పునర్జన్మ ...!! > శీరంశెట్టి కాంతారావు >రచయిత > పాల్వంచ*

 ఇప్పుడంటే వీథికో 
ప్రసూతిశాల వచ్చిందిగానీ
మా చిన్నప్పుడు ఊరుకో మంత్రసాని మాత్రమే ఉండేది 
ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా గజేంద్రోపాఖ్యానంలో విష్ణువు మాదిరి వట్టిచేతుల్తో తక్షణమే తరలి వచ్చి
పురిటిగదిలో కాలుపెట్టిందంటే చుట్టతాగినంత సేపట్లో సునాయాసంగా పురుడు  పోసేది 
కారణం!?
రాత్రికి కాన్పు కాబోయే మనిషి 
ఆ పొద్దుగూకులూ చేలో చాకిరీ చేసిరావడమే  
మంత్రసాని వల్లకాదన్న కాన్పు పట్నం పెద్దాస్పత్రికిపోయినా నిజంగానే కష్టమయ్యేది
అంతజ్ఞానం తనకెట్లా పట్టు బడిందని అడిగితే మాత్రం 
ఆ మాట
మా అమ్మమ్మనడగమనేది
కాన్పు చేసి మాయిని నెయిదిబ్బలో పాతిపెట్టిన తరువాతనే ఇంటికి మళ్ళేది
పురిటి మంచంకింద కుంపట్ని 
దిగూట్లో దీపంబుడ్డిని
గుమ్మం ముందట నాగలికర్రు, చీపురుకట్టల్ని, ఇంటి చూర్లో గారమండల్నీ పెట్టించేది
బాలింతల్ని చెవుల్లో దూది
తలకట్లు, నడికట్లు తియ్యకుండా కట్టుదిట్టంచేసేది
సూదికాయమందు తిన్పించేది వంతు వంతుకూ పురిటిగది అలికి,పిల్లకుస్నానంజేయించేది
పదకొండోరోజు వాయిలి, వేప
ఆకుల్తో మసలబెట్టిన ఉడుకునీళ్ళతో తల్లీ పిల్లలకు పురిటి స్నానం, పిల్లకు నామకరణం చేయించేది
పురిటికట్నంతోపాటు కల్లుబొట్టుకు పైసలు వసూలు జేసుకుని తల్లీపిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయేది
మరిప్పటిరోజుల్లో..
మూడోమాసం నుండే బెడ్ రెస్ట్ పేరుతో మంచానికే పరిమితం జేసి, అడ్డమైన మందులిస్తూ
అంతిమంగా పొట్టకోసి బిడ్డను తీస్తున్నారు.కాలం 
కలిసిరాకుంటే,అది సనాతనమైనా,ఆధునికమైనా,
ప్రమాదం అంచున పడక తప్పదు.అందుకే సుఖ ప్రసవం పునర్జన్మ తో పోలుస్తారు!
కామెంట్‌లు