మాఊరుకి మంగొల్లుకీ మధ్యన ఏనెరాళ్ళగుట్ట లుండేవి మాచేలు ఆఏనెలకు దగ్గర్లోనే వుండేవి చేన్లకు ఏనెలకు మధ్య ఎకరాల కొద్ది బీడుభూమి ఉండేది దాన్నిండా కాలుబెట్ట సందు లేనంత కామంచి దుబ్బులుండేవి దుబ్బుల్లో లెక్కలేనన్ని బురకపిట్టలుండేవి
మా ఊరి ఎరుకలి పొట్టయ్య రోజూ ఓ ఆవును ఎంట బెట్టుకొని తెల్లారిపాటికి ఏనెల బీటికి చేరుకునేది తను ముందుగా ఓ దుబ్బు దగ్గరికి మెల్లగా ఆవునుతోలేవాడు దుబ్బులోని బురకపిట్టలు ఆవునుచూసి ఆవేకదా అన్నట్టు నిర్భయంగా ఉండిపోయేవి
దాన్ని అవకాశంగా చేసుకున్న అతను ఆవును అడ్డం బెట్టుకుని నిశ్శబ్దంగా దుబ్బు పైన వలను కప్పుకొచ్చి ఆవును పక్కకు తోలేవాడు
ఆవు పక్కకు పోగానే దుబ్బులో వున్న పిట్టలకు విషయంఅర్ధమై భయంతో బుర్రున ఎగిరి వలలో తగులుకునేవి
పొట్టయ్య వాటిని నింపాదిగా పట్టుకొని కాళ్ళు కట్టేసి బుట్టలో వేసుకుంటూ వేటసాగించేవాడు వాటిని ఊళ్ళో తిరిగి అమ్ము కుంటూ పొట్టకు బట్టకు అన్నట్టు కుటుంబజీవనం లాగించేవాడు
కాలం కర్కశమైందన్న వాస్తవం తుర్పు దిక్కున పొద్దుపొడుపు అంత యదార్ధం కదా! మనిషి స్వార్ధానికి ఏనెరాళ్ళ గుట్టలన్నీ ఖండ ఖండాలై స్టోన్ పాలిషింగ్ ప్యాక్టరీల్లో తళతళ్ళాడే అద్దాల పలకలై గొప్ప గొప్ప భవంతుల్లో ధనవంతుల హోదాకు చిహ్నాలుగా నిల్చిపోతున్నాయి
ఏనెలు లేని ఆ ప్రాంతమిప్పుడు ఎడారిని తలపిస్తూ భీతి గొల్పు తుంది
కామంచి దుబ్బుల బీళ్ళన్నీ స్టోన్ పాలిషింగ్ యూనిట్ల వ్యర్ధాలతో చౌడుదిబ్బల మాదిరి తయారయ్యాయి
అటు ఏనెలు ఇటు బీళ్ళూ చూస్తుండగానే కనుమరుగై పోతుండడంతో వాటిని ఆధారంగా చేసుకుని బతుకు బండిని నెట్టుకొస్తున్న పొట్టయ్య లాంటి ఎంతోమంది పేదవాళ్ళు
తమ జీవన శైలుల్నిమార్చుకుని అక్కడే పాలిషింగ్ యూనిట్లలో కూలీలుగా మారిపోయి దుమ్ము ధూళి తింటూ ఉనికిని కోల్పోతున్న బురక పిట్టల్లా బతుకులు ఎల్లమారుస్తున్నారు
వ్యాపారమా! నీకు జోహార్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి