"నీరు- వనరు":(-సైన్స్ కధ)-ఎం బిందుమాధవి

 పొద్దుటినించీ జోరున వర్షం. "పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకి వచ్చిన చుట్టం వదలరని ఒక మొరటు సామెత చెబుతారు" అనుకుంటూ "ఆఫీసుకి బయలుదేరేటప్పటికయినా తగ్గితే బాగుండు" అనుకుంటూ గబ గబా వంట ముగించి తయారయ్యే పనిలో పడింది శశి.
"అమ్మా వర్షాన్ని తిట్టుకోకూడదమ్మా! అసలే తాగే నీరు లేక ఎడారి దేశాలు ఎంత బాధ పడుతున్నాయో తెలుసా! జీవ నదులు, సెలయేళ్ళు, చెరువులు ఉండి వర్షాలతో ఎప్పటికప్పుడు భూగర్భ జలం వృద్ధి అవుతున్న మనకెలా తెలుస్తుంది" అన్నాడు భరత్.
"అబ్బో పెద్ద చెప్పొచ్చావ్ లేరా! ఇబ్బంది కలిగినప్పుడు అనుకోమా! ఏంటి సంగతి ఇవ్వాళ్ళ పొద్దున్నే నీటి గురించి లెక్చర్ ఇస్తున్నావ్" అన్నది శశి.
"ఇవ్వాళ్ళ నీటి వనరుల గురించి కాలేజిలో వక్తృత్వ పోటీ ఉంది. దానికోసం తయారవుతున్నా" అన్నాడు.
* * * *
ఆ రోజు వక్తృత్వ పోటీలో మొదటి అభ్యర్ధి భరతే!
వేదిక మీదికి వస్తూనే....
"భూమి మీద జీవజాలం పుట్టటానికి, పెరగటానికి, బ్రతకటానికి నీరే ఆధారం. భూమి మీద మూడొంతులు నీరుందని మనకందరికీ తెలుసు. మళ్ళీ ఆ నీటిలో97% ఉప్పు నీరే! 3% మాత్రమే తాగటానికి ఉపయోగపడే మంచి నీరు."
"భారత దేశంలో నీరు జీవ నదులు, ద్వీపకల్ప నదులు గా విభజించ వచ్చు. జీవ నదులు హిమాలయ పర్వతాల్లోని హిమనీ నదాల నించి పుట్టినవి. ఇవి సంవత్సరమంతా ప్రవహిస్తునే ఉంటాయి. ఎండిపోవటం జరగదు. అందు చేతనే వీటిని జీవనదులంటారు. ద్వీపకల్ప నదులకి ఉదాహరణగా ఎత్తైన పీఠ భూముల నించి క్రిందికి ప్రవహించే గంగ, బ్రహ్మ పుత్రలని చెప్పుకోవచ్చు."
"భగీరథి, అలకనందల కలయిక వల్ల గంగానది ఏర్పడింది. బ్రహ్మపుత్ర మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలో పుడుతుంది."
"ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పువైపుకు ప్రవహిస్తున్నాయి. ద్వీపకల్పంలోని నదులలో మహానది, గోదావరి, కృష్ణా కావేరి ముఖ్యమైనవి."
"మంచి నీరు హిమనీ నదాలు, ఐస్ క్యాప్స్, భూగర్భ జలాల నించి దొరుకుతుంది. సెలయేళ్ళు, సరస్సులు, నదులు, చిత్తడి నేలల నించి కూడా మంచి నీరు దొరుకుతుంది. నీరు తేమగాలిలో కూడా దొరుకుతుంది"
"భూగర్భ జలాలు ఇప్పుడు బాగా తగ్గిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా వానలు పడి, ఆ వాన నీరు భూమి లోకి ఇంకితేనే  మళ్ళీ భూగర్భ జలం పెరుగుతుంది. అడవులు కొట్టెయ్యటం, కాంక్రీట్ భవనాలు ఎక్కువగా పెరగటం వల్ల భూమి లోకి నీరు ఎక్కువగా ఇంకటంలేదుట."
"అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు "వాటర్ షెడ్స్", గురించి ప్రచారం చేస్తున్నాయి. గృహ నిర్మాణ అనుమతులు ఇచ్చేటప్పుడు వాన నీరు భూమిలోకి ప్రవహింపజేసే ఇంకుడు గుంతలు తప్పనిసరి అనే నిబంధనలు పెడుతున్నాయి."
"నీరు పల్లానికి ప్రవహిస్తుంది కాబట్టి,  పూర్వపు రాజులు పల్లపు ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులు తవ్వించి నీటిని నిలవ చేసేవారు. తరచు ఆ చెరువుల్లో పూడికలు తీయించి నీటి నిలవ సామర్ధ్యాన్ని పెంచేవారు. చెరువులకి  కరకట్టలు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం అవకుండా కాపాడేవారు."
"ఇప్పుడు పట్టణీకరణ పెరిగి జనాభా గ్రామాల నించి నగరాలకి ఎక్కువగా వలస వెళుతున్నారు. వారందరికీ నివాస సముదాయాలు సమకూర్చటం కోసం నగరాల్లో చెరువులు పూడ్చి, పొలాలు లే ఔట్లు చేసి పెద్ద పెద్ద నివాస గృహాల కాలనీలు కడుతున్నారు. చెరువులు ఎప్పుడు తగ్గిపోతాయో అప్పుడు భవిష్యత్తరాలకి నీటి కొరత ఏర్పడుతుందన్నమాట".
"భూ గర్భ జలాలు తగ్గిపోవటం ఒక సమస్య అయితే, ఉన్న మంచి నీరు కలుషితమవటం ఇంకొక సమస్య. ఇలా కలుషితమవటానికి కారణం నగరాల్లో ఫ్యాక్టరీలు తమ పారిశ్రామిక వ్యర్ధాలని చెరువుల్లోకి, కాలవల్లోకి వదలటం. నగరాల్లో ఇలాంటి తప్పు చేస్తుంటే గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు పెంచటం అనే తప్పు చేస్తున్నారు!"
"సాధారణంగా చేపలు, రొయ్యలు సముద్రపు కయ్యల్లో పెంచుతారు. ఇప్పుడు వ్యవసాయం  వ్యాపారమయ్యాక సంప్రదాయ వ్యవసాయం చేసే వారు కూడా ఎక్కువ ఆదాయాన్నిచ్చే రొయ్యల చెరువుల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో నీటితో పాటు పర్యావరణము, భూమికూడా శాశ్వతంగా కలుషితమౌతున్నాయి."
* * * *
"నీరు వ్యవసాయానికి, కర్మాగారాలకి, నిర్మాణ రంగానికి, గృహ అవసరాలకి చాలా చాలా ముఖ్యం. ఉన్న నీటి వనరుల్లో 70%  వ్యవసాయానికి అవసరమవుతుంది. జనాభా పెరుగుదల ఎక్కువైన కొద్దీ ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఒక వైపు, తాగు నీరు-గృహ అవసరాలకి మరో వైపు నీటి అవసరాలు పెరుగుతున్నాయి. నగరీకరణ పెరిగే కొద్దీ ఆధునిక నీటి వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. అదే నగరీకరణ, నివాసాల కోసం చెరువులు కుంచించుకుపోవటానికి కారణమౌతూ, రెండు రకాలుగా నీటి కష్టాన్ని, నష్టాన్ని కలుగ చేస్తున్నది."
"ఎడారి దేశాల్లో నదులు, జలాశయాలు లేక సముద్రపు నీరు "డి శాలినేట్" చేసి పంటలు పండించటానికి, తాగు నీటి అవసరాలకి వాడుతున్నారు. కానీ అది చాలా ఖరీదైన ప్రక్రియ. గృహ వాడకాల నీటిని కూడా శానిటరీ నీరు, ఇతర వాడకం నీరుగా విడకొట్టి వాటిని రీసైకిల్ చేస్తున్నారు."
"ఈ నేపధ్యంలో  ఇజ్రాయిల్ దేశంలో పాటించే "బిందు సేద్యం" గురించి క్లుప్తంగా కొంత మాట్లాడుకుందాము. ఇజ్రాయిల్ దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. వర్ష పాతం కూడా దేశం అంతా ఒకే రకంగా ఉండకపోవటంతో, లభ్యమయ్యే నీటిని పొదుపుగా వాడటం కోసం వారు బిందు సేద్యం ద్వారా పంటలు పండిస్తారు. ఇప్పుడిప్పుడు మన దేశంలో కూడా కొన్ని పంటలకి బిందు సేద్యం అవలంబిస్తున్నారు."
"ఇటీవల కాలంలో  తోటల పెంపకంలో ఆసక్తి కలవారు నగరాల్లో మిద్దె వ్యవసాయం చేస్తున్నారు. ఈ రకమైన తోటలకి బిందు సేద్య విధానాన్నే అవలంబిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తక్కువ నీటి వినియోగంతో  "హైడ్రోపోనిక్" తోటలు అని పెంచుతున్నారు."
"ఇలా ఒకప్పుడు అవధిలేని సహజ వనరుగా భావించిన నీటికి, ఇప్పుడు కొరత ఏర్పడే సరికి కొత్త కొత్త పద్ధతుల ద్వారా నీటిని నిల్వ చెయ్యటం, పొదుపుగా వాడటం, పునరుత్పాదన (భూ గర్భ జలం రిచార్జ్ ) చెయ్యటం అని వివిధ పద్ధతులని అనుసరిస్తున్నారు."
"మనిషి ఆహారం లేకుండా అయినా బ్రతకగలడు కానీ, నీరు లేకుండా బ్రతకటం కష్టం! సమృద్ధిగా ఉన్నప్పుడు వనరులని విచ్చలవిడిగా వాడేసి, తరువాత ఎన్ని జాగ్రత్తలుపడినా జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేము కాబట్టి అందరం పూనుకుని సహజ వనరులని కాపాడుకోవాలి. ముఖ్యంగా యువతరం ఇది మన బాధ్యతగా భావించాలి " అని ముగించాడు భరత్.

కామెంట్‌లు