కాలం మరచిపోయేలా
చేస్తుందన్నది నిజమని
అందరిలాగానే
నమ్ముతూ వచ్చాను
ఆరేళ్ళు
అనేది క్యాలండర్ లెక్క
వందేళ్ళ భారాన్ని
నా గుండె మోస్తోందన్నది
నిజం
సంవత్సరాలు
కరిగిపోవడం తెలుస్తోంది
కానీ
తీరం చేరడాన్ని
ఇంకా నేర్చుకోలేకపోయిందీ
మనసు
ఇప్పటికింకా
పల్లెటూరిలో
పెంకుటింట్లో
నాన్న జ్ఞాపకాలూ
చేయి పట్టుకుని
నడిపించిన కాలాలూ
నన్ను స్పర్శిస్తూనే
ఉన్నాయి
నా సెల్ఫోన్
మోగడంతోనే
పరుగుపరుగున వచ్చి
ఫోన్ తీసి మాట్లాడిన
క్షణాలింకా గుర్తే
ఇంటి ఆవరణలో
పచార్లు చేసే నాన్న
అడుగుజాడలన్నీ
ఇంకా కళ్ళ ముందు
కదలాడుతున్నాయి
అవి స్మరణకు
రావడంతోనే
నాన్న పిలుస్తున్నట్టే
అన్పిస్తుంది
నాకు ఆకలి వేయడాన్ని
నా పొట్ట కన్నా ముందే
తెలిసిన నాన్న మనసునెలా
మరచిపోగలను
వేలు పట్టుకుని
నాన్న వెంట నడిచిన సమయాలలో
ఆయన చెప్పిన కథలెన్నో
అవన్నీ ఎద లోతుల్లో
గాఢంగా ఉండిపోయాయి
అంపశయ్యపై ఉన్నప్పుడు
నాకోసం వెతికిన
నాన్న చూపులనెలా మరవగలను
నాన్న మంచం అంచులలో
ఇప్పటికింకా నాన్న హస్తరేఖలు
లీలగా పలకరిస్తూనే ఉన్నాయి
తుదిశ్వాసప్పుడు
నాన్న
పాదాలు తాకి
గట్టిగా పట్టుకున్నప్పుడు
కట్టలు తెంచుకున్న కన్నీటి
క్షణాలను
ఈ గుండె తడి
ఎలా మరవగలదు
ఎండనకా
వాననకా
మా అందరి బాగోగులకోసం
చెమటలు చిందించిన
నాన్న జ్ఞాపకాలనుంచి
ఇవతలకెలా
రాగలదీ మనసు
ఆకులు లేని
నా తోటలోని చెట్లల్లో
చిగురించే కాలం
ఇంకా తలెత్తనే లేదు
ఆయనతోనే ఉన్నట్టనిపించే
ఊహలన్నీ
కలలుగానే మిగిలిపోయాయి
కనీసం
కలలోనైనా ఆయనతో
బతికిస్తున్న నిద్రవేళల్నెలా
మరవగలదీ మనసు
అందుకే
నాన్న నాన్నే.....
ఆయన లేని లోటు లోటే
-----------------------------------
(ఈ కవితను తమిళంలో చదివాను.
ఎవరు రాశారో గుర్తుకు రావడం లేదు.
నాన్నమీది మాటలు నిజమే కదా అనిపించి
నోట్ చేసుకున్నవివి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి