూ బయటపడుతూ ఉన్నారు. మేము  అందరం వెంటనే బస్సు దిగి పరిగెత్తుకెళ్లి ఆ ప్రయాణికు   లను బయటకు తీశాం.   ఎవరికీ ప్రమాదం లేదని తెలిసింది.  ఆ   ఆ వ్యాను పడిపోయిన  వంతెన చాలా చిన్నదవటం మూలాన ఇంకా వేరే వాహనాలేవి అటు ఇటు పోవడానికి స్థలం లేకుండా ఉంది . దాంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.  మా పెళ్లి కొడుకు సుధాకర్  శుభం పలికినట్లు  సరిగ్గా అలాగే జరిగింది.   తను ఇంటిదగ్గర  ఈ విషయమై అందర్నీ హెచ్చరిస్తున్నప్పుడు బహుశా  తధాస్తు దేవతలు ఏమైనా దగ్గరగా ఉన్నారేమో అనిపించింది.     రెండు  వైపుల  ఆగిపోయిన వాహనాల నుండి చాలా మంది ప్రయాణికులు మరియు డ్రైవర్లు, అందరూ దిగి వచ్చి ప్రమాదం జరిగిన స్థలంలో గుమికూడారు.  ఆ వంతెన  కింద  చాలా  లోతుగా నీరు పోయే చిన్న నది కాలువ ఉంది.   వాహనాలు ఆ ప్రదేశాన్ని  దాటుకొని వెళ్ళటానికి  ఆ వంతెన తప్ప వేరే మార్గం కనిపించలేదు.  వంతెనకు పక్కగా నున్న పిట్టగోడ మీద ఆ వ్యాను సగం ఎక్కి సగం కింద రోడ్డుకడ్డంగా పడి ఉంది.  ఇంకాస్త వేగంగా నడిపి ఉంటే ఆ వ్యాను పిట్టగోడ మించి పూర్తిగా ఆ వంతెన ఎక్కినది లోకి పడి పోయి ఉండేది.   వ్యానును   అక్కడ నుండి  తీసి పక్కన పెట్టడం మినహా ఇంకొక మార్గం ఎవరికీ అర్థం కాలేదు. ఎలా చేయాలో అక్కడ మార్గదర్శకం  ఇవ్వడానికి  కూడా ఎవరికీ  తెలియలేదు.  అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఆ వ్యాన్ ను  పక్కకు తీసి రోడ్డు నుండి దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో నేను, మధు కాస్త ముందు నిలబడి నాయకత్వం వహించాము.   ఆ వ్యాను ముందుభాగం పిట్టగోడ మీదుగా ఉండటంతో వెనుక భాగాన్ని పట్టుకొని లేపి పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా అది బ్యాలెన్స్ కోల్పోయి  పిట్టగోడ మీదుగా  నది లోకి   ప్రమాదకరంగా అటు వైపు వంగింది.   అయితే కొందరు అప్పటికే అరుస్తున్నారు .
" అది నదిలోకి పడిపోతుంది ,జాగ్రత్త!! జాగ్రత్త!!" అంటూ.  
దాని బరువును మోస్తూ పైకి లేపిన మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.   మాకు తోచిన రీతిలో   దానిని కాస్త పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తుండగా  అది పట్టు కోల్పోయి  ముందుకు జరిగి పిట్టగోడ మీదుగా  జారి పెద్దగా  చప్పుడు చేస్తూ కింద కాలవ లో పడి పోయింది. నిజం చెప్పాలంటే అప్పటి వరకూ దానికి పెద్దగా ఏమి నష్టం జరగలేదు కిటికీల అద్దాలు రెండు పగిలి కనిపించాయి అంతే.    కింద  నీటి లోకి చూస్తే అర్థమైంది, ఆ    వ్యాన్    దాదాపుగా సగం వరకు పనికి రాకుండా దెబ్బ  తినిపోయింది అని. అందరూ నిశ్చేష్టులై పోయారు. నాకూ మధుకు   కంగారు మొదలు  అయ్యింది.  అక్కడ ఉన్న జనాలు అందరూ గోల చేస్తూ దగ్గరికి వచ్చి  కింద పడ్డ ఆ వ్యాన్ ను చూస్తూ ఉన్నారు.  
మేం చేసిన పొరపాటు ఏంటో నాకు మధుకు అర్థమై మెల్లిగా ఆ జనాల నుంచి  దొంగల లాగ  మోహం దాచు కుంటూ,  అక్కడ నుంచి జారుకొని   మా టూరిస్టు బస్సు దగ్గరికి వచ్చి లోపల కూర్చున్నాం.   యువకులమైన మా ఇద్దరికీ అక్కడ జరిగిన నష్టం కంటే కూడా ఆ సంఘటన జరిగిన పద్ధతికి చెంపలు నొప్పి పుట్టేలా నవ్వుతూ ఉండి  పోయాం. 
"అరే !అంత ఈజీగా ఎలా పడిపోయింది రా!! , అంత బరువైన   వాహనం లేచి  ఎంత తేలిగ్గా పడిపోయింది!! మొత్తానికి  మన జబ్బలు, భలే బలం ఉందే"  అనుకుంటూ ఇంకా నవ్వుకున్నాం.
 అప్పుడు అసలు విషయం మొదలు అయ్యింది. డ్రైవర్ కు జరిగిన   నష్టం అర్థం అయిపోయి రోడ్డుకు అడ్డంగా పడుకుని  ధర్నా చేశాడు.   కాస్త దెబ్బలు తగిలిన ఆ వ్యాను ఇప్పుడు ఎందుకు పనికి రాదు నాకు మీరు డబ్బులు ఇస్తే కానీ కదలడానికి వీలు లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను వాహనాలు  ఇక్కడినుంచి పోనివ్వను.  లేదా నాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వండి అంటూ అడ్డంగా పడుకున్నాడు. వాడికి ఎంత నచ్చచెప్పినా చేసినా కూడా కదలకుండా రోడ్డుమీద బైఠాయించా డు.   ఇదంతా చూసి పెళ్లి కొడుకు సుధాకర్  ఇంకా అగ్గిమీదగుగ్గిలం అయిపోయాడు.  బస్సులో ఉన్న తన చుట్టాలను అందరిని తిట్టడం మొదలుపెట్టాడు. "ఇలాంటి ఏదో జరుగుతుందని ఊహించే నేను మొదలు అందరినీ జాగ్రత్త చేశాను. ఎవరైనా విని వచ్చారా "అంటూ ఇంకా అరవడం మొదలు పెట్టాడు.  మేము మా టూరిస్టు బస్సు దిగకుండా లోపల్నుంచి రోడ్డుమీద జరుగుతున్నదంతా గమనించసాగాను.  ముందుగా ఉన్న వేరే బస్సులు రోడ్డు దాటడానికి వంతెన దాటడానికి తమ  హారన్లు మోగించుకుంటూ ముందుకు సాగాయి కానీ ఆ డ్రైవర్ మాత్రం ఇ
 ఆ వాహనాల టైర్లకు   పూర్తిగా అడ్డం పడుకొనిఅ   కదలకుండా చేశాడు.  మాకేమో ఇంకా ప్రయాణం  చేయవలసినదూరం చాలా ఉంది.  వివాహ ముహూర్తం దగ్గరకు వస్తూ ఉంది.   ఏం చేయాలో తెలియక అందరికీ టెన్షన్ లో పెరిగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ  పాటికే మేము పెళ్లి ఇంటికి చేరుకొని వలసిన సమయం  అది.   ఈ విషయం ఆడపిల్ల పెళ్లి  వారికి చెప్పడానికి  అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు.మా ఆలస్యానికి కారణం  తేలిక అక్కడ పెళ్లి వారు చాలా కంగారుగా ఉన్నారు.  అక్కడ వెనకవైపు టైర్ల దగ్గరగా బరువు  పైకి లేపింది నేను , మధు మాత్రమే. మేమిద్దరం కలిసి అంత బరువైన   వ్యాను ను అంత తేలికగా పైకిలేపి నదిలోకి    ఏ విధంగా తోయ గలిగాము అన్నది  ఇప్పటికీ కూడా మాకు అంతుచిక్కలేదు.  ఆ వ్యాను డ్రైవర్ కు ఎంత నచ్చజెప్పినా వినలేదు దాంతో అక్కడున్న జనాలు అందరూ కలిసి అతని 
  చెయ్యి కాళ్ళు నడుము పట్టుకొని  తీసుకెళ్లి రోడ్డు పక్కన   కూర్చొ పెట్టారు. వెంటనే అక్కడున్న జీపులు కార్లు బస్సులు పొలోమంటూ పరుగులు పెట్టాయి. ఎవరికివారు పరిగెత్తి వాళ్ళ వాళ్ళ వాహనాల్లో ఎక్కి నడుపుకుంటూ వెళ్ళిపోయారు. 
మేమిద్దరం "మొత్తానికి భలే చేశామే! బాగా జరిగింది!!" అని కడుపారా  నవ్వుకుంటూ  పెళ్లి ఇంటికి వెళ్ళిపోయాం.  అంతమందిలో మమ్మలిద్దర్నీ ఎవరు గుర్తుపట్టలేదు, ఆ సంఘటనలో మమ్మల్ని ఎవరూ చూడలేదు అనుకుంటూ మేము వివాహ వేడుకల్లో మునిగిపోయాం.  కానీ మమ్మల్ని అక్కడ గుర్తుపట్టడం జరిగింది, పైగా ఎవరికి సంబంధించిన వాళ్ళమో  కూడా   
 ఆ వ్యాను డ్రైవర్ కు తెలిసింది.  అప్పుడు మాకు అనుకోని ఎదురు చూడని సంఘటన పెళ్లి ఇంట్లో జరిగింది. 
 ఆ వాహనం యొక్క డ్రైవరు దాని యజమానిని మరికొందరిని వెంటబెట్టుకొని   వివాహ మంటపం దగ్గరికి  వచ్చేశాడు.  సుధాకర్ అన్నయ్య ఓం ప్రకాష్ కు ఇవేవీ తెలియదు ఎందుకంటే తను మా కంటే ముందుగా అదిలాబాదు కు వచ్చి పెళ్లి పనులు అన్నీ చూసుకుంటూ ఉన్నాడు.  లోపల కూర్చున్న మాకు పెళ్లి ఇంటి బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించింది. కాసేపు ఏంటో లే, మనకెందుకు, అనుకుంటూ నేను మధు మాట్లాడుకుంటూ లోపల వివాహం చూస్తూ కూర్చున్నాం. కాసేపటికి అక్కడ గొడవ తీవ్రతరమై నట్టుగా అనిపించింది .
"వెళ్లి చూద్దామా " అనుకుంటూ మేమిద్దరం వెళ్ళాం.   అక్కడకు వెళ్లి గమనిస్తే మాకు ఆ డ్రైవరు కనిపించాడు.  ఆ పట్టణంలో మా స్నేహితుడు ఓం ప్రకాష్ కి కాస్త పరపతి ఉండటం మూలాన అతను వాళ్లందరినీ కంట్రోల్ చేస్తూ కనిపించాడు.  ఆ వాహన యజమాని ,ఓం ప్రకాష్ కు జరిగిందంతా చెప్పి దానికి బాధ్యులు  మీరే కనుక మాకు నష్టపరిహారం ఇప్పించాలని ఒప్పించాడు. ఆ శుభకార్యం సమయంలో గొడవల ని తగ్గించడానికి ఓం ప్రకాష్ కూడా ఒప్పుకొని "సరే ఎంత  అయితే అంతా ఇస్తాను .ఈ పెళ్లి లో గొడవ చేయకండి మీరు వెళ్లిపోండి .మనం మనం తర్వాత చూసుకుందాం" అంటూ నచ్చజెప్పి పంపించేశాడు. 
 మొత్తానికి ఆ గొడవంతా సద్దుమణిగి  వివాహం  బ్రహ్మాండంగా జరిగింది.  వివాహ భోజనాలు  దంచి కొట్టి ఆ   తర్వాత  అందరూ స్నేహితులం విడిది ఇంట్లో మాకు కేటాయించిన గదిలో కూర్చొని పేకాట   యమ  జోరుగా  తెల్లవారుజామున నాలుగు గంటల వరకు  ఆడుకొని అప్పుడు పక్కలు వేసాము.  మేము నిద్ర లేచేటప్పటికి బస్సు    తిరుగుప్రయాణానికి బయల్దేరడానికి రెడీగా ఉంది. అయితే  మాలో ఒకడైన స్నేహితుడు  లక్ష్మి కాంత రావు కనబడలేదు  .ఎటు వెళ్ళాడో అర్థం కాలేదు. బస్  బయల్దేరడానికి   మిగిలిన బంధుమిత్రులు అందరూ తొందర చేయసాగారు.   అంతలో దూరంగా చేతిలో ఒక  మట్టి రంజన్    కొనుక్కుని వస్తూ కనపడ్డాడు.  బస్సు బయలుదేరడం గమనించి అతను ఖంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు.  ఆదిలాబాద్ లో రంజాన్ అని ఒక మట్టి కుండ  చాలా ప్రఖ్యాతి   కలిగి ఉండేది.  ఎండాకాలంలో అందులో నీళ్లు చాలా చల్లగా అయ్యేవి.  అది చాలా  బరువుగా ఉండటం మూలాన దాన్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ,  ఆయాసంతో రొప్పుతూ   బస్సు దగ్గరికి వచ్చేసాడు.  కానీ అంతలోనే సరిగ్గా బస్సు ఎక్కే సమయానికి కాలుజారి   బొక్క బోర్లా పడ్డాడు.    ఆ కింద పడటంలో కూడా చేతిలో ఉన్న ఆ మట్టికుండను రక్షించడానికి   అరివీర భయంకరంగా చాలా ప్రయత్నం చేశాడు.
 పాపం.   కానీ అది కింద  రోడ్డుకి కట్టుకొని 50 ముక్కలుగా పగిలిపోయింది  .  అది చూసిన వారికి ఎవరికీ కూడా నవ్వు ఆగలేదు. అందరూ   కడుపు చేతిలో పట్టుకొని చాలాసేపు నవ్వుకున్నారు.  ఇంతలో పెళ్ళికొడుకు సుధాకర్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని లేపి  బట్టల0కు అంటుకున్న మట్టిని అంతా  దులిపి  బస్సు ఎక్కించాడు.  బంధు మిత్రులు అందర్నీ  మరీ పేరుపేరునా పలకరించి, చేతులు కలిపి, భుజాలమీద చెయ్యేసి  పెళ్లికి విచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపి  బస్సు కదిలే వరకు నిలబడి అందరినీ సాగనంపాడు.  బస్సు స్పీడందుకుంది వెనక్కి తిరిగి చూసాను అప్పటికి కూడా సుధాకర్ చెయ్యి ఊపుతూ నిలబడ్డాడు అక్కడే.  కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కంట్లో నలుసు లాగ  ఇబ్బంది పెడుతూ వుండే    దంపాల్ మహాజన్ సుధాకర్ మాకు మాత్రం  జీవితాంతం మరచిపోలేని మంచి ప్రియమిత్రుడు.
-----------------------------------------
ఫోటోలో....మిత్రులు....సుధాకర్, మధు.
కామెంట్‌లు