కలుపు మొక్కలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   అమరావతి రాజు చైతన్యవర్మకి వివేకవర్మ,శూరవర్మ అనే  ఇద్దరు కుమారులు.ఇద్దరికీ చదువుకునే వయస్సువచ్చాక రాజుగారు నల్లమల అడవిలో ఉన్న అనంతానంద మహర్షి గురుకులంలో విద్యాబుద్ధులు కొరకు ఆయన వద్ద చేర్చాడు.
       వివేకవర్మ గురువు చెప్పిన విద్యలను సక్రమంగా నేర్చుకుంటూ గరువుకు ప్రీతి పాత్రుడయ్యాడు.శూర వర్మ మటుకు విద్య మీద సక్రమంగా మనసు పెట్టేవాడుకాదు.అతనిలో క్రమ శిక్షణ లోపించింది! 
        "ఎందుకు నాయనా నీవు నేను నీర్పే విద్యలలో ఆసక్తి కనబరచడంలేదు?ఏమిటి నీ సమస్య?"అడిగాడు గురువు అనంతానంద.
       "గురువు గారు మీరు చెప్పినవి నాకు తెలుసు,సులభంగా అర్థం చేసుకోగలను,తెలివిగా బ్రతకగలను"అని కొంత గర్వంతో చెప్పాడు.
        "అయితే నిన్న నేను చెప్పిన భారతంలోని రాజనీతిని గురించి వివరించు"
         శూరవర్మ శ్రద్దగా గురువు చెప్పినది వినకపోవడం వలన జవాబు చెప్పలేక పోయాడు.
అదే ప్రశ్నను వివేకవర్మను అడిగాడు.వివేకవర్మ చక్కగా భారతంలోని రాజనీతిని వివరించాడు.
       "చూశావా,క్రమశిక్షణతో విద్య నేర్చుకుంటే సులభంగా మెదడులోకి చేరుతుంది,విద్య మరింత రాణిస్తుంది.అందరికీ ఆ విద్యతో మేలు చేసిన వాడివి అవుతావు"చెప్పాడు అనంతానంద మహర్షి.
     అయినా మరింత వివరంగా చెప్పి శూరవర్మ గర్వం తొలగించాలనుకున్నాడు అనంతానందుడు.
       రెండవరోజు శిష్యులందరినీ తీసుకుని అనంతానంద మహర్షి ఒక పొలం వద్దకు తీసుక వెళ్ళాడు.
       అక్కడ పొలంలో పనివారు కలుపు మొక్కలను పీకి వేసి వరి నాట్లు వరుసగా నాటుతున్నారు.ఆ దృశ్యం శిష్యులందరికీ ముఖ్యంగా శూరవర్మకి చూపించి ఈ విధంగా చెప్పాడు.
         "శిష్యులారా వరినాట్లు వరుసగా పాతుతున్నారు,అవి ఎదిగాక ఒక పద్దతిలో ఎరువు వేస్తారు,నీళ్ళు పెడతారు.మరి ఆ పంట చేతికొచ్చి ఎందరో ఆకలి తీరుస్తుంది.అదే ఇష్టంవచ్చినట్టు కలుపు మొక్కలు పెరుగుతాయి,అవికూడా ఆకుపచ్చగా ఉన్నా వాటి ప్రయోజనం శూన్యం,అందుకే వాటిని పీకి వేస్తున్నారు.ఆ విధంగానే శ్రద్ద,క్రమశిక్షణ ఉంటే మీరు నేను చెప్పే విద్య సక్రమంగా నేర్చుకోగలుగుతారు.భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడతారు"అని వివరించాడు.
         గురువు చెప్పిన విషయం శూరవర్మకు బోధ పడింది.తనుకూడా క్రమశిక్షణతో,గర్వం లేకుండా విద్య నేర్చుకుంటే తన భవిష్యత్తు బాగుంటుందని తెలుసుకుని గురువు గారికి పాదాభివందనం చేశాడు.
                    

కామెంట్‌లు