గురు దేవోభవ(3)-గురుపూజోత్సవము:- బెహరా ఉమామహేశ్వరరావు--జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సెల్ నెంబరు: 9290061336

 ఈరోజు ప్రత్యేకత. "గురు పూజోత్సవదినం," దీనినే
"ఉపాధ్యాయ దినోత్సవం" అని కూడా అంటాం. ఇది గురువులను గౌరవించుకునే పవిత్ర దినం. ఈ ఉత్సవం  కేవలం ఒక గ్రామం, ఒక పట్టణం ఒక ప్రాంతం గాక  దేశం నలుమూలలా ఉండే గురువులను సత్కరించుకునే పవిత్ర దినం‌, ఈ రోజు.
మన భారతీయులు జరుపుకునేవి;
మొదటిది సాంస్కృతిక పండుగలు మరియు రెండవది ష జాతీయ పండుగలు. 
 జాతీయ పండుగలలో అతి పవిత్రమైన పండగ ఇదే. ఈ పండుగకు మూల పురుషుడు, మహోన్నతుని  జన్మదినం, అదే సెప్టెంబర్ 5వ తేదీ. కీర్తి కెక్కిన
మహా మహోపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం. ఈయన పుట్టినరోజు జరపుతామని  జన్మదిన సంబరాలు చేస్తామని కొంతమంది పెద్దలు, ఆయనను అడిగితే, ఆయన
'నా జన్మదినం కాదు, దేశంలోని ఉండే ఉపాధ్యాయు లందరికీ ఉత్సవంగా, సంబరాలు జరిగితే  బాగుం టుంది."అని పెద్ద మనసుతో తెలియజేశారు.
ఆయన మాట ప్రకారం నాటి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినమే ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతా ఉత్సవాలు జరుపు కుంటున్నాం. 
ఆ మహనీయుని జీవితంలో కొన్ని విశేషాలను
మననం చేసుకోవడం‌ సముచితం.
ఆరోజు 1952 ఏప్రిల్ 5వ తేదీ. మాస్కో నగరం. రష్యా అధినేత స్టాలిన్ నుండి భారత రాయబార కార్యాలయానికి ఒక లేఖ వచ్చింది.అదే భారత రాయబారి రాధాకృష్ణన్ గారిని  ఆహ్వానిస్తూ రష్యా అధినేత  స్టాలిన్ పంపిన లేఖ. అందరికీ అమితమైన ఆశ్చర్యం కలిగించింది. ఆయన రాయబారులను కనీసం పలకరించేవాడు కాదు. అంతకు ముందు రష్యాలో భారత రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ 18 నెలలు పని చేశారు. కానీ ఆమెకు  ఇంటర్వ్యు  లభించలేదు.
రాధాకృష్ణ తత్వవేత్త సౌమ్యుడు. రాజకీయాలు దౌత్య వ్యవహారాలతో ఆయనకు అంతగా పరిచయం లేదు.ఇక స్టాలిన్ చూద్దామా క్రూరుడు. వారిద్దరి మనస్థత్వాలకు సరిపడదు. కానీ  రాధాకృష్ణన్ రోజుకు 18 గంటలు రాయడం చదవడంలోను గడుపుతారని విన్నాడు స్టాలిన్.
ఆ ఆహ్వానం అందుకున్న రాధాకృష్ణన్, తన కార్యాలయ ఉద్యోగి రాజేశ్వర దయాళుతో పాటు స్టాలిన్ ఉండే గదిలో ప్రవేశించాడు. అక్కడ రష్యా విదేశాంగ మంత్రి విటాని స్కీ మరియు దుబాసిగా పావ్ లోవ్  ఉన్నారు.
వారిద్దరి సమావేశంలో అశోక చక్రవర్తి ప్రస్తావన కూడా వచ్చింది. కళింగ యుద్ధం చేసి వేలాది మంది సైనికు
లను చంపి విజయం సాధించిన కడకు సన్యాసి అయ్యాడు. మీకు అటువంటి పరిస్థితి కలగ వచ్చునని స్టాలిన్ తో అన్నారు రాధాకృష్ణన్.
అవును అద్భుత సంఘటనలు  జరుగుతాయి, అన్నాడు స్టాలిన్. చివరిగా స్టాలిన్ తలపై రాధాకృష్ణ తన చేతితో నిమురుతూ నెమ్మదిగా ఆడించారు.
స్టాలిన్-నన్ను రాక్షసునిగా కాక మనిషిగా గుర్తించింది మీరు ఒక్కరే. మీరు త్వరలో స్వదేశానికి వెళుతున్నారని విన్నాను. నాకు విచారంగా ఉంది. నేను ఇక ఎంతో కాలం బ్రతికను,"అన్నాడు. ఆ తరువాత ఆరు నెలలకే చనిపోయాడు. అలాగే గాంధీజీ హత్యకు గురి కాక కొద్ది రోజులు ముందు రాధాకృష్ణన్ గాంధీజీని కలుసుకున్నారు. తాను రాసిన భగవద్గీత ఆంగ్లానువాదం గాంధీజీకి అంకితం చేయదలచినట్లు చెప్పారు. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ,
"మీ రచనలు చాలా గొప్పవి. నేను మీ అర్జునుణ్ణి మీరు  నా కృష్ణ భగవాన్.  ఇది నా అభిప్రాయం వినండి,"అన్నారు గాంధీజీ,
ఇలా గాంధీజీ మన్ననలందుకున్న మహనీయుడు.
 రాధాకృష్ణన్ గొప్పతనము చాటే అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ రెండు ఉదాహరణలు మాత్రమే.
    రాధాకృష్ణన్ మద్రాసుకు 40 మైళ్ల దూరంలో ఉన్న తిరుత్తణిలో 5 సెప్టెంబర్ 1888 తేదీన  జన్మించారు. తల్లి సీతమ్మ,తండ్రి వీరాస్వామయ్య ఒక జమిందారిలో తహసీల్దారు. ప్రాథమిక విద్య అంతా తిరుత్తణిలో జరిగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. బాల్యం నుండి  చాలా తెలివైనవాడు.
ఇరవై ఒక్క సంవత్సరాలు దాటకముందే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసరు అయ్యారు. మనస్తత్వ శాస్త్రంలో అతని ప్రతిభ కారణంగా మైసూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, రాధాకృష్ణన్ ను ప్రొఫెసర్ గా నియమించారు.  డా.అసుతోష్ మిశ్రా మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ కోరికపై కలకత్తా విశ్వవిద్యాలయం వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
ఆరోజు ఆయన ఇంటి ముందు గుర్రం బండి సిద్ధంగా ఉంది. గుర్రాలకు బదులుగా తన విద్యార్థులే రైల్వే స్టేషన్ వరకు ఆయనను కూర్చోబెట్టి బండిని లాక్కుని వెళ్లారు. కలకత్తాలో ఉన్నప్పుడే 'భారతీయ తత్వ  శాస్త్రం' అన్న గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది.
1931లో డా.సీ.ఆర్. రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ గా పనిచేశారు. ఈయన పిలుపుమేరకు  ప్రొఫెసర్ డా. హీరేన్ ముఖర్జీ, హుమయూను కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు గా పనిచేశారు 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవ అధ్యాపకులయ్యారు. చైనా  అమెరికా వంటి  దేశాలు తిరిగి ప్రసంగాలు చేశారు. 1939 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.
1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు14 -15 తేదీన మధ్య రాత్రి స్వాతంత్రం సందర్భంగా శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం అందరిని ఎంతో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి  అధ్యక్షులు డా. రాధాకృష్ణన్.
ప్రధాని నెహ్రూ కోరిక మేరకు1952 - 62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పని చేశారు. మరియు 1962 లోబాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి  పదవి నుండి విరమించుకున్నారు. తరువాత  డాక్టర్ రాధాకృష్ణన్ రాష్ట్రపతి అయ్యారు.ఈ ఐదేళ్ల కాలంలో అనేక దేశాలు పర్యటించారు. అసమానమైన వాగ్ధాటితో ప్రాచ్య పాశ్చాత్య తత్వశాస్త్రంపై ఈయన చేసిన ప్రసంగాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి.
ఈయన అనేక రచనలు చేశారు ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్  రిప్లెక్షన్
రికవరీ ఆఫ్ ఫేమ్, ఎ సోర్సు బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించారు.
ప్రపంచంలో అనేక విశ్వవిద్యాలయాలు రాధా కృష్ణన్ ను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం,త వారిని "భారతరత్న" తో సత్కరించింది.
1975లో "టెంపుల్ టన్" బహుమతితో 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతి పై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాథాకృష్ణన్ గారు,డా.కె.ఎం. మున్షి గారితో కలసి భారతీయ విద్యా భవన్ స్థాపించారు.
   రాధాకృష్ణన్ మానవ జీవితంలో  మంచిని పెంచాలని ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని మతాన్ని అర్థం చేసుకోవాలని బోధించారు.
 మానవులలోని మమతానురాగాలు పెంచుటకు ప్రపంచం కృషిచేయాలని కోరారు.
 అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలన్ని శాంతిని పెంచాలన్నారు.
 రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తరువాత (1967) చివరి రోజు వరకు మద్రాసులోని తన భవనంలో తాత్విక చింతన చేస్తూ 17- 4 -1975 న పరమ పదించారు.
గొప్ప మేధావిగా, గొప్ప గ్రంథకర్తగా ,తత్వవేత్తగా మహనీయునిగా ప్రపంచ దేశాల మన్ననల‌ందు కున్న డా.రాధాకృష్ణన్ భారతీయమహర్షుల కోవకు చెందిన వారే అనుట అతిశయోక్తి కాదు.
    ‌   మహోపాధ్యాయునిగా గుర్తించిన భారతదేశం రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయ దినోత్సవం దేశమంతటా ఏటా జరుపుకోవడం ఎంతో సముచితం.
       

కామెంట్‌లు