గుర్తుకొస్తున్నాయి -- మాపిన్ని :- సత్యవాణి , కాకినాడ

  మా పిన్ని పూళ్ళ సుందరమ్మ .మా కాంతారావు చిన్నాన్న భార్య.
       మా పిన్ని మాఇంట్లో కోడలుగా వచ్చేసరికి నాకు ఐదారేళ్ళు వుంటాయి.మాచిన్నాన్నా పిన్నిల పెళ్ళి తిరపతిలో జరిగింది.మా రౌతులపూడిలో  ముత్యాలపల్లకిలో చిన్నాన్నా పిన్నిల ఊరేగింపు జరిగినప్పుడు నేనుకూడా పల్లకీ ఎక్కి ఊరేగాను అనేది నాకుగల అందమైన,ఆనందదాయకమైన ఒక జ్ఞాపకం.
       మా పిన్ని  ఆల్చిప్పలాంటీ కళ్ళతో,ఎడమ పెదవి క్రింద కందిగింజంత నల్లని పుట్టుమచ్చతో,అచ్చంగా సినీతార వైజయంతీమాలలా వుండేది ఆకాలంలో.
      అమ్మ మడి వంటలో  సతమతమౌతూ వుంటే,పైపనితోపాటు ,మాపిల్లల పనులన్నీ పిన్నే చేసేది.
       మా ఆడపిల్లలకు రకరకాల జడలను, వేసిన జడ వేయకుండా వేసేది.అలాంటిజడలలో 'మనీఫర్సు' జడ,'ఈత పాయల జడ' మహబాగా వేసేది.అరచేయంత ముద్ద బంతిపూలతో'' ఒద్దు బాబోయ్ ''అంటున్నా వెంటబడి జడలుకుట్టేది.
       అలాగే తిలకంతో రకరకాల ఆకారాలతో బొట్లు పెట్టేది. ఇక్కడ మరో విషయం చెప్పాలి.
        తుమ్మ జిగురుకు తిలకంరంగును మారవణగారి కొట్లోంచి తెప్పించి,తిలకం తయారుచేసేది.తిలకం రంగు బాగా కుదిరిందో లేదో ,చిక్కతనం కుదిరిందో లేదో తెలియడానికి ప్రయోగ శాలలుగా మా మొఖాలను ఉపయోగించేది.పిల్లలెవరం దొరక్కపోయినా,పాపం మా పెద్దరాజా చెల్లెలు మాత్రం  పిన్నికి తన అందమైన,విశాల ఫాలభాగంగల తన మొఖాన్ని పిన్ని ప్రయోగాలకు అప్పచెప్సేసేది.కుత కుతమని ఉడుకుతున్న తిలకంలో 
చీపురుపుల్ల ముంచి,ఉఫ్ ఉఫ్ అని ఊది రాజా మొఖంమీద పొడవుగా నామం తీర్చండం,అబ్బే,రంగు ఎర్రగా లేదు అంటూ మరింత తిలకంపొడి కలపటం,అబ్బబ్బే ఇంకా చాలా పలచగావుంది ఇంకా చిక్కబడాలి అంటూ దానమొఖం తోమించి,కడిగించీ ఆ మొఖాన్ని ప్రయోగ శాలగా  వాడుకొనేది.
      అలా చాలాసేపు ప్రయోగంచేసి చేసి, తిలకం కుదరిందని నమ్మకం వచ్చేకా,దానిని ఈక్లూసాయలు సీసాలలో.గ్రైప్ వాటరు సీసాలలోపోసి ,అసీసాలకు తాడుకట్టి, అద్దాల దగ్గర మేకులు కొట్టి తగిలించేది.."కాస్త తిలకం ఎట్టండీ "అంటూ అడిగితే,అడిగినవాళ్ళతోపాటు అడగని వాళ్ళకూ తిలకం బుడ్డిలు ఇచ్చేది.
     మాఇంట్లో అద్దాల దగ్గరవున్న బొట్టూ ,కాటుక మచ్చలను చూస్తేచాలు ఆడపిల్లం ఎందరం వున్నామో వీజీగా చెప్పెయ్యవచ్చు.
     మాపిన్ని చేత బొట్లు పెట్టించుకొన్నవాళ్ళకు మటుకు నిత్యం కళ్యాణంబొట్టుతోపాటు,పేకాటలోవుండే గుర్తులన్నీ, అంటే, కళావరు,డైమండూ,ఆటీను వగైరాలు .అలా బొట్టు పెడుతూ నోటిలో నాలుక మడతేసి "ళ్ ళ్ ళ్ "అని తమాషాగా శబ్దం చేయడమే కాకుండా ,"కదలకు మెదలకు కంసాలీ!కదిలితే నీముక్కు చెక్కిస్తా!దూలంమీదనుంచి దూకిస్తా, పట్టెడన్నమూ తినిపస్తా "అంటూ పాటకూడా పాడేది.
     ఇంక మా పిన్నికి గోరింటాకు రుబ్బడమంటే మహా సరదా.అలాగే మా చేతులకు పెట్టడమంటే కూడా సరదాయే.గోరింటాకు ఎర్రగా పండాలంటే ,కవిరి,కాకిబొడ్డూ,ఏడుతాటాకిళ్ళవి తాటాకు చూరు ముక్కలూ చిన్న బిళ్ళ పెంకుముక్కా ఇలా తనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తెమ్మని మమ్మల్ని పరుగులు పెట్టించేది.రుబ్బేటప్పుడే తన రెండు చేతులు ఎర్రగా పండేలా చూసుకొనేది.
       "నడుం నీలుక్కు పోయేలా నువ్వు పెట్టడమేకానీ,పెట్టినంతసేపు వుంచరోవిడా!"అంటూ అంటూ అమ్మ హెచ్చరించినా,వినేదికాదు.రెండు చేతులకూ,కాళ్ళకీ కూడా పెట్టేది.మాకందరికీ మూతులకు మంచినీళ్ళ గ్లాసులు అందించడం,మా అవసరాలకు బొందులాగుల ముళ్ళు విప్పడం ,కట్టడం మొదలైన సేవలన్నీ ఇష్టంగా చేసేది.  
       
      పాటంటే గుర్తుకొచ్చింది. మాపిన్ని పాటలు చాలా బాగా పాడుతుంది.మల్లీశ్వరీ,విప్రనారాయణ,భువనసుందరి కథ అలా తన చిన్నతనంలో చూసిన పాత సినీమాలలోని పాటలు అద్బుతంగా పాడుతుంది ఇప్పటికీ.మల్లీశ్వరిలోని "మనసున మల్లెలు మాలూగెనే "పాట తన పేటెంట్ అని చెప్పాలి.అంతబాగా పాడుతుంది.
     మళ్ళీ పాటంటే గుర్తుకొచ్చింది మా చిన్నాన్న తనపెళ్ళి చూపులుకి ఆమెను చూసుకోడానికి వచ్చినప్పుడు ఏంపాట పాడిందిటో తెలుసునా?
     అంతకుముందురోజు రాత్రి చూసిన  'పాతాళభైరవి 'సినీమలోని
"ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ"అన్న పాట పాడిందట. ఆపాట విన్న ఆమె పెద్దాడబడుచు ,అంటే మా పెద్దత్తయ్య అంటే, ఆ తరువాతకాలంలో నా అత్తగారు, ఆమె అందంతో పాటు,అమాయకత్వానికీ ముగ్దురాలై  పెళ్ళి కుదిర్చించిదట.ఇప్పుడు కూడా ఈ  ఎనభైలు  దాటిన వయసులోకూడా "  మా పిన్నిని "పిన్నీ! మా చిన్నాన్న పెళ్ళిచూపులకు వచ్చినప్పుడు ఏపాట పాడేవు?"అని సరదాగా అడిగితే,ఇప్పుడుకూడా పెళ్ళికూతురులా సిగ్గుపడుతూ"ప్రేమకోసమై వలలో పడెనూ"అంటుంది.
      మళ్ళీ పిన్ని పాటంటే గుర్తుకొచ్చింది పిన్ని పెళ్ళైన సంవత్సరం శ్రావణమాసం నోము పేరంటానికి చిన్నకన్నయ్య ఇంట్లో అద్దెకున్న రెవెన్యూ ఇనస్పెక్టర్ గారింటికి పేరంటానికి వెళ్ళింది.అక్కడ వాళ్ళు వచ్చిన పేరంటాలనందరినీ  పాడమని అడిగితే, పిన్ని మంచిపాట పాడింది.పేరంటాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు మాపిన్నిని
     ఎలాతెలిసిందో ఏమో మా మామ్మైకి అదే మా బామ్మకి  పేరంటం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి కాళికావతారమెత్తింది."గానా బజానా చేసేవుటకదా సిగ్గులేకుండా "అని నిలతీసింది.అంతే పిన్ని ఆ ఆల్చిప్పలంత కళ్ళలోంచీ బొటబొటా కన్నీళ్ళు పెల్లుబికి ధారాపాతమయ్యాయి.
     అదిమొదలు మళ్ళీ మా మామ్మైయ్య పోయినా సరే ,ఈమధ్యకాలంవరకూ నోరిప్పి పాటపాడితే ఒట్టు.
ఇప్పుడిప్పుడు మేమంతా మా ఇళ్ళలో జరిగే శుభకార్యాలలో పిల్లలు జరిపే గానా భజానాలో మా పిన్ని పాటలు వుండి తీరవలసిందే అంటూ పట్టుపట్టి పాడిస్తున్నాము.ఇంత లేటు వయసులోకూడామా పిన్ని పాటలో లాలిత్యము చెడలేదు. మా మనససులు మల్లెలమాలలూగుతూనే వుంటాయి పాట విన్న చాలా సేపటి వరకూ.
        అలాగే మా పిన్నికి పద్యనాటకాలంటే మహా పిచ్చి.మా ఊరి 'ఉమా రామలింగేశ్వరుడి'  కళ్యాణానికి గుడిలో రికార్డింగ్ డాన్స్ లేకాకుండా, వివిద రకాలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.సినీమాలూ,నాటకాలూ అంటే మహా ఇష్షం మా పిన్ని సుందరికి.కానీ మా ఇంట్లో ఆకార్యక్రమాలకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు.
మా పిల్లలద్వారా నాన్నకీ,చిన్నాన్నకీ రికమండేషన్ పంపేది కానీ,నాన్న ముక్కుమీద వేలేసుకొనేవారు.చిన్నాన్న బుర్ర అడ్డంగా ఊపేవాడు.
       అందుకని పిన్ని  రాత్రి పనులన్నీ గబగబా ముగించుకొని ,పడమటి వైపు వసారాలో కుర్చీ వేసుకు కూర్చుని ,గుడి దగ్గరనుండి గాలిలో తేలుతూ వచ్చే పద్యాలను ఆలకిస్తూ మైమరచిపోయేది.
      గుడ్డిలో మెల్లగా రికార్డింగ్ డాన్స్ ల వాళ్ళు ఇంటిటికీ వస్తూ మా ఇంటి ముందుకూ వచ్చి పాటలకు డాన్సులు చేయడం,ఆ పాటలూ, డాన్సులూ ఇంతింతకళ్ళతో మాపిన్ని చూస్తుంటే,మేమూ మాకున్నంత కళ్ళతో  చూసి పిన్నిలాగే మేమూ సంబరపడేవాళ్ళం.
     " మేనత్త మొగుడు-మేనమవ కాడూ,పినతండ్రి పెళ్ళాం -పినతల్లి కాదూ అనే సామెత మా పిన్ని విషయంలో మటుకు అబధ్ధం అని చెప్ప గలను నేను.మా సుఖ దుఃఖాలు తనవిగానే భవించే మా పిన్నంటే మా అందరికీ చాలా ఇష్టం.ఆమె పదికాలాలు బాగుండాలనేదే మా అందరి ఆశ.
                    వాణి
కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal. Nizamabad చెప్పారు…
It's beautiful. Excellent. Nice. Great memories. Thank you for sharing