బట్రాజుల హవా ..!! >శీరంశెట్టి కాంతారావు.-రచయత..> పాల్వంచ*

 మా ఊరు గుట్టమీద' రామాలయం 'చుట్టుపక్కల పదూర్లకు పేరెల్లింది
ఏటా కామునిపున్నమినాటి రాత్రి కళ్యాణం జరిగితే
మరునాటినుండి తొమ్మిది రోజులు తిరునాళ్ళ జరిగేది
గుట్టకు కుడిచేతి దిక్కు 
ఏ రాజులు, ఏ జమీందార్లు ఇచ్చారోగానీ దేవునికి సేవజేసేటందుకుగాను 
మా ఊరు భట్రాజులకు పెద్ద చెరువుకింద మాన్యాలుండేవి
నడిఊళ్ళో చిన్నకోయిల వెనుక భట్రాజుల బజారే వుండేది
పండుగ పండుగకు దేవుని శావ
తీసేటప్పుడు అర్చకులకన్నా భట్రాజులదే అసలుపని
గరుడవాహనమో, గజవాహనమో  వాహనం ఏదైనా సేవకు ముందురోజు భట్రాజులు పీతాంబరంతో వాటిని నిగనిగ మెరిసేటట్టు తోమిపెట్టి వచ్చేది
రైతు భూమిని దున్నేముందు  నాగలికి పన్నుగడ వేసినట్టు
ఊరేగింపుకు ముందు ఉత్సవ విగ్రహాలను శావలమీద కూర్చుండజేసి కదలకుండా జనపనార పగ్గాల్తో గొప్ప పని తనంగా ఉచ్చుముళ్ళువేసి కట్టేసే వాళ్ళు
గుడినుండి బైలెల్లిన శావ తిరిగి గుడికి వచ్చేదాకా అర్చకుని పక్కనే పదంలో పదం కలిపి నడిచే వాళ్ళు
ఉత్సవమూర్తులను ఎప్పటిలా ఎక్కడి వక్కడ సర్దిపెట్టి సంభావనలు తీసుకుని ఏ అర్ధరాత్రికో ఇండ్లకు చేరేవాళ్ళు
దేవునిపనికాకుండా
ఊళ్ళో రైతుల్ని ఇంటికింత మందని పంచుకునేవాళ్ళు
ఆ రైతుల ఇండ్లల్లో పిల్లలకు పెళ్ళి సంబంధాలు చూడాలంటే ఇంటోళ్ళకన్నా ముందు భట్రాజేవెళ్ళొచ్చి ఆ సంబంధం 
కాయ జేసుకోవాలో పండు జేసుకోవాలో నిర్ణయించేవాడు
పెళ్ళి తంతు ప్రతిసందర్భంలో నివాళిపట్టి భట్రాజేముందు నడిచేవాడు
ఖాళీసమయాల్లో ఇండ్ల అరుగుల మీద కూర్చుని 
వాళ్ళల్లో వాళ్ళు పురాణ చర్చలు జరిపేవారు
 ఏ ఇంట్లోనైనా జరిగే సుభాసుభాలకు సంభావనల కొచ్చేవాళ్ళు వెయ్యేల నాడు గ్రామజీవితంమొత్తం భట్రాజుల్తో
ముడిపడి వుండేది
నేడు ఊళ్ళో భట్రాజుల మాన్యాలన్న పేరే మిగిలింది తప్ప ఆ భూములన్నీ వేరేవాళ్ళ  పాలైపోయాయి
ఇప్పుడు భట్రాజుల బజారో 
హంపీ నగరమైపోయింది ఊళ్ళో నేడు మచ్చుక్కూడా ఒక్కభట్రాజుల కుటుంబం లేదు 
నిజంగా కాలమో నియంతకదా!

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
మీ జ్నాపకాలు నేటి తరానికి ఒక చరిత్ర.
మీరు చేస్తున్న కృషి గొప్పది.కొనసాగించండి.
అభినందనలు.
-------డాక్టర్ కె.ఎల్వీ ప్రసాద్
హన్మకొండ.
Shyam kumar చెప్పారు…
Dear sir simple and effective. Really the time is cruel.tq for good writeup