గుడ్మార్నింగ్ :(316 వ రోజు)--తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 పుట్టిన దగ్గర నుండి, చనిపోయే దాకా, మనుషులు అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటారు- తెలుసుకుంటూ ఉంటారు- జీవితానికి అన్వయించుకుంటూ ఉంటారు.నేర్చుకోవడం తెలుసుకోవడం ఎన్నో విధాలుగా ఉంటుంది.
చిన్నప్పుడు తల్లిదండ్రులు, తరువాత స్కూల్ జీవితం, తరువాత ఉద్యోగ వ్యాపార వగైరా ఉపాధి రంగాల్లో, సాటి మనుషులతో కలిసి మెలిసి పనిచెయ్యడం ద్వారా కూడా ఎన్నో విషయాలను గ్రహిస్తూ ఉంటాం!
విడిగా ,వ్యక్తిగతంగా చదవడం ద్వారా, చూడటం ద్వారా, వినడం ద్వారా కూడా ,అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటాం.తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి అంతులేదు.
మన జీవితంలో, అనేక దశల్లో అనేక విషయాలను చెప్పడానికి గురువులు కూడా ఉంటారు.ఇల్లు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ వగైరా, అన్నిట్లో గురువు పాత్ర ధరించేవారు ఉంటారు.వారు మనకు తెలుసు.
కానీ, ప్రకృతి కూడా ఒక పెద్ద గురువు అనేది మనకు సరైన సమయంలో ఎవరూ చెప్పకపోవచ్చు- తెలియకపోవచ్చు- సకాలంలో ప్రకృతి గురించిన 'ఎరుక' కలిగితే, సమస్యలు తక్కువ అవుతాయి!జీవితం సౌకర్యంగా ఉంటుంది. ఆనందం సంతోషం మన స్వంతం అవుతాయి.
అందరు గురువుల కంటే, ప్రకృతి అతిపెద్ద గురువు!
మీరు కొన్ని మొక్కలను పెంచి చూడండి- ఓ కుక్కపిల్లనో- ఓ పిల్లిపిల్లనో ,ఓ పక్షినో పెంచి చూడండి, మీకు మీరు ఆశ్చర్యపొయ్యేలా, ఎన్నో విషయాలు అర్థం అవుతాయి. మానవజాతి నాగరీకులు‌ అయ్యే క్రమంలో, పొగొట్టుకోకూడని ఎన్నో ఉత్తమ లక్షణాలను ,ఏమేమి పోగొట్టుకున్నారో- అర్థం అవుతూ ఉంటాయి. మనం పోగొట్టుకున్న ఎన్నో మంచి లక్షణాలు, అత్యవసర ఉత్తమ లక్షణాలను, పక్షులు జంతువులు మొక్కల్లో మనం గమనించవచ్చు.అవి పోగొట్టుకోలేదు,మనం పోగొట్టుకుని దేవులాడుతున్నాం!
యూనివర్సిటీ అనే పదానికి ఉన్న అసలైన అర్థం, ఎంతమంది వర్సిటీ విద్యార్థులకు తెలుసో,నాకు తెలియదు. యూనివర్సిటీ అంటే'విశ్వం' అని కద అర్థం!?
విశ్వం అంటే? ప్రకృతి- సమస్త పదార్థం!పంచభూతాలు అన్నారు పూర్వులు!
ఆ యొక్క ప్రకృతికి‌ మనకూ ఉన్న సంబంధం ఏమిటి?మరి మనకు ఉందా? లేకపోతే ఏం చెయ్యాలి? 
మీరు కాస్తా పెరటితోట చెయ్యండి- తెలుస్తుంది!
స్ధలం లేదా? మిద్దెతోట చెయ్యండి- తెలుస్తుంది!
అదీ లేదా? బాల్కనీ- వరండా , కాస్తా ఎండపడే చోటు ,
ఏ కాస్తా ఉన్నా,ఓ కుండీలో మట్టి ఎరువు వేసి, ఓ కరివేప మొక్కను నాటండి.ఏ మాత్రం అవకాశం ఉన్నా,ఓ కుక్కపిల్లను ,లేదా పిల్లిపిల్లను పెంచడం ప్రారంభం చెయ్యండి. ఇక మహత్తరమైన 'ప్రకృతి గురువు' మీ ఇంట్లో మీతో నిత్యం సంభాషణ ప్రారంభం చేస్తుంది.
ప్రకృతికీ మనకూ ఉన్న సంబంధం అర్థం అయితే, 
మనకు జీవితం గురించి సమస్తం అర్థం అవుతుంది.
గురువులకు గురువు,ప్రకృతి గురువు!

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
ప్రకృతి అసలైన గురువని మీరు చెప్పింది అక్షరాలా నిజం సర్. మీ మిద్దెతోట అనుభవాలు గొప్పవి.కృతజ్ఞతలు.