కోతి మూతి ఎర్రన:- కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445

అనేక లక్షల సంవత్సరాల క్రితం కపిలారణ్యంలో ఓ పది కోతులు ఉండేవి.  వాటికి అప్పటిలో శరీరం రంగులోనే మూతులు ఉండేవి.అవి అరణ్యంలో కాసిన కొన్ని పండ్లుతిని బతికేవి.
         ఒకసారి వేసవిలో ఎండలు తీవ్రమైపోయాయి! అడవిలో కూడా కరవు సంభవించింది.అంటే అడవిలో ఉన్న ఒక్క చెరువు ఎండి పోయింది. నీటి కుంటలు కూడా ఎండిపోయాయి!
        మరి చెట్లు ఎండిపోసాగాయి.ఇక పండ్లక్కెడవి? కోతులు మిగతా జంతువులు ఆకలితో అలమటించసాగాయి.అవి ఆహారం వెతుక్కుంటూ అన్ని దిశలకూ వెళ్ళిపోయాయి.
       అలా హను అనే కోతి ఆహారం కోసం వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళింది.
దానికి ఒక పర్ణశాల కనబడింది.అందులోంచి మంచి పులుసు గుమ గుమ వాసన వచ్చింది.దానికి నోట్లో నీళ్ళు ఊరాయి. ఏది ఏమైనా ఆ మంచి వాసన వచ్చే పదార్థం తినాలని దానికి కోరిక పెరిగి పోయింది. ఆ పక్కనే ఉన్న గిన్నెలో నీళ్ళు త్రాగి ఓ చెట్టు మీద ఎక్కి పర్ణశాలలోకి  తొంగి చూడసాగింది.
          లోపల ఒక మునీశ్వరుడు ఆంజనేయుడికి పూజ చేస్తూ కనిపించాడు.దేవుడికి వండిన ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టిన తరువాత వేడిగా ఉన్న పులుసు గిన్నెను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని మంత్రాలు జపించసాగాడు.అది గమనించిన హను చప్పున కొమ్మమీదనుండి దూకి నేరుగా దేవుడి దగ్గరున్న గిన్నెలో మూతి పెట్టింది.అంతే ఆ వేడికి దాని మూతి కాలి ఎర్రగా అయిపోయింది! బాధతో అది కీచు మని అరచింది.ఆ అరుపుకి ముని కళ్ళు తెరచి చూశాడు.ఆ చూపుకి అది భయపడి మనికి చేతులు జోడించి క్షమించమన్నట్లుగా నమస్కారం పెట్టింది.
          దాని స్థితి చూసి మునికి కోపం పోయి జాలి ఏర్పడింది.సాక్షాత్తు ఆ హనుమంతుడే వచ్చి ప్రసాదం స్వీకరించాడనే భావన ఆయనకు కలిగింది.
       దివ్య దృష్టితో దాని ఆకలి పరిస్థితి కూడా గమనించాడు.వెంటనే చిరునవ్వుతో దాని తాను వండిన మరికొన్ని పదార్థాలు పెట్టి హనుతో ఈ విధంగా చెప్పాడు.
        "హనూ, నేను నైవేద్యం పెట్టిన పదార్థాలు తిన్నావు,వాటి వేడికి నీ మూతి ఎర్రనైంది అందుకే నీకు ఓ వరం ఇస్తున్నాను.ఇక మీ కోతి జాతికి ఎర్రని మూతి ఉంటుంది.మీరు ఏ గుడికి వెళ్ళినా భక్తులు మీకు పండ్లు, ప్రసాదాలు పెడతారు.ఎవ్వరూ మిమ్మల్ని విసిగించుకోరు.త్వరలోనే కరువు తీరి పోతుంది వర్షాలు కురుస్తాయి, నేను పూజలో ఉన్నప్పుడు ప్రసాదం తిన్నావు కాబట్టి, దానికి శిక్షగా మీరు కొన్నిసార్లు పదార్థాలు దొంగతనం చేసి తినవలసి వస్తుంది,అప్పడు జనం మిమ్మల్ని తరిమి కొడతారు,తప్పదు"అని చెప్పాడు మునీశ్వరుడు.
       అదిగో అప్పటినుండే కోతుల మూతులు ఎర్రగా అయిపోయాయి!దేవాలయాల దగ్గర కోతులకు భక్తులు కొబ్బరి చిప్పలు,అరటి పండ్లు మొదలైనవి పెట్టడం జరుగుతోంది.మనుషులు ఏమారుగా ఉంటే  కోతులు తిండి పదార్థాలు ఎత్తుకపోవటం జరుగుతోంది!వాటిని మనుషులు తరుముతారు!
         ఇదండీ కోతుల ఎర్రమూతి కథ!
                      **********
సామవేదంలో సంగీతాన్ని గురించి ఉంది.ఈ వేదంనుండే సంగీత జ్ఞానం లభించిందని చెబుతారు
                     ***********

        
కామెంట్‌లు