దూడబాతులు ..!!> శీరంశెట్టి కాంతారావు పాల్వంచ *

 మా దోస్త్ లమంతా పొద్దున్నే లేచి కడుపు బరువులు దించుకోడానిక
చెరువు బాయి పక్క నుండి యాదవుల చొప్పదొడ్లు దాటి
 బాపనోరి మల్లెతోట మీదుగా ఎర్రకాలువ ఒడ్డునున్న తుప్పల్లోకి పొయ్యేవాళ్ళం అప్పుడప్పుడూ ఎవరి పశువును,ఎవరు,తీసుకొచ్చి అక్కడ కోసి చర్మం వల్చుకు పోయేవారో మాకస్సలు అర్థమయ్యేదిగాదు 
మేం మాత్రం భయపడిపోయే దృశ్యాన్ని  బిక్కుబిక్కున గుండెలు బిగబట్టుకుని చూసే వాళ్ళం
అక్కడ పడివున్న దట్టెం మీద
పదుల సంఖ్యలో దూడ బాతులు (రాబందులు) వాలి సూది మొనల్లాంటే ముక్కుల్తో
పాములంత పొడవున కండలు కండలు చీల్చుకుని చిత్రంగా మింగేసేవి  
ఒక్కపూటలో ఏవో రసాయనాల్తో కడిగేసినట్టు ఒక్క పిసరంత మాంసం కూడా లేకుండా తెల్లటి కంకాళం కుప్ప మిగిలిపోయేది
మాంసఖండలాలను చీల్చేటప్పుడు వాటి రౌద్రం చూస్తుంటే మాకు ఠారెత్తి పోయేది
ఒక్కొక్కటి ఆవుదూడంత ఎత్తున దట్టెం చుట్టూ తిర్గుతూ 
అసలే నల్లటి కనుగుడ్లను మరింత నలుపు చేసి గిర్రు గిర్రున తిప్పుతూ పోటీలు పడి కండలు చీల్చుతూ మా వంట్లో నెత్తురు చల్లబడిపోయేలా క్రేమ్ కారాలు చేసేవి
మేం దూరంగా కూర్చుని భయం భయంగానైనా సరే ఆదృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నంతలో మాతలల మీదుగా ఏదో చిన్నపాటి విమానం ఒకటి 
చడీ చప్పుడు లేకుండా నేలకు దిగుతున్నంత భీభత్సమైన
గాలి శబ్దం విన్పిండంతో మేం భయంతో మరింత నేలకు వంగే వాళ్ళం
నిజంగా రాబందుల వీరత్వం చూడడమనేది ఓ భయద సౌందర్యాన్ని జీవితకాల జ్ఞాపకంగా మనోఫలకం మీద చిత్రించు కోవడంలాంటిదే నని నాకిప్పుడన్పిస్తుంది
ప్రకృతిలో పల్లెల పరిసరాలను పైసా ఖర్చులేకుండా సహజసిద్ధంగా శుభ్రపర్చే పారిశుద్ద్య కార్మికులు రాబందులు
కానీ, మేధావియైన మానవుడు వాటి అసలువిలువను గర్తించక రాబందులంటే  క్రౌర్యానికి పరాకాష్టగా చిత్రించడం వాటిపట్ల బాధ్యతా రాహిత్య ప్రకటనే అవుతుంది
పాలిచ్చే జంతువుల పొదుగుల్లోని పాలన్నీ పిదుక్కోడానికి ఇంజక్షన్లు పొడిచి పొడిచి పాడిపశుల సహజ ధర్మాలను కబళిస్తున్న మనుషులదే అసలు సిసలు క్రౌర్యం కాదా!? పశుకళేబరాలను తిన్న రాబందుల మనుగడే ప్రశ్నార్ధకమైపోయింది
అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని స్వాగతిస్తున్న ఆధునిక మేధావులారా! మనలాగే భూమ్మీద స్వేచ్ఛగా బతకాల్సిన రాబందులు దాదాపుగా కనుమరుగై పోవడాన్ని ఎలా సర్ధిస్తారో సమర్ధించండి మరి!
బతుకు బతకనివ్వు సూత్రమే మానవజాతి పాలిటి ప్రపంచగీతం కావాలని మీరంతా భావిస్తారని ఆశిస్తూ..
                          ***
కామెంట్‌లు