నేటి మన కొత్త వందరూపాయల నోటుని గమనించారా?దానిపై నీటిబావి బొమ్మ ఉంది. రాణీ కా వావ్ అనే ఈ నీటిబావి గుజరాత్ లోని పఠాన్ జిల్లా లో ఉంది. సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ ఒకటి స్మృతి చిహ్నం గా1050-1100మధ్య సరస్వతి నది ఒడ్డున నిర్మించింది. ఏడు అంతస్తుల ఈ బావి పొడవు 213అడుగులు .వెడల్పు 66అడుగులు లోతు 92అడుగులు. దీన్ని భూమి లోపల అండర్ గ్రౌండ్ లో ఏడు అంతస్తులుగా కట్టారు. భూమి లోపలకి తవ్వుతూ ఆనాటి వారు కట్టారు అంటే వారి శ్రమ టెక్నాలజీ ఎంత గొప్పదో మనం ఊహించలేం. 215స్తంభాలు 800శిల్పాలపై కధలు చెక్కటం ఇంకో అద్భుతం. దశావతారాలు పురాణ గాథలు చెక్కిన ఆ శిల్పుల కష్టం మన ఊహకి అందనిది.ఆబావిలోకి మనం దిగుతున్నకొద్దీ చల్లగా ఉంటుంది. ఏడు అంతస్తుల ఈ
దిగుడుబావి లోకి దిగాక నీరు కనపడుతుంది. ఆరోజుల్లో బావి దగ్గర ఓషధీమొక్కలు పెంచారు. బావి దగ్గర ఒక మూయబడిన తలుపు ఉంది. శత్రువు దాడిచేస్తే ఆ తలుపు లోంచి 30కి.మీ.సొరంగం లోకి ప్రవేశిస్తాము.అది సిద్దాపూర్ అనే పట్టణం లో కి దారి తీస్తుంది. సరస్వతీ నదికి వచ్చిన వరదల్లో ఈబావి ఇసుక లో కూరుకుపోయింది. 1980లోఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కృషితో ఇది బైట పడింది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద గా ప్రకటించింది. 2018లో రిజర్వ్ బాంక్ వందరూపాయల నోటు పై దీన్ని ముద్రించి ఆబావి చరిత్ర మనం తెలుసుకునేలా చేసింది.నాదృష్టిలో తాజ్మహల్ కన్నా ఈ దిగుడుబావి మిన్న.! ఇలా భూస్థాపితం కాబడిన చారిత్రక ఆధారాలతో ఉన్న వాటిని గూర్చి తెలుసు కోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి