మాఊరి ఫకీరోళ్ళ బజార్లో
ఓ ఒంటరి వృద్ధ మహిళ కాటుక బూబమ్మ వుండేది
తన గుడిశలో వారానికోరోజు రాత్రిపూట పరిశుభ్రమైన పాత బట్ట సన్నటి పీలికను ఐదారు సార్లు నిమ్మరసంలో ముంచి ఎండబెట్టి ముంచి ఎండబెట్టేది
ఆఖరికి ఎండిన దాన్ని గట్టిగా మెలిసి వత్తిని చేసేది
ఓ మట్టి కంచుటి నిండా ఆముదం పోసి అందులో
ఆ వత్తినేసి దాన్ని మూడు ఇటుకరాళ్ళ మధ్యన తాటాకు చుట్టకుదురు మీద పొందించి పెట్టేది
ఇటుకరాళ్ళ మీద ఇత్తడి తాంబాళం బోర్లించి వత్తిని ముట్టించేది
కంచుట్లో ఆముదం ఐపోయిం దాక వత్తి వెలుగుతూ తాంబాళం అడుగున అరచేతి మందాన మసిపేరుకుపోయేది
మరునాడు పొద్దున తాటాకు బద్ధతో తాంబాళం మీది మసితెట్టునంతా ఓ రాతెండి గిన్నెలోకి గీరిపోసేది
అట్లా పోగుచేసిన మసిలో ఆఖరికి చిటికెడంత పచ్చకర్పూరం నాల్గు చుక్కలు గేదె నెయ్యివేసి వాటితోపాటు అవసరమున్నంత ఆముదం చుక్కలు వేసుకుంటూ మసిని పాకంలా కలిపి కాటుకను తయారుచేసేది
తయారైన ఆ కాటుకను ఉసిరికాయ ఆకారంలో అంతలావే వుండే రాగి డిబ్బీల్లో పెట్టి మాఊరు చుట్టుపట్టు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి వాడుకగా అమ్ముకుంటూ గౌరవంగా బతికేది
బూబమ్మ కాటుక కోసం
మా ఊళ్ళల్లో కన్నెపిల్లలు కాచుక్కూర్చునేవాళ్ళు
తరతరాల అనుభవంతో సంతరించుకున్న ఇంతచిన్న జీవన భృతినికూడా సామాన్యులకు మిగలకుండా
యంత్రీకరణ మింగేసింది
ఎక్కడెక్కన్నుండో రకరకాల కంపెనీలు ప్లాస్టిక్ డబ్బాల్లో అందమైన ప్యాకింగుల్లో కాటుకను మార్కెట్లోకి దింపడంతో సాంప్రదాయంగా ఆ వృత్తిమీద బ్రతుకుతున్న పేదవాళ్ళ కంచాల్లో మన్ను బడింది మరో చేతివృత్తి కనుమరుగై పోయింది
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి