"నా పేరు మీ నాన్న పేరే....తెలుసా...నా పేరు జగదీశ్" అన్నాను కల్పన (పాప పేరు మార్చాను).
"అదెలా....మా నాన్న పేరు జగదీశ్...ఆ పేరు నువ్వెలా పెట్టుకున్నావ్?" అని పాప మాట.
అంతేకాదు, వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకెళ్ళి "ఏంటి డాడీ, ఈ అంకుల్ పేరు నీ పేరేనట. అదెలా కుదురుతుంది?" అని వాళ్ళ నాన్న మొహంలో మొహం పెట్టి అడిగింది పాప కల్పన.
అప్పుడా పాప తండ్రి "అవునమ్మా, ఆయన పేరు జగదీశే" అని అంటుండగా ఆ చిన్నారికెంత ఆశ్చర్యమో.
ఆ పాపకే కాదు, నాకూ ఆశ్చర్యంగా అనిపించింది. ఆశ్చర్యమంటే పాపకున్న ఆశ్చర్యం కాదు గానీ నాకున్న ఆనందం వేరు. నాకైతే రచయిత గుడిపాటి వేంకటచలంగారి పెద్దకూతురు సౌరీస్ గారు పెట్టారు. మరి నాలాటి పేరున్న వాళ్ళందరికీ ఎవరు పెట్టుంటారు అని నా ప్రశ్న.
పాప తండ్రిని ఓ మాట అడిగాను "అవును గానీ....మీ పేరే నా పేరు కదండీ. మీ పేరుతోనే నన్ను పిలుస్తుంటే మీకెలా అన్పిస్తుందో" అని.
థ్రిల్లింగ్గా ఉంటుందన్నారాయన.
నేనూ ఆయనను జగదీశ్ గారూ అని పిలుస్తుంటే నాలో ఒకింత ఆనందం....ఒకింత ప్రశ్న. నా పేరుని నేనం పిలుచుకుంటున్నానేమిటీ అని.
ఆయన మిత్రబృందంలో ఇద.దరు ముగ్గురున్నారట "జగదీశ్" అనే పేరుతో. కానీ వాళ్ళెవరూ పేరుతో కాక మారుపేర్లతో పిల్చుకుంటారట.
నా విషయానికొస్తే, నేను జెమినీ టీవీ న్యూస్ ఛానల్లో పని చేస్తున్నప్పుడు నాతోసహా ముగ్గురు పేర్లు జగదీశే. ముగ్గురి రూపాలూ వేర్వేరు. నాకన్నా ముందే ఇద్దరు జగదీశ్ లు ఈ ఛానల్లో పని చేస్తున్నారు. ఆ ఇద.దరిలో ఒకతను లయోలా కాలేజీలో చదువుకుంటూనే ఇక్కడ పని చేస్తున్నారు. ఆయన సన్నగా పొడుగ్గా ఉండేవారు. ఆయనను లయోలా జగదీశ్ అనే వాడిని. ఇంకొక జగదీశ్ ఒకింత పొట్టి. అలాగని మరీ పొట్టేం కాదు. తెల్లగా ఉండేవారు. ఆయనను పాస్ బుక్ జగదీశ్ అని మా ఇంట అనుకునేవాళ్ళం. ఎందుకంటే కొన్ని రోజులు ఈ జగదీశ్ గారు తన బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్కుని నా దగ్గర దాచుకున్నారు. అందుకోసం ఆయన గురించి మా ఆవిడతో చెప్పాల్సి వచ్చినప్పుడు పాస్ బుక్ జగదీశ్ అనే వాడిని. ఇక నేనేమో లయోలా జగదీశ్ కంటే కాస్త పొట్టి. పాస్ బుక్ జగదీశ్ కంటే పొడుగు. రంగు తక్కువే.
అలాగే ఇంకొక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన పేరు జగదీశ్. మా ఆవిడ ఫ్రెండ్ అనురాధ వాళ్ళ భర్త ఆయన. హైదరాబాద్ లో మేము రాంనగర్లో ఉన్నప్పుడు అనూరాధ వాళ్ళు విద్యానగర్లో ఉండేవారు. అప్పుడప్పుడూ వాళ్ళ ఇంటికి మేము వెళ్తే వాళ్ళు బదంలుగా అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవారు. ఆ జగదీశ్ పొట్టి. లావు. ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు.
ఇక దుకాణాల మీద ఎక్కడైనా జగదీశ్ అనే పేరు చూస్తుంటే తెలియని ఆనందం.
ఇప్పుడు మేముంటున్నది హైదరాబాద్లో మౌలాలీలో ఉన్న గాయత్రీ నగర్లో. ఇక్కడికి దగ్గర్లో ఉన్న కుషాయిగూడాలో ఓ రెండు షాపులు చూసాను పక్కపక్కనే ఉన్న ఈ రెండు దుకాణాల పేర్లు...ఒకటేమో జగదీశ్ కలెక్షన్స్. మరొక దుకాణం పేరు రాము సెలక్షన్స్. రెండు షాపుల పేర్లూ వేర్వేరు కావచ్చు కానీ జగదీశ్ - రాము అనే పేర్ల మధ్య ఓ బంధముంది. నాకొక మంచి మిత్రుడున్నాడు. అతని పూర్తి పేరు నంబూరి రామలింగేశ్వరరావు అయినప్పటికీ నేను ఆయనను రాము అనే పిలుస్తాను. అందువల్ల ఈ షాపుల పేర్లు "జగదీశ్ - రాము" అని పక్కపక్కనే ఉండటంతో ఏదో తెలియని ఆనందం.
తిరువణ్ణామలైలోని చలంగారింట ఓ జగదీశ్ ఉండేవారు. ఆయన బెంగాల్ నుంచి వచ్చారు. ఆయన రమణమహర్షి భక్తుడని గుర్తు. నిజానికి ఆయన ఇంజనీర్. కానీ రమణమహర్షి పై భక్తితో తిరువణ్ణామలైలో ఉండేవారు. ఓ కౌపీనం ధరించే తిరిగే వారు. ఆయనతో మాట్లాడటం లేదుగానీ చూసాను.
ఇంకొక్క విషయం....
జగదీశ్ అంటే ఈశ్వరుడని అనుకునే వాడిని. తర్వాతే తెలిసింది జగదీశ్ అంటే విష్ణువనే అర్థమని.
ఏదైతేనేం, నా పేరు నాకిష్టం.
కానీ నన్ను "జగదీశ్" పేరుతో పిలిచేవాళ్ళు తక్కువ మందే. చాలా మంది జగ్గూ అనీ, జగ్గా అనే పిలుస్తారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి