అనంతం ...!! > మనోహర్ పంత్ >భీమారం (హన్మకొండ )*

 ఆదివారం , సాయంత్రం , సుబ్బారావు,  భార్యతో , ఫ్రెండ్,  అప్పారావు ఇంటికి 
వెళ్ళాడు.  మాట, మంతి , కాఫీ  వగైరా 
అయ్యాయి.  సుబ్బారావు,  "వెళ్ళొస్తాన్రా "
అని లేచాడు . అప్పారావు,  అతనిని గుమ్మం దాక పంపి , తన బెడ్ రూమ్ లోకి 
వెళ్ళాడు.  సుబ్బారావు భార్య కుడా,  "వెళ్ళొస్తాను, వదిన" , అంటే,  "మంచిద"ని
వీధి గేటు దాకా వెళ్ళింది,  అప్పారావు భార్య .
గేట్ దగ్గర ---
"వెళ్ళొస్తాను వదిన , మీరు మా ఇంటికి రావాలి ", అన్నది సుబ్బారావు భార్య.
అప్పారావుభార్య,  అన్నది " ఎందుకు రాను , ఈయన 
తీసుకొని రావాలి కదా, ఎక్కడికి ఒక పట్టాన కదలరు . అన్నట్లు, మీ వాడికి 
సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా?"
"ఏది మొన్ననేగా ఉద్యోగంలో చేరింది .
కొంతకాలం ఆగమంటున్నాడు ."
"అలాటిది ఏమన్నా ఉంటే,  మా అమ్మాయిని కుడా కొంచెం దృష్టిలో ఉంచుకోండి ".
"అంతకన్నానా , పద్మకేం కుందనపు బొమ్మ 
ఎవరైనా కళ్ళకద్దుకొని మరీచేసు కుంటారు ". 
"ఆ ..అందముంటే చాలా, ఎంతెంత కట్నాలు
పోయాలి" .
" మీరు అలాగే అంటారు . ఉన్నది ఒక్క పిల్ల 
ఐనా మీకేం తక్కువని?వస్తాను ."
"తక్కువ అంటే,  అందరు మీలాగే ఉండద్దు
మరి ఉంటా , అన్నట్లు మీ అమ్మాయిని
పురిటి ఎప్పుడు తీసుకొస్తున్నారు?"
"తీసుకురావాలి . ఈయనకు ఏది పట్టదు .
అన్ని నేనే చూసుకోవాలని.  వాళ్ళ అత్తగారు , తనకు చాకిరి తప్పుతుందని 
తీసుకెళ్లామని ఫోన్ల మీద ఫోన్లు. వస్తాను 
అన్నట్లు అత్తగారంటే గుర్తొచ్చింది, మీ 
అత్తగారు లేరా, కనిపించాలా ?"
"ఆవిడ మా మీద అలిగి,  కూతురి దగ్గరకు 
వెళ్ళింది.  కూర్చిపెట్టి వేళకు అన్ని చేసిన 
సణుగుడే . అక్కడ కూతురు అన్ని పన్లు 
చేయించుకుంటుంది "  "వుంటాను ".
"మంచిది, ఆలస్యం అయితే,  ఆయన 
గోల చేస్తారు. "
అలా అనకు వదిన , అన్నయ్య చాలా నయం . లోపల మీ అన్నయ్యని చూడాలి 
అన్ని క్షణాలమీద జరగాలి . లేదంటే ,
చిందులు, శివాలు . వుంటాను . అన్నట్లు 
మొన్న గాజులు మార్చి, కొత్తవి చేయించుకోవాలన్నావు .ఏమైంది ?"
"ఎక్కడ వదిన, పైన ఇంకొంచెం వేస్తె గాని 
రాదన్నాడు దుకాణంలో . మీ అన్నయ్యకి 
చెపితే , అదో తల నొప్పి.  ఇప్పుడు ఎందుకని గోల చేస్తారు . వస్తాను .అవును 
నీ కాళ్లు వాస్తున్నాయని అన్నావ్?  డాక్టర్ 
దగ్గరకు వెళ్ళావా ?"
సంభాషణ అలా ..జీడిపాకంలా సాగుతూనేవుంది .
ఈవిడ లొపలికివెళ్ళదు,ఆవిడను బయటకు పోనివ్వదు! అదిఅంతే ,అనంతం.తిరుగు లేదు!!
                           ***
కామెంట్‌లు