నరులు - నారాయణుడు:-మమత ఐల-కరీంనగర్9247593432
సకల జగత్తునేలే కాంతి నీవు
పరమార్థం తెలియని జీవం మేము

అఖండమైన జ్యోతి స్వరూపం నీవు
అల్ప అభాగ్యుమైన జీవం మేము

సృష్టిని సృష్టించిన దైవం నీవు
సృష్టిలోని జీవ జాలం మేము

సృష్టికి జ్ఞాన ప్రదాతవు నీవు
అజ్ఞానాంధకారంలో ఉన్నది మేము

తేజస్సుతో నిండిన దీపం నీవు
దీపపు మిణుగురులమై తిరిగేది మేము

భక్తికి పరవశించే దాతవు నీవు
పాప పుణ్యాన్ని యెరగనిది మేము

సర్వాంతర్యామివై నిలిచింది నీవు
సాదారణ మానవ జీవులం మేము

చీకటి తొలగించే వెలుగు నీవు
చీకటిలో కొట్టుమిట్టాడేది మేము

అసామాన్య శక్తికి నిదర్శనం నీవు
సామాన్య శక్తి హీనులం మేము


వేదనాదంలో విలసిల్లేది నీవు
దైవాన్ని గ్రహించని స్థితిలో మేము

ఆత్మలో పరమాత్మవై ఉన్నది నీవు
పరమాత్మను చూడలేని గతిలో మేము

ఏది ఏమైనా క్షమించి దరికి జేర్చుకునేది నీవు
చివరకు నీలో లీనమయ్యి తరించేది మేము

కామెంట్‌లు