ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చానా అల్లరిది. అందరినీ ఆట పట్టించి నవ్వుకునేది. ఒకసారి అది అడవిలో పోతావుంటే దానికి ఒక బండపై ఒక చిన్న బల్లి కనిపించింది. అది అడుగులో అడుగు వేసుకుంటా నెమ్మదిగా పాకుతూవుంది.
అది చూసి నక్క ఒసే బల్లీ ... ఇలా నెమ్మదిగా పోతే ఎలా ... నన్ను చూడు ఎంత వేగంగా సరసరసర మెరుపులెక్క కాదులుతానా. నాలా నువ్వు కదాలాలంటే ఎప్పటికీ కుదరదేమో అంటూ నవ్వింది.
బల్లి నవ్వి ఏమోలే మామా ... ఎవరి గొప్ప వాళ్లకు వుంటాది. నీ అంత వేగం నాకు లేదులే అంది.
ఆ మాటలకు నక్క ఏమే ... ఎవరిగొప్ప వాళ్లకు వుంటాది అని ఎగతాలిగా అంటా వున్నావు. ఏమిటే నీ గొప్ప. ఏసి కాలితో ఒక్క తన్ను తాన్నినానంటే ఎగిరి ఏడు మైళ్ళ దూరం పడతావు అనింది. దానికి బల్లి ఏమీ పలకలేదు.అప్పుడు నక్క అదీ ... అలారా దారికి. నీకు ఏదీ చేతగాదు. తంతే తన్నులు తినాల. తిడితే మాటలు పడాల. అంతేగాని ఎదురు చెప్పగూడదు అంది.
ఆ మాటలకు బల్లికి చాలా కోపం వచ్చింది. మామా మాటలు ఎక్కువైతే ఆయాసం తప్ప ఏమీ మిగలదు. ఒకపని చేద్దాం. అదిగో దూరంగా అక్కడ ఒక కొండ కనబడుతుంది కదా ... ఇద్దరమూ పైకి పోదాం. ఆ కొండ అవతలి వైపు ఎవరు ముందు వేగంగా కిందకి దిగుతారో వాళ్ళే గెలిచినట్టు. సరేనా అంది. ఆ మాటలకు నక్క సరే అంది.
ఐతే పద పోదాం అంది బల్లి. నక్క నవ్వి ఒసేవ్ ... నీ నడక నాకు తెలీదా ఏంది. నువ్వు కొండ మీదకు వచ్చేసరికి వారం దాటుతుంది అంది. ఆ మాటలకు బల్లి చూడు మామా ... నేను ఎలా చేరుకుంటానో నీకు ఎందుకు. నీవు పోయేసరికి నేను రాకపోతే నీవే గెలిచినట్టు. సరేనా అంది. నక్క సరే అని పాటలు పాడుకుంటా ... కులుక్కుంటా ... నెమ్మదిగా కొండ ఎక్కసాగింది.
బల్లి పక్కనే చెట్టుమీద వున్న ఒక రామచిలుకతో బావా... బావా... కొంచం నన్ను ఆ కొండమీద దించవా. ఇక్కడికి దగ్గరలో ఎవరికీ తెలియని చోట ఒక కమ్మని మామిడి పళ్ల చెట్టు వుంది. నిండుగా కాయలు విరగకాశాయి. తియ్యగా ఘుమ ఘుమలాడుతున్నాయి. అది ఎక్కడుందో నీకు చెబుతా అంది. రామచిలుకకు నోరూరింది. సరేనని బల్లిని వీపుమీద ఎక్కించుకొని సర్రున గాల్లోకి ఎగిరింది. నక్క కన్నా ముందే పైన విడిచిపెట్టి ఆ చెట్టు ఎక్కడుందో కనుక్కొంది. నక్కకు బల్లికి పందెం సంగతి తెలిసి అడవిలోని చాలా జంతువులు ఇదేదో సరదాగా వుందే. చూద్దాం ఎవరు ఓడిపోతారో అనుకుంటా అవి కూడా పైకి వచ్చాయి.
నక్క నెమ్మదిగా వూగులాడుకుంటా పైకి వచ్చేసరికి బల్లి కిలకిలకిల నవ్వుతా కనబడింది. అది చూసి నక్క అదిరిపోయింది. నువ్వెలా వచ్చావే పైకి అని అడిగింది. చూడు మామా పైకి రావాలంటే కావాల్సింది తెలివే కానీ బలం కాదు. ఐనా ఇప్పుడు అనవసరంగా మాటలు ఎందుకు. దా పోటీకి అని పిలిచింది.
జంతువులన్నీ కొండ అవతలి వైపుకి పోయాయి. అక్కడ కొండ ఇటువైపులా ఏటవాలుగా లేదు. సక్కగా నిట్టనిలువుగా నున్నగా ఉంది. దా... మామా... దిగుదాం. ముందు ఎవరు దిగితే వాళ్ళు గెలిచినట్టు. సరేనా అంది బల్లి.
నక్క వంగి చూసింది. సర్రున కళ్ళు తిరిగాయి. భయంతో ఒళ్ళు వణికింది. అమ్మో... ఇదేంది. ఇంత చక్కగా వుంది. నువ్వంటే ఎలాంటి గోడలైనా చకచకచక ఎక్కేయగలదవు కానీ నేనలా కాదుగదా. పొరపాటున పట్టుతప్పి జారిపడితినా... అంతే... పచ్చడి పచ్చడి ఐపోతా అనుకుంటా వెనక్కి అడుగులు వేసింది.
అదిచూసి బల్లి నవ్వుతూ చూడు మామా... అందుకే అనింది ఎవరి గొప్ప వాళ్లకు వుంటాది అని. ఈ లోకంలో ఎవరూ గొప్పవాళ్ళు కాదు. ఎవరూ తక్కువోళ్ళు కాదు. సూది చేసే పని గడ్డపార చేయలేదు. గడ్డపార చేసే పని సూది చెయ్యలేదు. ఏమంటావు అంది.
జంతువులన్నీ భలే సమాధానం చెప్పావు. పొగరు తగ్గేలా అంటూ నవ్వేశాయి
*ఎవరి గొప్ప వారిదే (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ)* - డా.ఎం.హరికిషన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి