కోతివింతకోరిక:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716

 ఒక అడవికి ఏనుగు రాజుగా ఉండేది. ఒకసారి ఏనుగు కాలుకు గాయమయింది. నొప్పితో బాధగా ఉంది. ఆఅడవిలో ఒక కోతికి గాయాలను నయంచేసే ఆకులు తెలుసు.జంతువులు గాయాలను నయం చేసుకోవడానికి కోతికి పండ్లను  ఇచ్చేవి. గజరాజు పిలుపు మేరకు ఆకుపసరు తీసుకుని వెళ్లింది కోతి. 
ఏనుగు కాలిగాయానికి పసరు రాసి "మహారాజా!ప్రతిరోజు మీదగ్గరకు వచ్చి ఆకుపసరు రాస్తాను. మీగాయాన్ని నయం చేస్తాను.గాయం తగ్గిపోయాక మీరు నాకోరిక తీర్చాలి" అంది కోతి. 
"నేను రాజును కదా! ఏకోరికైనా తీర్చగలను. నీకు ఏంకావాలో అడుగు" అంది ఏనుగు.
 "మీరు ధర్మప్రభువులు.ఆడినమాట తప్పర ని తెలుసు. మీగాయం పూర్తిగా నయం చేశాక అడగడం సమంజసంగా ఉంటుంది. ఆరోజు అడుగుతాను" అంది కోతి.
కొన్నిదినాలకు గజరాజు గాయం తగ్గిపోయింది. ఏనుగు బాగా తిరగసాగింది. "నీకు ఏంకావాలో కోరుకో! ఇస్తాను." అంది ఏనుగు.
కోతి నసుగుతూ "మహారాజా!ఒకరోజంతా నేను ఈఅడవికి రాజునై మీపైన కూర్చుని అడవిఅంతా తిరగాలని ఉంది" అంది కోతి.
కోతి ఏఆహారపదార్థాలనో అడుగుతుందను కున్న ఏనుగు కోతికోరికకు ఉలిక్కిపడింది. కొద్దిసేపటికి తేరుకున్న ఏనుగు "ఇచ్చిన మాట తప్పడం మావంశంలో లేదు. అలాగే కానివ్వు"అంది.
కోతిని ఒకరోజు అడవికి రాజుగా ప్రకటించిం ది. కోతి ఏనుగుపైన ఎక్కింది. రెండూ వెడుతుంటే ఒకచోట బురదగుంటలో చిక్కుకుపోయిన ఆవు కనిపించింది. ఆవు ఏనుగును చూడగానే "మహారాజా!నన్ను కాపాడండి"అంది.ఆవు తనను వేడుకుం టోందని భావించిన కోతి ఛెంగున కిందకు దూకింది.బురదగుంటచుట్టూ రెండుసార్లు తిరిగింది.ఏంచేయాలో అర్థంకాక ఏనుగు మీదకు ఎక్కి కూర్చుంది. ఏనుగు విరిగిన పెద్దకొమ్మను తెచ్చి ఆవునోటికి అందించి తొండంతో కొమ్మను రెండవవైపు పట్టుకుని లాగి ఆవును కాపాడింది. 
ఏనుగు,కోతి వెళ్తుంటే దారిలో పచ్చిక మేస్తున్న లేడిని చంపడానికి చెట్టుచాటున నిలబడి బాణం గురిపెడుతున్న వేటగాడు కనిపించాడు.ఏనుగు బిగ్గరగా ఘీంకరించింది. వాడు భయంతో పరుగెత్తి పోయాడు.లేడికి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమంది ఏనుగు.
కోతి ఏనుగుపోతుంటే దారిలో ఒక జామ పండు కోసం కొట్లాడుకుంటున్న రెండు ఉడతపిల్లలు కనిపించాయి. 'నేను ఈ అడవికి రాజునుకదా! వీటి సమస్యను పరిష్కరించాలి'అనుకుంటూ కిందకుదిగి ఉడతలదగ్గరకు వెళ్లి "మీసమస్యఏంటి?" అందికోతి.
"అమ్మ మాకు ఈపండు ఇచ్చి వెళ్లింది. నేను పెద్దదాన్ని కాబట్టి పండు నాకే ఇవ్వాలి కదా!" అంది పెద్దఉడత.
 "నేను చిన్నదాన్ని కాబట్టి పండు నాకే ఇవ్వాలి కదా!"అంది చిన్నఉడత.
కోతి ఒక్కనిమిషం ఆలోచించి "ఈపండు కోసమేకదా మీకొట్లాట. ఈపండు నేను తీసుకుంటాను.పండు లేకుంటే సమస్యే ఉండదుకదా!"తన తెలివికి గర్వపడుతూ అంది కోతి. పండును తీసుకుని ఎంత తెలివిగా సమస్యను పరిష్కరించానో చూడమని ఏనుగువైపు గర్వంగా చూసింది.
ఏనుగు కోతి దగ్గరనుండి పండును తీసుకుని "ఈపండును చెరిసగం పంచుకుని తినండి.అంతా మనకే కావాలి అనుకోకుం   డా  పంచుకుని తినడం ఉత్తమలక్షణం" అని చెప్పి పండును ఉడతలకిచ్చింది. 'ఈఆలోచన ఎంతబాగుందో!' అనుకుంటూ ఉడతలు,కోతి మురిసిపోయాయి.
కోతి,గజరాజు పాదాలకు నమస్కరించి "మహారాజా!నేను ఆవును కాపాడేశక్తి, ఆలోచన లేనిదాన్ని. వేటగాడినుండి జింకను కాపాడాలనే ఆలోచనలేక వెంటనే మీలాగా స్పందించలేకపోయాను.ఉడతపిల్లల చిన్నసమస్యను పరిష్కరించలేని మట్టి బుర్రనాది.ఒక్క నిమిషంకూడా అడవికి నాయకత్వం వహించే అర్హత నాకులేదు. మనశక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండా. అభివృద్ధి చేసుకోకుండా అందలం ఎక్కాలనుకోవడం అత్యాశ అవుతుందని గ్రహించాను. నన్ను క్షమించండి" అని చెప్పి వెళ్లిపోయింది.

కామెంట్‌లు